లండన్: నేటి నుంచి ఆరంభమయ్యే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జట్లు ‘జాత్యహంకారానికి తావు లేదు (నో రూమ్ ఫర్ రేసిజమ్)’ అనే బ్యాడ్జీలతో బరిలోకి దిగనున్నాయి. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ (బీఎల్‌ఎమ్)’ స్థానంలో ఈ నినాదాన్ని వాడనున్నట్లు ఈపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ మాస్టర్స్ తెలిపారు. ఈ ఏడాది మేలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి బలి కావడంతో ‘బీఎల్‌ఎమ్’ ఉద్యమం ఊపిరిపోసుకుంది. ఈ ఉద్యమానికి సంఘీభావంగా ఈపీఎల్ జట్లు తమ జెర్సీలపై ‘బీఎల్‌ఎమ్’ లోగోను ముద్రించుకొని గత సీజన్‌లో మ్యాచ్‌లను ఆడాయి. 2020–21 సీజన్‌లో నినాదం మారినా... వివక్ష ఏ రూపంలో ఉన్నా అది అంతం కావాలనే మేం కోరుకుంటామని రిచర్డ్ పేర్కొన్నారు. గతంలోలాగే మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని జాత్యహంకారానికి నిరసన తెలియజేస్తారని ఆయన తెలిపారు.
(చదవండి: సెరెనా మరో ‘సారీ’)
‘బ్లాక్ లైవ్స్...ముగిసిపోయిందా’
మాంచెస్టర్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లపై వెస్టిండీస్ పేస్ దిగ్గజం, కామెంటేటర్ మైకేల్ హోల్డింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ (బీఎల్‌ఎమ్)’ ఉద్యమానికి చరమగీతం పాడారా...! అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లలో ‘బీఎల్‌ఎమ్‌కు’ మద్దతుగా మ్యాచ్‌కు ముందు మోకాలిపై ఉన్న ఆటగాళ్లు... ఇప్పుడు అలా ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు. కనీసం ‘బీఎల్‌ఎమ్’ లోగోలను కూడా తమ జెర్సీలపై ధరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెస్టిండీస్ జట్టు తమ పర్యటనను ముగించుకొని స్వదేశానికి వెళ్లిపోగానే ‘బీఎల్‌ఎమ్’ ముగిసిపోయిందని మీరు భావిస్తున్నారా... అంత నిర్లక్ష్య ధోరణి తగదంటూ వారికి హితవు పలికారు.
‘ఇది ఎంత మాత్రం నల్లజాతీయులకు, శ్వేత జాతీయులకు మధ్య జరిగే పోరాటం కాదు. ఇది మానవత్వానికి, సమాన హక్కులకు సంబంధించినది. అంతేకాకుండా ‘బీఎల్‌ఎమ్’ అనేది అమెరికాకు మాత్రమే పరిమితం కాదు. అలా అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్లే’ అని హోల్డింగ్ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ఒక సమావేశంలో మాట్లాడిన ఆసీస్ కెప్టెన్ ఫించ్... మ్యాచ్‌కు ముందు తాము మోకాలిపై ఉండబోమని స్పష్టం చేశాడు. నిరసన కంటే దాని గురించి వ్యక్తుల్లో అవగాహన పెంచడం ముఖ్యమంటూ అతడు వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందించిన హోల్డర్ ‘నీకు మద్దతు ఇవ్వాలని ఉంటే ఇవ్వు... లేదంటే ఊరికే ఉండు. అంతే కానీ కుంటి సాకులు చెప్పకు’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment