మొబైల్ పరిశ్రమకు భారీ రాయితీలు
పెట్టుబడుల ఆకర్షణకు ప్రోత్సాహకాలు
మైక్రోమాక్స్‌కు పెద్దఎత్తున రాయితీలు
మొబైల్ పాలసీ తయారీపై టీ-స్విప్ట్ కసరత్తు
ఈఎంసీల్లో మొబైల్ తయారీ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: మొబైల్ తయారీ పరిశ్రమలకు భారీ రాయితీలు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టీ-స్విప్ట్ బోర్డు (పెట్టుబడుల ఆహ్వాన సంస్థ) ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో తొలిసారిగా మొబైల్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన మైక్రోమాక్స్ సంస్థకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను ‘మొబైల్ పాలసీ’ రూపంలో ఇతర పరిశ్రమలకు వర్తింపచేయాలని భావిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రిమండలి ఆమోదం తర్వాత మొబైల్ విధానం ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రంగారెడ్డి జిల్లా రావిర్యాల ‘ఈ-సిటీ’ (ఫ్యాబ్‌సిటీ)లో రూ.30 లక్షలకు ఎకరం చొప్పున 18.66 ఎకరాలు మైక్రోమాక్స్‌కు కేటాయించాలని నిర్ణయించింది. మౌలిక సౌకర్యాల కల్పనకయ్యే వ్యయంతో సంబంధం లేకుండా నామమాత్ర ధరకు మైక్రోమాక్స్ తరహాలో ఇతర పరిశ్రమలకు భూమి కేటాయించనున్నారు. అనుబంధ పరిశ్రమలతో కలుపుకొని రూ.10 కోట్లకు మించకుండా పెట్టుబడిలో 20 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. వంద శాతం స్టాంపు డ్యూటీని పరిశ్రమలకు తిరిగి చెల్లించడంతోపాటు పెట్టుబడిలో 50 శాతం మొత్తానికి 5.25 శాతం వార్షిక వడ్డీ వర్తింపచేయాలని టీ-స్విప్ట్ బోర్డు ప్రతిపాదించింది. మొబైల్ ఉత్పత్తులపై 5 శాతం వ్యాట్‌ను విధించడంతో పాటు సీఎస్టీని (కేంద్ర అమ్మకపు పన్ను) రెండు శాతం తగ్గించాలని పేర్కొంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) నిర్ణయించిన ధరలకు అనుగుణంగా మొబైల్ పరిశ్రమలకు 25 శాతం లేదా గరిష్టంగా రూ.30 లక్షలకు మించకుండా రాయితీ ఇవ్వనున్నారు. అయితే నియామకాల్లో 80 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలని టీ-స్విప్ట్ ప్రతిపాదిస్తోంది.
రాష్ట్రానికి రెండు ఈఎంసీలు
ఎలక్ట్రానిక్ వ్యవస్థల రూపకల్పన, ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో రెండు ఈఎంసీల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వీటిలో ఒకటి ఫ్యాబ్‌సిటీ (602 ఎకరాలు), మరొకటి మహేశ్వరంలో (310 ఎకరాలు) ఏర్పాటు కానున్నాయి.
ఈఎంసీల అభివృద్ధికి అవసరమైన నిధులను 50 నుంచి 75 శాతం వరకు ప్రాజెక్టు విస్తీర్ణాన్ని బట్టి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీఎస్ఐఐసీ ద్వారా అభివృద్ధి చేసే ఈఎంసీల్లో మొబైల్ తయారీ పరిశ్రమల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మొబైల్ పరిశ్రమలకు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు భారీ రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ మొబైల్ తయారీ పరిశ్రమ వేళ్లూనుకునేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మైక్రోమాక్స్‌కు ఇవాల్సిన రాయితీల ప్రతిపాదనలను ఆమోదిస్తే, ఇతర పరిశ్రమలూ ముందుకొస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది.