జర్మనీ రాయబారి ‘రైస్ బకెట్ సవాల్’
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ‘ఐస్‌బకెట్ సవాల్’ ట్రెండ్ కొనసాగుతుండగా.. మన దే శంలో ‘రైస్‌బకెట్ సవాల్ ఊపందుకుంటోంది. ఢిల్లీ చాణక్యపురిలో మంగళవారం రైస్ బకెట్ చాలెంజ్‌ను స్వీకరించిన జర్మనీ రాయబారి మైకేల్ స్టీనర్.. స్థానిక మురికివాడలో 392 పేద కుటుంబాలకు ఐదు కిలోల బియ్యం బకెట్లను అందజేశారు. పేదరిక నిర్మూలనకు తోడ్పాటుగా చింతన్ అనే ఎన్జీవోతో కలిసి జర్మన్ ఎంబసీ ఈ కార్యక్రమం నిర్వహించింది.
మురికివాడను అభివృద్ధి చేసే కార్యక్రమం కోసం రూ.27 కోట్లను కేటాయించనున్నట్లూ స్టీనర్ తెలిపారు. కాగా, నాడీ సంబంధమైన ఏఎల్ఎస్, మోటార్ న్యూరాన్ వ్యాధిపై పరిశోధిస్తున్న ఏఎల్ఎస్ ఫౌండేషన్‌కు నిధుల కోసం అంతర్జాతీయంగా ఐస్ బకెట్ చాలెంజ్ ప్రారంభం అయింది. కానీ.. మన దేశంలో ఆకలే పెద్ద సమస్య. కాబట్టి.. దేశీయ వెర్షన్ అయిన రైస్ బకెట్ చాలెంజ్‌కు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సైట్ల ద్వారా నెటిజన్లు పెద్ద ఎత్తున సవాళ్లు స్వీకరించి, విసురుకుంటున్నారు. పెద్ద ఎత్తున నెటిజన్లను కదిలిస్తున్న ఈ రైస్ బకెట్ చాలెంజ్‌ను హైదరాబాద్‌కు చెందిన మహిళ మంజులత మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.