EPL
-
ఈపీఎల్‌ను దాటేసిన ఐపీఎల్!
లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ యూకేలోనూ రికార్డులు బద్ధలు కొడుతోంది. వ్యూయర్షిప్ పరంగా ఐపీఎల్ యూకేలో కొత్త పుంతలు తొక్కుతోంది. బ్రిటన్‌లో అత్యధిక ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ లీగ్‌లో ఒకటైన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్) ను కూడా దాటేసి అత్యధిక వ్యూస్‌ను సాధించింది ఐపీఎల్. బ్రాడ్‌క్యాస్టర్స్ ఆడియన్స్ రీసెర్చ్ బోర్డు (బీఏఆర్‌బీ) నివేదిక ప్రకారం.. వారం రోజుల వ్యవధిలో ఐపీఎల్-2020 సీజన్‌ను 7,97,000 మంది తిలకించారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లను యూకేలో తిలకించిన వారి సంఖ్య. ఈ తరహాలో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ను యూకేలో వీక్షించడం ఇదే తొలిసారి. (‘టాప్ మోస్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు’) అంతకుముందు ఈపీఎల్ కూడా ఇంతటి స్థాయిలో వ్యూయర్షిప్ లభించలేదని బీఏఆర్‌బీ తన ప్రకటనలో తెలిపింది. గతేడాది ఐపీఎల్‌తో పోల్చుకున్నా కూడా ప్రస్తుత ఐపీఎల్ వ్యూయర్షిప్ అత్యధికమని పేర్కొంది. గత కొన్ని వారాల నుంచి యూకేలో ఐపీఎల్‌ను వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. యూకేలో గత ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌లను 5,86,000 మంది తిలకించగా.. ఈ సీజన్ నాటికి ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుత ఐపీఎల్‌కు యూకేలో 11 శాతం వ్యూయర్షిప్ పెరిగిందని, ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యే సమయానికి వ్యూవర్షిప్ మరింత పెరగొచ్చనే అంచనాల ఉన్నాయి. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా న్యూ క్యాజిల్ యునైటెడ్, మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్‌సీ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను 40 వేల మంది వీక్షించారు. లివర్‌పూల్-షెఫ్ఫీల్డ్ యునైటెడ్ మ్యాచ్‌ను 1,10,000 మంది, ఆర్సెనాల్-లీసెస్టర్ సిటీ మ్యాచ్‌ను 1,40,000 మంది వీక్షించారు.(ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) -
జట్టులో ఆడే అవకాశం రాకుంటే ఇతర జట్లలోకి వెళ్లొచ్చా.?
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్(ఈపీఎల్)లా ఆటగాళ్లు జట్టును మార్చుకునే ‘మిడ్ డే టోర్నమెంట్ ప్లేయర్ ట్రాన్స్ఫర్’ నిబంధనను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈపీఎల్ నిబంధనల ప్రకారం జట్టులోని ఆటగాడికి సీజన్లో జరిగే తొలి ఏడు మ్యాచుల్లో అవకాశం ఇవ్వకుంటే నిరభ్యంతరంగా ఇతర జట్లలోకి వెళ్లవచ్చు. అయితే ఇతర జట్టు అవకాశం కల్పించినపుడే ఇది సాధ్యమవుతుంది. ఇదే నిబంధన ఐపీఎల్-11 సీజన్లో అమలు చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ యోచిస్తున్నట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది. మంగళవారం జరిగిన బీసీసీఐ- ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఆ పత్రిక ప్రచురించింది. ఈ నిర్ణయానికి ప్రాంచైజీ యజమానులు అంగీకరించారని కూడా పేర్కొంది. -
