మైకేల్ కారిక్ ఇంటర్వ్యూ
ఈసారి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) సీజన్ తమ జట్టుకు మిశ్రమంగా ఉందని 11 ఏళ్లుగా మాంచెస్టర్ యునైటెడ్ జట్టు తరఫున ఆడుతున్న మిడ్‌ఫీల్డర్ మైకేల్ కారిక్ తెలిపాడు. అయినా తాము టాప్–4లో కచ్చితంగా చోటు దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. విజయాలతో పాటు పరాజయాలు ఎదుర్కొంటున్న ఈ జట్టు ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండగా మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఆదివారం అర్సెనల్‌తో జరిగే కీలక పోరులో తలపడబోతున్న యునైటెడ్ జోస్ మౌరిన్హో పర్యవేక్షణలో దూసుకెళుతుందని గాయంతో బాధపడుతున్న కారిక్ చెబుతున్నాడు.
ప్రస్తుతం మీ జట్టుకు కఠిన మ్యాచ్‌లు ఎదురవుతున్నాయి. మాంచెస్టర్ సిటీ తర్వాత ఇప్పుడు అర్సెనల్‌ను ఎదుర్కొనబోతున్నారు. ఆ తర్వాత టాటెన్‌హమ్‌తో తలపడాల్సి ఉంది. ఇదంతా జట్టుకు కష్టంగా సాగబోతుందా?
మేము అలా భావించడం లేదు. దీన్ని ఓ అవకాశంగా తీసుకుని పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. విజయాలు సాధించి జట్టు పాయింట్లు పెంచడంపైనే మా దృష్టి ఉంది. అదే జరిగితే ఈ సీజన్ మాకు మేలు చేస్తుంది.
అయితే ఈ మ్యాచ్‌లను ఒత్తిడిగా భావించడం లేదా?
లేదు. ఈ సీజన్‌ను మెరుగ్గా ముగించేందుకే మేం ఎదురుచూస్తున్నాం. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవాలని కోరుకుంటున్నాం.
టాప్–4లో నిలవాలంటే అర్సెనల్‌తో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారా?
ఇక మా చేతుల్లో ఎక్కువగా మ్యాచ్‌లు లేవు. అందుకే టాప్–4లోకి వెళ్లాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమే. ఇప్పుడు విజయాలు మాకు అవసరం.
ఈ సీజన్‌లో మీ జట్టు ఎక్కువగా ‘డ్రా’లు సాధించింది. విజయానికి దగ్గరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇది మీకు నిరాశ కలిగించిందా? అవును. ముఖ్యంగా సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌ల్లో ఇలాంటి ఫలితం రావడం చికాకు తెప్పించింది. సీజన్‌లో మా ఫామ్‌పై ఆందోళన లేదు. అద్భుతంగా ఆడుతున్నా ఫలితం అనుకూలంగా రావడం లేదు. దీంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.
ఇక ప్రతీ మ్యాచ్ కీలకమే
Published Sat, May 6 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
Advertisement
Advertisement