మిడ్ వైఫ్స్ లా సహకరించిన పోలీసులు!
న్యూఢిల్లీః సాహసమే ఊపిరిగా, సామాజికే సేవే లక్ష్యంగా పనిచేసే పోలీసులు.. తమలోని సేవా గుణాన్ని దేశరాజధాని సాక్ష్యంగా మరోసారి నిరూపించుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు తక్షణ సేవలను అందించి... సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను ప్రమాదం నుంచి తప్పించారు. పోలీసు పీసీఆర్ వాహనంలోనే ఆమె ప్రసవానికి మిడ్ వైఫ్స్ లా సహకరించి అభినందనలు అందుకున్నారు.
ఢిల్లీ పోలీసుల సహకారంతో పీసీఆర్ వాహనంలో 23 ఏళ్ళ మహిళ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవంకోసం అత్తింటివారితో పాటుగా స్మాల్ ఖా వెళ్ళేందుకు పానిపట్ నుంచి గ్వాలియర్ వెళ్ళే దాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఆర్తీ...ఢిల్లీలోని సబ్జి మండి స్టేషన్ ప్రాంతానికి వచ్చే సరికి నొప్పులు తీవ్రమవ్వడమే కాక, ఉమ్మనీరు కూడ పడిపోవడంతో అత్తింటివారు టికెట్ కలెక్టర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన టీసీ కంట్రోల్ రూం కు ఫోన్ చేసి, పోలీసులుకు సమాచారం చెప్పడంతో సబ్జీ మండి ప్రాంతం పోలీసులు వైద్య సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు. ఓ పీసీఆర్ వ్యాన్ ను రైలు దగ్గరకు తెచ్చి ఆర్తీని ప్రయాణీకుల సహకారంతో అందులోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ సంజయ్ లు మహిళను స్ట్రెచ్చర్ పై వ్యాన్ లో ఎక్కించుకున్నారు. ఇంతలో నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్తీ పీసీఆర్ వ్యాన్ లోనే ప్రసవించింది. దీంతో పుట్టిన బిడ్డకు కావలసిన టవల్స్, వేడి నీటితో పాటు సౌకర్యాలను అందించి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు.
అనంతరం స్థానిక హిందూరావ్ ఆస్పత్రికి తల్లీ బిడ్డలను తరలించారని వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డీసీపీ ఆర్ కె సింగ్ తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ఆర్తీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్స్ స్పెషల్ కమిషనర్ సంజయ్ బెనివాల్ ఆర్తీకి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ప్రత్యేక అవార్డులను ప్రకటించారు.