టైటిల్ నెగ్గడం సులువు కాదు
అర్సెనల్ కీలక ఆటగాడు నాచో మోన్రియల్. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను... గతేడాది సంతృప్తికరంగా ముగిసిందని... అదే ఉత్సాహంతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆరంభిస్తామని చెప్పుకొచ్చాడు. ఈపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళుతున్న అర్సెనల్ జట్టు... ఇపుడు సమవుజ్జీ అయిన చెల్సీతో సమరానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో మోన్రియల్ తన అనుభవాలు ఇలా పంచుకున్నాడు. మీకు, మీ జట్టుకు గతేడాది ఎలా గడిచిందనుకుంటున్నారు. తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన చెల్సీతో పోరుకు సిద్ధమేనా? మా వరకైతే 2016 మంచి ఫలితాలనే ఇచ్చింది. టైటిల్ రేసులో మమ్మల్ని ఫేవరేట్‌గా చేసింది. వ్యక్తిగతంగా నాకిది చాలా సంతోషాన్నిస్తోంది. కొత్త సంవత్సరంలోనూ అర్సెనల్ జోరు కొనసాగేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. 2017కు విజయంతో శుభారంభం పలకాలని భావిస్తున్నా. టైటిల్ రేసులో ఉన్న అర్సెనల్కు ఈ సీజన్లో మీరిచ్చే రేటింగ్? సీజన్ ఇంకా ముగియకముందే ఇలాంటి రేటింగ్లివ్వడం సమంజసం కాదని నా అభిప్రాయం. ఇప్పుడైతే డిసెంబరే ముగిసింది. కానీ ఈపీఎల్ ముగియడానికి ఇంకా ఐదు నెలలుందిగా... ఏమైనా జరగొచ్చు. అయితే సెప్టెంబర్‌లో చెల్సీతో 3–0తో గెలుపు ఈ సీజన్లోనే హైలైట్. నూతన సంవత్సరంలో మీ లక్ష్యాలేంటి? ఈ ప్రీమియర్ లీగ్‌లో జట్టు టైటిల్ గెలిచేందుకు కడదాకా పోరాడటం. విజయంతో అభిమానుల్ని సంతోషపెట్టడం. ఇప్పటికైతే ఇవే నా లక్ష్యాలు. కాకపోతే... ఏ జట్టుకైనా టైటిల్స్ అనేవి అంత ఈజీగా రావు. అయితే గతంలో కంటే మేం బాగా ఆడుతున్నాం. గెలిచే అవకాశాల్ని చక్కగా సృష్టించుకుంటున్నాం. -
డ్రా ఫలితాలతో ఇబ్బంది పడ్డాం
మైకేల్ కారిక్... మాంచెస్టర్ యునైటెడ్ కీలక ఆటగాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో ఆ జట్టుకు దశాబ్దానికిపైగా సేవలందిస్తున్నాడు. ఈ సీజన్లో మాంచెస్టర్ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ల్ని డ్రా చేసుకోవడం వల్లే పాయింట్ల పట్టికలో వెనుకబడ్డామని చెబుతున్న ఈ 35 ఏళ్ల ఆటగాడు తప్పకుండా తమ జట్టు పుంజుకుంటుందన్నాడు. లీగ్ జరిగేకొద్ది చక్కని ప్రదర్శనతో ముందంజ వేస్తామని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే... గత 8 మ్యాచ్‌ల్లో 6 డ్రాగానే ముగియడంతో ఒత్తిడంతా మీ మీదే ఉన్నట్లుంది? నిజమే... ఈ నేపథ్యంలో టొటెన్హామ్తో మ్యాచ్ చాలా కీలకమైంది. ఇందులో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా దిశా దశా మార్చే మ్యాచ్ ఇది. ముఖ్యంగా మాకు ఈ మూడు పాయింట్లు కీలకం. ఇందులో గెలిస్తే తర్వాత మ్యాచ్‌లకు ఒత్తిడి లేకుండా ఆడేందుకు దోహదపడుతుంది. అగ్రస్థానంలో ఉన్న చెల్సీకి అందనంత దూరంలో ఉన్న మీరు నాకౌట్కుచేరుకుంటారా? ఈ సీజన్లో మాకన్నీ సవాళ్లే ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఒక్కో విజయంతో పాయింట్ల పట్టికలో ఎగబాకడమే మాకు అతిపెద్ద సవాల్. అయితే జట్టు సమతుల్యంతో ఉంది. దేన్నైనా ఎదుర్కొనేలా జట్టును కోచ్ సన్నద్ధం చేస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తుంటే... లీగ్ జరిగేకొద్ది మేం పుంజుకుంటామనే ధీమాతో ఉన్నాం. మాంచెస్టర్‌ను దురదృష్టం వెంటాడిందన్న కోచ్ మౌరిన్హోతో మీరు ఏకీభవిస్తారా ? మేం ఆడిన మ్యాచ్‌లన్నీ ఇంచుమించు ఒకలాగే సాగాయి. విజయాలు సాధించనప్పటికీ అవి గెలవాల్సి ఉందని నమ్ముతున్నాం. అందువల్లే దీన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది. జట్టు విజయాలకొసం కోచ్ బాగా శ్రమిస్తున్నాడు. ఈ సీజన్లో జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉందిగా? కచ్చితంగా కాదు. ఫలితాలను పక్కనపెట్టి మా ప్రదర్శనను విశ్లేషించి చూడండి. వ్యక్తిగతంగా మెరుగైన ఆటతీరును కనబరుస్తూ సమష్టిగా జట్టు విజయం కోసం మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. తప్పకుండా గెలుపుబాట పట్టే జట్టు మాది. -
ఈపీఎల్‌లో భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి
లండన్: ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) క్లబ్ వెస్ట్ హామ్ యునెటైడ్ మహిళా ఫుట్‌బాల్ జట్టు భారత క్రీడాకారిణి అదితి చౌహాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇంగ్లండ్‌లోని ఓ టాప్ క్లబ్ తరఫున ఆడనున్న తొలి భారత మహిళా ఫుట్‌బాలర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 2013లో దక్షిణాసియా టైటిల్‌ను నెగ్గిన భారత జట్టులో గోల్‌కీపర్ అదితి కీలకపాత్ర పోషించింది. ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ వ్యవస్థలో మూడో లెవల్ అయిన మహిళల ప్రీమియర్ లీగ్ సదరన్ డివిజన్లో వెస్ట్ హామ్ జట్టు తలపడుతోంది. ఈ ఘనత సాధిం చినందుకు వచ్చిన అభినందనలపై అదితి హర్షం వ్యక్తం చేసింది. -
3 నిమిషాల్లోపే 3 గోల్స్...
లండన్ : ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్‌లో శనివారం సంచలనం నమోదైంది. సౌతాంప్టన్ క్లబ్‌కు చెందిన సాడియో మానె 3 నిమిషాల్లోపే 3 గోల్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్టన్ విల్లాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాంప్టన్ 6-1 గోల్స్ తేడాతో గెలిచింది. అంతర్జాతీయ పోటీల్లో సెనెగల్ జట్టుకు ఆడే సాడియో మానె 2 నిమిషాల 56 సెకన్లలో (మ్యాచ్‌లో 13, 14, 15వ నిమిషాల్లో) మూడు గోల్స్ కొట్టి... 1992లో మొదలైన ఈపీఎల్‌లో అత్యంత వేగంగా ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 1994లో రాబీ ఫౌలెర్ (4 నిమిషాల 33 సెకన్లు-లివర్‌పూల్) నెలకొల్పిన రికార్డును సాడియో మానె తిరగరాశాడు. అయితే ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత వేగవంతమైన ‘హ్యాట్రిక్’ రికార్డు టామీ రోస్ పేరిట ఉంది. 1964లో నైర్న్ కౌంటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోజ్ కౌంటీ తరఫన ఆడిన టామీ కేవలం 90 సెకన్లలో మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ చేశాడు. -
ఇంగ్లండ్ ఈసారైనా..!
