Micro Avan
-
పిజ్జా చేయడం కష్టమేమీ కాదిక!
పిజ్జా... కొన్నేళ్ల క్రితం వరకూ మన పిల్లలకు ఈ పేరు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏం తింటావ్ అని అడగ్గానే ముందు చెబుతోంది దీని పేరే. పిజ్జా పేరు చెబితే చాలు... వాళ్లకి ఎక్కడ లేని హుషారూ వచ్చేస్తుంది. చెప్పలేనంత ఆకలీ వేసేస్తుంది. కాబట్టి మన పిల్లల కోసం పిజ్జా చేయడం నేర్చుకోక తప్పదు. అందుకుగాను ఈ పిజ్జా అవెన్ని తెచ్చుకోకా తప్పదు. పిజ్జా బాగుండాలంటే పిండితో చేసే బేస్ సరిగ్గా ఉండాలి. దాని మీద కూరగాయ ముక్కలు వేస్తామా, చికెన్-మటన్ వేస్తామా అన్నది మన ఇష్టం. అయితే ఏది వేసినా బేస్ సరిగ్గా ఉంటేనే పిజ్జా సరిగ్గా వస్తుంది. అది సరిగ్గా రావాలి అంటే అవన్ ఉండి తీరాలి. అందుకే డెనీ కంపెనీవారు ఈ అవెన్ని తయారు చేశారు. కాకపోతే మన మార్కెట్లోకి కొత్తగా వచ్చింది కాబట్టి రేటు ఎక్కువగా ఉంది (రూ. 10,924 - ఈబే సైట్లో). అయితే అంతకంటే తక్కువ ధరకే మైక్రో అవన్ వచ్చేస్తోంది. అన్ని రకాలుగానూ ఉపయోగపడుతుంది కూడాను. అలాంటప్పుడు కేవలం పిజ్జాకి మాత్రమే పనికొచ్చే అవన్కి అంత పెట్టడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ముందు ముందు రేటు తగ్గుతుందేమో చూడాలి మరి! -
బుజ్జి అవన్‌తో భారం తగ్గినట్టే!
మైక్రో అవన్... ఇది మధ్య తరగతివారికి అందని వస్తువుల లిస్టులోనే ఉంది ఇంకా. మరీ అత్యవసరం అనుకుంటే తప్ప మామూలు వాళ్లెవరూ దీన్ని కొనుక్కోరు. కానీ నిజానికి ఇది అందరిళ్లలోనూ ఉండటం మంచిదే. ఎందుకంటే అవన్‌తో పెద్ద ఉపయోగమే ఉంది. నూనె వాడకుండానే వంట చేసుకోవచ్చు. వేడి, ఆవిరితోనే ఆహార పదార్థాలు ఉడకబెడుతుంది ఈ యంత్రం. అందుకే అవన్ కచ్చితంగా అవసరమైన యంత్రమే. కానీ ఐదారు వేలు పెట్టాలంటే కాస్త కష్టమనిపిస్తుంది. ఆ కష్టాన్ని లేకుండా చేసేందుకే మినీ అవన్లు వచ్చాయి. షాపుకెళ్లి... ‘ర్యాపిడ్ వేవ్ కన్వెక్షన్ కౌంటర్‌టాప్ అవన్’ ఇవ్వమంటే వెంటనే ఈ బుజ్జి అవన్ని మీ చేతిలో పెడతారు. బాయిలింగ్, స్టీమింగ్, రోస్టింగ్, బేకింగ్‌తో పాటు మరో రెండు మూడు ఆప్షన్లు ఉన్నాయి. నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తోంది. ఆన్లైన్ స్టోర్స్‌లో రూ. 2,500కి వచ్చేస్తోంది. బయట షాపుల్లో కొంటే మాత్రం మూడు వేల వరకూ పెట్టాల్సి వస్తుంది. ఆలస్యమెందుకు... వెంటనే కొనేసుకోండి. అనారోగ్య భయంతో పాటు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకోండి!