midwife
-
అప్పటికే రక్తస్రావం మొదలైంది.. అందుకే
న్యూఢిల్లీ: ప్రసవ వేదనతో బాధ పడుతున్న హీరోయిన్ అక్కకి డెలివరీ చేస్తాడు హీరో. వీడియో కాల్లో డాక్టర్ సూచనలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వస్తువుల సాయంతో బిడ్డను బయటకు తీసి ‘అమ్మ’లా ఆమెకు అండగా నిలుస్తాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ఈ దృశ్యం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి తరహా ఘటనే సంపర్క్ క్రాంతి కోవిడ్-19 స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. దివ్యాంగుడైన సునీల్ ప్రజాపతి(30) ఢిల్లీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన పెళ్లి తేదీ ఖరారు చేసుకునేందుకు శనివారం స్వస్థలం మధ్యప్రదేశ్‌కు బయల్దేరాడు. జబల్పూర్- మధ్యప్రదేశ్ రైలులో ప్రయాణం చేస్తున్న అతడికి రాత్రి ఓ మహిళ బిగ్గరగా ఏడ్వటం వినిపించింది. దీంతో వెంటనే బీ3 కోచ్‌లోకి పరిగెత్తుకువెళ్లి చూశాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఎలాగైలా కాపాడాలనుకున్నాడు. ఆస్పత్రి తీసుకువెళ్లేంత సమయం లేదు.. పైగా ఆమెకు సాయం చేసేందుకు బోగీలో ఒక్క మహిళ కూడా కనిపించలేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సుపీరియర్ డాక్టర్ సుపర్ణ సేన్‌కు సునీల్ ఫోన్ చేశాడు. వీడియోకాల్‌లో డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ మహిళకు ప్రసవం చేశాడు. శాల్(శాల్వ)కు ఉన్న దారాలు, ఓ ప్యాసింజర్ షేవింగ్ కిట్‌లో ఉన్న కొత్త బ్లేడ్ తీసుకుని ఆమెకు డెలివరీ చేశాడు. అనంతరం మథుర స్టేషన్లో రైలు ఆగగానే ఆర్పీఎఫ్ సిబ్బంది తల్లీబిడ్డను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిద్దరు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో తక్షణమే స్పందించిన సునీల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.(చదవండి: 20 నెలల చిన్నారి.. ఐదుగురికి కొత్త జీవితం) అప్పటికే రక్తస్రావం మొదలైంది.. ఈ విషయం గురించి ‘సూపర్ హీరో’ సునీల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రైలు ఫరీదాబాద్ దాటిన తర్వాత భోజనం చేసేందుకు నేను బాక్స్ తెరిచాను. అప్పుడు ఓ మహిళ బాధతో కేకలు వేస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లాను. ఆమెకు తోడుగా తన చిన్నారి కూతురు, సోదరుడు మాత్రమే ఉన్నారు. వాళ్లు దోమోకు వెళ్తున్నారట. తను పేరు కిరణ్ అని, జనవరి 20న ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చినట్లు ఆమెతో ఉన్నవాళ్లు చెప్పారు. అయితే ప్రయాణం కారణంగానే ఆమెకు నొప్పులు వచ్చాయని తొలుత భావించా. అందుకే ఒకవేళ ఏదైనా సాయం కావాలంటే నన్ను పిలవమని చెప్పి వచ్చేశాను. కానీ ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. వెంటనే మళ్లీ అక్కడికి వెళ్లి, మా డాక్టర్‌కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాను. సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించాలనుకున్నాం. కానీ అప్పటికే ఆమెకు రక్తస్రావం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే డాక్టర్ సుపర్ణ సేన్‌కు వీడియోకాల్ చేశాను. ఆమె చెప్పినట్లుగానే డెలివరీ చేసేందుకు ప్రయత్నించాను. అదృష్టవశాత్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రసవం జరిగింది. కానీ ఆ సమయంలో నా మనసు భయం, ఉత్సుకత వంటి మిశ్రమ భావనలతో నిండిపోయింది. అంతా మంచే జరిగినందుకు ఇప్పుడు సంతోషంగాఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక సునీల్ ప్రదర్శించిన ధైర్యం గురించి డాక్టర్ సేన్ చెబుతూ.. ‘‘అతడికి హ్యాట్సాఫ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇలాంటి డెలివరీని నేనెప్పుడూ చూడలేదు. దివ్యాంగుడైన తను పని పట్ల పూర్తి నిబద్ధతతో ఉంటాడు. సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటాడు’’ అని ప్రశంసించారు. అదే విధంగా కిరణ్ స్పందిస్తూ.. ‘‘నాకు ఇలా ప్రసవం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికే మూడుసార్లు గర్భస్రావం అయ్యింది. అలాంటిది ఇప్పుడు నా బిడ్డను నేను చూసుకోగలిగాను. నాకు సాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. -
మిడ్ వైఫ్స్ లా సహకరించిన పోలీసులు!
న్యూఢిల్లీః సాహసమే ఊపిరిగా, సామాజికే సేవే లక్ష్యంగా పనిచేసే పోలీసులు.. తమలోని సేవా గుణాన్ని దేశరాజధాని సాక్ష్యంగా మరోసారి నిరూపించుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు తక్షణ సేవలను అందించి... సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను ప్రమాదం నుంచి తప్పించారు. పోలీసు పీసీఆర్ వాహనంలోనే ఆమె ప్రసవానికి మిడ్ వైఫ్స్ లా సహకరించి అభినందనలు అందుకున్నారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో పీసీఆర్ వాహనంలో 23 ఏళ్ళ మహిళ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవంకోసం అత్తింటివారితో పాటుగా స్మాల్ ఖా వెళ్ళేందుకు పానిపట్ నుంచి గ్వాలియర్ వెళ్ళే దాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఆర్తీ...ఢిల్లీలోని సబ్జి మండి స్టేషన్ ప్రాంతానికి వచ్చే సరికి నొప్పులు తీవ్రమవ్వడమే కాక, ఉమ్మనీరు కూడ పడిపోవడంతో అత్తింటివారు టికెట్ కలెక్టర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన టీసీ కంట్రోల్ రూం కు ఫోన్ చేసి, పోలీసులుకు సమాచారం చెప్పడంతో సబ్జీ మండి ప్రాంతం పోలీసులు వైద్య సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు. ఓ పీసీఆర్ వ్యాన్ ను రైలు దగ్గరకు తెచ్చి ఆర్తీని ప్రయాణీకుల సహకారంతో అందులోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ సంజయ్ లు మహిళను స్ట్రెచ్చర్ పై వ్యాన్ లో ఎక్కించుకున్నారు. ఇంతలో నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్తీ పీసీఆర్ వ్యాన్ లోనే ప్రసవించింది. దీంతో పుట్టిన బిడ్డకు కావలసిన టవల్స్, వేడి నీటితో పాటు సౌకర్యాలను అందించి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. అనంతరం స్థానిక హిందూరావ్ ఆస్పత్రికి తల్లీ బిడ్డలను తరలించారని వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డీసీపీ ఆర్ కె సింగ్ తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ఆర్తీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్స్ స్పెషల్ కమిషనర్ సంజయ్ బెనివాల్ ఆర్తీకి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ప్రత్యేక అవార్డులను ప్రకటించారు. -
చనిపోయిన వారిని బతికిస్తా...
⇒ చనిపోయిన వారిని బతికిస్తానంటూ టోకరా ⇒ రూ.10 వేలు వసూలు చేసిన మంత్రగత్తె కొండాపురం: చనిపోయిన వారిని తాను బతికిస్తానని, ఇప్పటికే అలా 10 మందిని బతికించానంటూ ఓ మహిళ రూ.10 వేలు తీసుకుని ఉడాయించింది. ఆమె చెప్పినట్లు చేసిన తర్వాత మోసపోయామని బాధిత కుటుంబసభ్యులు గుర్తించి లబోదిబోమన్నారు. ఈ ఘటన ఇస్కదామెర్ల పంచాయతీలోని కేవీఆర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు..కాలనీకి చెందిన కొట్టాపల్లి నారాయణ, బుజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడైన చిన్నసత్యనారాయణ(16) బేల్దారీ పనుల కోసం మూడు నెలల క్రితం కరీంనగర్ జిల్లా జగిత్యాల వెళ్లాడు. అక్టోబర్‌లో అక్కడ పనిచేస్తుండగా ఇటుక రాయి కాలిపై పడటంతో తీవ్రంగా గాయపడి ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతడిని పలు ఆస్పత్రులతో పాటు ఆలయాలకు కూడా తిప్పారు. అక్టోబర్ 26న చిన్నసత్యనారాయణ మృతిచెందాడు. ఈ క్రమంలో నవంబర్ 25న ఓ గుర్తుతెలియని మహిళ గ్రామానికి వచ్చింది. స్థానిక పాఠశాల వద్ద కూర్చుని తాను దైవాంశ సంభూతురాలినని పరిచయం చేసుకుంది. కాలనీలో ఇటీవల ఓ యువకుడు మృతి చెందాడని, చేతబడే అందుకు కారణమని పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ, బుజ్జమ్మ దంపతులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. చిన్నసత్యనారాయణను తాను బతికిస్తానని, గతంలోనూ పది మందికి ప్రాణం పోశానని నమ్మబలికింది. పూజ ఖర్చు రూ.30 వేలు అవుతుందని చెప్పి అడ్వాన్సుగా రూ.10 వేలు తీసుకుంది. వెళుతూవెళుతూ పూజ చేసిన వస్తువులని పేర్కొంటూ కొంత సామగ్రిని వారికిచ్చి వెళ్లింది. శనివారం రాత్రి 7 నుంచి 12 గంటల మధ్యలో శ్మశానానికి వెళ్లి చిన్నసత్యనారాయణను ఖననం చేసిన చోట కాళ్ల వద్ద ఆ వస్తువులను ఉంచి అతడిని పిలవాలని సూచించింది. ఆమె చెప్పినట్లే చేసిన బాధిత కుటుంబసభ్యులకు ఒక్కసారిగా దుర్ఘందం వెదజల్లడంతో మోసపోయామని గ్రహించి, గుంటను పూడ్చేసి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనవిజ్ఞానవేదిక జిల్లా కార్యదర్శి టీఎస్ కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు మేడం నరసింహారెడ్డి, కలిగిరి ప్రతినిధులు రావుల లక్ష్మీనారాయణ, మస్తాన్‌రెడ్డి, మంజాన్ రావు, పౌరహక్కుల సంఘం నేత డాక్టర్ అంకయ్య తదితరులు ఆదివారం కాలనీని సందర్శించారు. మూఢనమ్మకాలతో మోసపోవద్దని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.