Michigan University scientists
-
బియ్యం కన్నా చిన్న కంప్యూటర్
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న కంప్యూటర్ను అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. 0.3 మిల్లీమీటర్ల మందం ఉన్న ఇది బియ్యం గింజ కన్నా చాలా చిన్నది. ‘మిషిగాన్ మైక్రో మోట్’గా పిలుస్తున్న ఈ చిట్టి కంప్యూటర్ పనిచేసే విధానం కూడా కాస్త భిన్నంగా ఉంది. సంప్రదాయ కంప్యూటర్లను ఆఫ్ చేసిన తరువాత కూడా వాటిలోని సమాచారం అలాగే భద్రంగా ఉంటుంది. కానీ ఈ కంప్యూటర్ను ఒకసారి స్విచాఫ్ చేస్తే అంతకు ముందు చేసిన ప్రొగ్రామింగ్, డేటా అంతా అదృశ్యమవుతుంది. ఈ సూక్ష్మ కంప్యూటర్లో ర్యామ్, కాంతి విద్యుత్ ఘటాలతో పాటు ప్రాసెసర్లు, వైర్లెస్ ట్రాన్స్మిటర్లు, రిసీవర్లను అమర్చారు. పరిమాణంలో చిన్నవి కావడంతో వీటిలో ఆంటెనాకు బదులుగా కాంతి సాయంతో సమాచార మార్పిడి జరిగే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ కంప్యూటర్ను కేన్సర్ కణతుల పరిశీలన, చికిత్సలో ఉపయోగించొచ్చని పరిశోధకులు వెల్లడించారు. -
యంత్రాలు మనుషులయ్యే రోజు మరెంతో దూరంలో లేదు!
వాషింగ్టన్: మనుషుల్లా ఆలోచించడం యంత్రాలవల్ల సాధ్యమవుతుందా? ఒకవేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో చూశాం. అయితే అది సినిమా కదా.. అని కొట్టిపారేయలేం. ఎందుకంటే.. యంత్రా లు కూడా మనుషుల్లా ఆలోచించే రోజు మరెంతో దూరంలో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వాదనకు బలం చేకూర్చేలా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ న్యూరల్ నెట్వర్క్ చిప్‌ను తయారుచేశారు. ఈ చిప్‌లో ఉన్న నెట్వర్క్ సిస్టమ్‌ను రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే... ఏ సందర్భాల్లో మనిషి ఎలా ఆలోచిస్తున్నాడనే వివరాలను సేకరించి, నిక్షిప్తం చేయడం ఈ రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్ ప్రత్యేకత. ఈ చిప్‌లను యంత్రాలకు అనుసంధానించడంవల్ల వాటికి మనుషుల్లా ఆలోచించే శక్తిసామర్థ్యాలు సమకూరుతాయని చెబుతున్నారు. ఇప్పటిదాకా రూపొందిన రోబోలు ముందుగా నిక్షిప్తం చేసిన ప్రోగ్రామ్ ద్వారా పనిచేస్తున్నవే. ప్రత్యేక పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజా చిప్‌ల ద్వారా ఈ గందరగోళానికి తెరపడుతుందని, ఎటువంటి సందర్భాల్లో మనిషి ఏ రకంగా ఆలోచిస్తున్నాడనే విషయాన్ని రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను విశ్లేషించి, నిర్ణయం తీసుకుంటాయని చెబుతున్నారు. -
ప్లాస్మా చికిత్సకు దారి దొరికింది...
పదార్థపు నాల్గో స్థితి అనే ప్లాస్మాను వైద్యంలో విరివిగా ఉపయోగించేందుకు మార్గం సులువైంది. మిచిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా ప్లాస్మాతో వైద్యం అందుబాటులోకి వస్తే గాయాలు తొందరగా మానడమే కాకుండా.. కేన్సర్ కణాలను కూడా సులువుగా చంపేయవచ్చు. అయితే ప్లాస్మా అస్థిరత కారణంగా ఇప్పటివరకూ వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించలేదు. మిచిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ లోటును భర్తీ చేశారు. ప్లాస్మాను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోడ్ల వద్ద వేడి కారణంగా జనించే ధ్వని తరంగాల వల్ల ప్లాస్మా దిశ, వేగం మారిపోతున్నట్లు వీరు గుర్తించారు. ఈ రెండింటిని నియంత్రించడం తెలుసుకోగలిగితే ప్లాస్మాను చికిత్సకు వాడటం సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త అమండా లీజ్ అంటున్నారు. ప్లాస్మా కారణంగా పుట్టే కొన్ని ఫ్రీ రాడికల్స్ కేన్సర్ కణాలను చంపేయగలవని, అదే సమయంలో ఇది సాధారణ కణాలకు ఏ హానీ చేయదని ఇప్పటికే గుర్తించినట్లు లీజ్ తెలిపారు. ఈ ఫ్రీ రాడికల్స్ బ్యాక్టీరియా త్వచాలను బద్దలుకొట్టి వాటిని చంపేస్తాయని, అందువల్ల దీన్ని వైద్య పరికరాలను శుద్ధి చేసేందుకు కూడా వాడవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికాలో చికిత్సలో ప్లాస్మా వాడకంపై నియంత్రణ ఉన్నప్పటికీ యూరప్‌లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.