సూక్ష్మసేద్యానికి నిధులు కరువు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యానికి బ్రేకులు పడ్డాయి. నిధులు లేకపోవడంతోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.85 లక్షల ఎకరాలకుగాను కేవలం 70 వేల ఎకరాలకు మాత్రమే పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో ఇంకా ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అందలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,26,054 మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్‌కు మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఉద్యాన శాఖ వద్ద మూలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం నిధులు కేటాయింపులు చేసినా రాష్ట్ర ఆర్థిక శాఖ తన వాటా నిధులు విడుదల చేయడం లేదు. కేంద్రం నుంచి రూ.348 కోట్లు కేటాయింపులు రాగా, రాష్ట్ర ఆర్థిక శాఖ దానికి రూ.283 కోట్లు కలిపి ఇవ్వాల్సి ఉంది. అవసరాల రీత్యా అదనంగా మరో రూ.263.55 కోట్లు ఇచ్చేలా యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం కూడా ఇచ్చింది. ఇందులో కేంద్రం రూ.191 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అయితే అందుకు రాష్ట్ర వాటా కలిపి ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా బీసీలకు 90, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం గతంలో నాబార్డు నుంచి రూ.800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది దర ఖాస్తులు, వాటి చెల్లింపులకు పూర్తయింది.
పదో స్థానంలో రాష్ట్రం...
దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ పదో స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్తాన్‌లో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.