గ్రూప్-డి విశ్లేషణ ఇంగ్లండ్, ఇటలీ, ఉరుగ్వే, కోస్టారికా ఫుట్‌బాల్ ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)కు ఉన్న ఆదరణ, ఆ లీగ్‌పై ఆటగాళ్లకున్న మోజు అంతా, ఇంతా కాదు. ప్రపంచంలోని ప్రతి ఆటగాడు ఈపీఎల్‌లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతుంటాడు. అయితే ఇంతటి ఆదరణ ఉన్న ఈపీఎల్‌ను నిర్వహించే ఇంగ్లండ్.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. ఎప్పుడో 1966లో తాము స్వయంగా ఆతిథ్యమిచ్చిన సందర్భంలో మాత్రమే ప్రపంచకప్‌ను గెలవగలిగింది. ఈసారి ఇంగ్లండ్‌కు గ్రూప్ దశలోనే గట్టి పోటీ ఎదురుకానుంది. ఇంగ్లండ్తోపాటు నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ ఇటలీ, రెండుసార్లు విజేత ఉరుగ్వేలతో గ్రూప్ ‘డి’ సంక్లిష్టంగా ఉంది. కోస్టారికా నాలుగో జట్టుగా ఉన్న ఈ గ్రూప్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఇంగ్లండ్ అధిగమిస్తుందా.. నాకౌట్‌కు చేరి టైటిల్ పోరు దిశగా పయనించగలుగుతుందా అన్నది చూడాల్సిందే. ఇంగ్లండ్ యూరప్ నుంచి అర్హత సాధించిన 13 జట్లలో ఇంగ్లండ్ ఒకటి. క్వాలిఫయర్స్‌లో తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిందే కానీ.. ఆ స్థానం ఇంగ్లండ్‌కు అంత తేలిగ్గా లభించలేదు. ఇక 13 సార్లు క్వాలిఫై అయినా ఒక్కసారి మాత్రమే విజేత కాగలిగింది. ఈసారి తమ గ్రూప్‌లో ఇటలీ, ఉరుగ్వేలతో కఠిన పరీక్ష ఎదురు కానుంది. అయితే క్వాలిఫయర్స్‌లో చూపిన తెగువను మరోసారి కనబరిస్తే నాకౌట్‌కు చేరుకోవచ్చు. ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1950లో తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్.. వరుసగా నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఐదోసారి 1966లో చాంపియన్‌గా నిలిచింది. ఆ తరువాత ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శన 1990లో సెమీఫైనల్‌కు చేరడమే. కీలక ఆటగాళ్లు: ఫార్వర్డ్ ఆటగాడు వేన్ రూనీ ఈ జట్టులో అత్యంత కీలకం. ఇతనికితోడు కెప్టెన్ స్టీవెన్ గెరార్డ్, ఫ్రాంక్ లాంపార్డ్ వంటి అనుభవజ్ఞులైన మిడ్‌ఫీల్డర్లు, జాక్ విల్షర్, అలెక్స్ ఆక్స్లేడ్, ఆండ్రోస్ టౌన్సెండ్లపై జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. కోచ్: రాయ్ హాడ్జ్‌సన్ అంచనా: ప్రిక్వార్టర్స్‌కు చేరవచ్చు ఉరుగ్వే తొలి ప్రపంచకప్‌లోనే విజేతగా నిలిచిన ఉరుగ్వే..దిగ్గజాల్లో ఒకటిగా వెలుగొందింది. అయితే మళ్లీ 20 ఏళ్లకుగాని మరో టైటిల్ సాధించలేకపోయింది. దక్షిణ అమెరికాలో బలమైన జట్టుగానే కొనసాగుతూ వస్తోంది. 2010లో సెమీఫైనల్‌కు చేరడం ద్వారా మళ్లీ పూర్వవైభవాన్ని సాధించిన ఉరుగ్వే.. ఈసారి అర్హత పొందేందుకు తీవ్రంగానే శ్రమించాల్సివచ్చింది. గ్రూప్‌లో బలమైన ప్రత్యర్థులున్నందున నాకౌట్‌కు చేరడం అంత తేలిక కాకపోవచ్చు. ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1930 తరువాత మళ్లీ 1950లో టైటిల్ సాధించింది. 