నగ్న ఫోటోలతో గృహిణికి బెదిరింపులు.. ఆత్మహత్య
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని తూరు మిడ్నాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గృహిణి మొబైల్ నుంచి ఆమె వ్యక్తిగత ఫోటోలను స్వాధీనం చేసుకున్న కొందరు విద్యార్థులు.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్‌కు దిగారు. ఆ వేధింపులను తట్టుకోలేక చివరకు గృహిణి ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త ఉద్యోగరిత్యా ఒడిషాలో పని చేస్తుండగా.. సదరు మహిళ(35) తన కూతురితో చండీపూర్‌లో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం తన కూతురిని డాన్స్ స్కూల్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఆమె తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి(17)కి అది దొరికింది. అయితే అందులో ఉన్న ఆమె ఫోటోలన్నీంటిని తన మొబైల్‌కు పంపించుకున్నాడు. తిరిగి మొబైల్‌ను ఆ మహిళకు ఇచ్చేశాడు.
వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉండగా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థికి మరో ఇద్దరు స్నేహితులు కూడా సహకరించారు. వేధింపులు ఎక్కువ కావటంతో ఆమె శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
లైంగికంగా వేధించారు... విద్యార్థులు తన సోదరిని లైంగికంగా వేధించారని బాధితురాలి సోదరుడు చెబుతున్నాడు. చనిపోయే ముందు ఆమె విషయాన్ని తనకు చెప్పుకుని రోదించిందని.. సోదరిని ఓదార్చి తాను తిరిగి ఇంటికెళ్లే సరికి అఘాయిత్యానికి పాల్పడిందని అతను అంటున్నాడు. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. కాగా, ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.