ఇంగ్లండ్ ఈసారైనా..!
గ్రూప్-డి
విశ్లేషణ
ఇంగ్లండ్, ఇటలీ,
ఉరుగ్వే, కోస్టారికా
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)కు ఉన్న ఆదరణ, ఆ లీగ్‌పై ఆటగాళ్లకున్న మోజు అంతా, ఇంతా కాదు. ప్రపంచంలోని ప్రతి ఆటగాడు ఈపీఎల్‌లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతుంటాడు. అయితే ఇంతటి ఆదరణ ఉన్న ఈపీఎల్‌ను నిర్వహించే ఇంగ్లండ్.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. ఎప్పుడో 1966లో తాము స్వయంగా ఆతిథ్యమిచ్చిన సందర్భంలో మాత్రమే ప్రపంచకప్‌ను గెలవగలిగింది. ఈసారి ఇంగ్లండ్‌కు గ్రూప్ దశలోనే గట్టి పోటీ ఎదురుకానుంది.
ఇంగ్లండ్‌తోపాటు నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ ఇటలీ, రెండుసార్లు విజేత ఉరుగ్వేలతో గ్రూప్ ‘డి’ సంక్లిష్టంగా ఉంది. కోస్టారికా నాలుగో జట్టుగా ఉన్న ఈ గ్రూప్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఇంగ్లండ్ అధిగమిస్తుందా.. నాకౌట్‌కు చేరి టైటిల్ పోరు దిశగా పయనించగలుగుతుందా అన్నది చూడాల్సిందే.
ఇంగ్లండ్
యూరప్ నుంచి అర్హత సాధించిన 13 జట్లలో ఇంగ్లండ్ ఒకటి. క్వాలిఫయర్స్‌లో తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిందే కానీ.. ఆ స్థానం ఇంగ్లండ్‌కు అంత తేలిగ్గా లభించలేదు. ఇక 13 సార్లు క్వాలిఫై అయినా ఒక్కసారి మాత్రమే విజేత కాగలిగింది. ఈసారి తమ గ్రూప్‌లో ఇటలీ, ఉరుగ్వేలతో కఠిన పరీక్ష ఎదురు కానుంది. అయితే క్వాలిఫయర్స్‌లో చూపిన తెగువను మరోసారి కనబరిస్తే నాకౌట్‌కు చేరుకోవచ్చు.
ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1950లో తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్.. వరుసగా నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఐదోసారి 1966లో చాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శన 1990లో సెమీఫైనల్‌కు చేరడమే.
కీలక ఆటగాళ్లు: ఫార్వర్డ్ ఆటగాడు వేన్ రూనీ ఈ జట్టులో అత్యంత కీలకం. ఇతనికితోడు కెప్టెన్ స్టీవెన్ గెరార్డ్, ఫ్రాంక్ లాంపార్డ్ వంటి అనుభవజ్ఞులైన మిడ్‌ఫీల్డర్లు, జాక్ విల్‌షర్, అలెక్స్ ఆక్స్‌లేడ్, ఆండ్రోస్ టౌన్‌సెండ్‌లపై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది.
కోచ్: రాయ్ హాడ్జ్‌సన్
అంచనా: ప్రిక్వార్టర్స్‌కు చేరవచ్చు
ఉరుగ్వే
తొలి ప్రపంచకప్‌లోనే విజేతగా నిలిచిన ఉరుగ్వే..దిగ్గజాల్లో ఒకటిగా వెలుగొందింది. అయితే మళ్లీ 20 ఏళ్లకుగాని మరో టైటిల్ సాధించలేకపోయింది. దక్షిణ అమెరికాలో బలమైన జట్టుగానే కొనసాగుతూ వస్తోంది. 2010లో సెమీఫైనల్‌కు చేరడం ద్వారా మళ్లీ పూర్వవైభవాన్ని సాధించిన ఉరుగ్వే.. ఈసారి అర్హత పొందేందుకు తీవ్రంగానే శ్రమించాల్సివచ్చింది. గ్రూప్‌లో బలమైన ప్రత్యర్థులున్నందున నాకౌట్‌కు చేరడం అంత తేలిక కాకపోవచ్చు.
ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1930 తరువాత మళ్లీ 1950లో టైటిల్ సాధించింది. 1970లో సెమీఫైనల్ దాకా వెళ్లింది. 1974, 2002లోనూ ప్రపంచకప్‌కు అర్హత సాధించినా.. గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. గత ప్రపంచకప్ (2010)లో సెమీఫైనల్లో ఓడింది.
కీలక ఆటగాళ్లు: స్టార్ ఆటగాడు లుయిస్ స్వారెజ్, ఎడిన్సన్ కవానిలు ఈ జట్టుకు కీలకం కానున్నారు. క్వాలిఫయర్స్‌లో స్వారెజ్ 11 గోల్స్ సాధించి ఉరుగ్వే అర్హత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. డీగో లుగానో సారథ్యానికి తోడు ఫెర్నాండో ముల్సేరా వంటి పోరాట పటిమ గల గోల్‌కీపర్ ఈ జట్టుకు అదనపు బలం.
కోచ్: ఆస్కార్ వాషింగ్టన్ తబరెజ్
అంచనా: ఇంగ్లండ్, ఇటలీలలో ఒకరిని ఓడిస్తే గ్రూప్ దశ దాటే అవకాశం.
కోస్టారికా
గ్రూప్‌లో బలహీనంగా కనిపిస్తున్న జట్టు కోస్టారికా. 1921లో ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టినా.. ప్రపంచకప్‌లో అడుగు పెట్టేందుకు మాత్రం 1990 దాకా పోరాడాల్సివచ్చింది. ఆ టోర్నీలో ప్రి క్వార్టర్స్ దాకా వెళ్లగలిగింది. ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా కోస్టారికా అత్యుత్తమ ప్రదర్శన ఇదే. కాగా, ఈసారి క్లిష్టమైన గ్రూప్‌లో ఆడుతున్నందున తొలి రెండు స్థానాల్లో నిలవడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు.
ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1990లో ప్రి క్వార్టర్స్ దాకా వచ్చిన కోస్టారికా.. ఆ తరువాత 2002, 2006లలో అర్హత సాధించి గ్రూప్ దశకే పరిమితమైంది.
కీలక ఆటగాళ్లు: కోస్టారికా ఆశలన్నీ బ్రియాన్ రుయిజ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. పలు లీగ్‌లలో అద్భుత ఆటతీరుతో జట్టులో రుయిజ్ కీలక ఆటగాడిగా మారాడు. ఆల్వరో సబోరియో, క్రిస్టియాన్ బోలనోస్, గోల్ కీపర్ కీలర్ నావస్‌లూ ప్రధాన పాత్ర పోషించనున్నారు.
కోచ్: జార్జ్ లూయిస్ పింటో
అంచనా: గ్రూప్ దశ దాటడం కష్టమే
ఇటలీ
యూరప్‌లోని సాకర్ దిగ్గజాల్లో ఒకటైన ఇటలీ ఇప్పటికి నాలుగుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అటాకింగ్ గేమ్‌కు పెట్టింది పేరైన ఇటలీ ఈసారి క్వాలిఫయర్స్‌లో ఓటమన్నదే లేకుండా.. ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఇంగ్లండ్, ఉరుగ్వేల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నా.. నాకౌట్‌కు చేరడం మాత్రం ఖాయమనే చెప్పవచ్చు.
ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1934, 1938లలో వరుసగా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తిరిగి 1982లో స్పెయిన్‌లో మళ్లీ ప్రపంచ కిరీటాన్ని సాధించింది. అయితే రెండు సార్లు (1970, 1994) తుదిపోరుకు చేరుకున్నా.. ఫైనల్లో ఓడింది. 2006లో జర్మనీలో మరోసారి విజేతగా నిలిచింది.
కీలక ఆటగాళ్లు: జర్మనీలో 2006లో ఇటలీని విజేతగా నిలిపిన జట్టులో సభ్యుడు, గోల్‌కీపర్ జియాన్‌లిజి బఫాన్ ప్రస్తుతం సారథ్యం వహిస్తున్నాడు. మారియో బాలెటెల్లీ, పాబ్లో ఓస్వాల్డో వంటి స్టార్ ఆటగాళ్లు ఈ జట్టు ప్రధాన బలం.
కోచ్: సెసేర్ ప్రాడెల్లి.
అంచనా: సెమీఫైనల్ దాకా వెళ్లే అవకాశం