1970లో సెమీఫైనల్ దాకా వెళ్లింది. 1974, 2002లోనూ ప్రపంచకప్‌కు అర్హత సాధించినా.. గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. గత ప్రపంచకప్ (2010)లో సెమీఫైనల్లో ఓడింది. కీలక ఆటగాళ్లు: స్టార్ ఆటగాడు లుయిస్ స్వారెజ్, ఎడిన్సన్ కవానిలు ఈ జట్టుకు కీలకం కానున్నారు. క్వాలిఫయర్స్‌లో స్వారెజ్ 11 గోల్స్ సాధించి ఉరుగ్వే అర్హత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. డీగో లుగానో సారథ్యానికి తోడు ఫెర్నాండో ముల్సేరా వంటి పోరాట పటిమ గల గోల్‌కీపర్ ఈ జట్టుకు అదనపు బలం. కోచ్: ఆస్కార్ వాషింగ్టన్ తబరెజ్ అంచనా: ఇంగ్లండ్, ఇటలీలలో ఒకరిని ఓడిస్తే గ్రూప్ దశ దాటే అవకాశం. కోస్టారికా గ్రూప్‌లో బలహీనంగా కనిపిస్తున్న జట్టు కోస్టారికా. 1921లో ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టినా.. ప్రపంచకప్‌లో అడుగు పెట్టేందుకు మాత్రం 1990 దాకా పోరాడాల్సివచ్చింది. ఆ టోర్నీలో ప్రి క్వార్టర్స్ దాకా వెళ్లగలిగింది. ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా కోస్టారికా అత్యుత్తమ ప్రదర్శన ఇదే. కాగా, ఈసారి క్లిష్టమైన గ్రూప్‌లో ఆడుతున్నందున తొలి రెండు స్థానాల్లో నిలవడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1990లో ప్రి క్వార్టర్స్ దాకా వచ్చిన కోస్టారికా.. ఆ తరువాత 2002, 2006లలో అర్హత సాధించి గ్రూప్ దశకే పరిమితమైంది. కీలక ఆటగాళ్లు: కోస్టారికా ఆశలన్నీ బ్రియాన్ రుయిజ్పైనే ఆధారపడి ఉన్నాయి. పలు లీగ్‌లలో అద్భుత ఆటతీరుతో జట్టులో రుయిజ్ కీలక ఆటగాడిగా మారాడు. ఆల్వరో సబోరియో, క్రిస్టియాన్ బోలనోస్, గోల్ కీపర్ కీలర్ నావస్లూ ప్రధాన పాత్ర పోషించనున్నారు. కోచ్: జార్జ్ లూయిస్ పింటో అంచనా: గ్రూప్ దశ దాటడం కష్టమే ఇటలీ యూరప్‌లోని సాకర్ దిగ్గజాల్లో ఒకటైన ఇటలీ ఇప్పటికి నాలుగుసార్లు ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అటాకింగ్ గేమ్‌కు పెట్టింది పేరైన ఇటలీ ఈసారి క్వాలిఫయర్స్‌లో ఓటమన్నదే లేకుండా.. ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఇంగ్లండ్, ఉరుగ్వేల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నా.. నాకౌట్‌కు చేరడం మాత్రం ఖాయమనే చెప్పవచ్చు. ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1934, 1938లలో వరుసగా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తిరిగి 1982లో స్పెయిన్‌లో మళ్లీ ప్రపంచ కిరీటాన్ని సాధించింది. అయితే రెండు సార్లు (1970, 1994) తుదిపోరుకు చేరుకున్నా.. ఫైనల్లో ఓడింది. 2006లో జర్మనీలో మరోసారి విజేతగా నిలిచింది. కీలక ఆటగాళ్లు: జర్మనీలో 2006లో ఇటలీని విజేతగా నిలిపిన జట్టులో సభ్యుడు, గోల్‌కీపర్ జియాన్లిజి బఫాన్ ప్రస్తుతం సారథ్యం వహిస్తున్నాడు. మారియో బాలెటెల్లీ, పాబ్లో ఓస్వాల్డో వంటి స్టార్ ఆటగాళ్లు ఈ జట్టు ప్రధాన బలం. కోచ్: సెసేర్ ప్రాడెల్లి. అంచనా: సెమీఫైనల్ దాకా వెళ్లే అవకాశం