militancy
-
ఆ ఉగ్రవాద సంస్థలో ఎక్కువగా చేరుతున్నారు!
శ్రీనగర్: ఉగ్రవాదం వైపు అడుగులేస్తున్న కశ్మీర్ యువత సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గతేడాది 126 మంది వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. ఈ ఏడాది జూలై నాటికే 131 మంది అటు వైపు ఆకర్షితులైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై 31 వరకు సేకరించిన సమాచారం ప్రకారం 131 మంది ఉగ్రవాద సంస్థల్లో చేరగా.. వీరిలో సోఫియా జిల్లా నుంచే 35 మంది చేరినట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. సోఫియా, పుల్వామా, అనంత్‌నాగ్, కుల్గామ్, అవంతిపురా జిల్లాల యువత ఎక్కువగా ఉగ్ర భూతం వైపు మళ్లుతున్నారని.. ఇప్పటివరకు చేరిన 131 మందిలో ఈ 5 జిల్లాల నుంచే 100 మంది ఉన్నారని తెలిపారు. అల్ కాయిదాకు మద్దతు సంస్థగా చెబుతున్న అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ వైపు యువకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని.. దీనికి పుల్వామా జిల్లాకు చెందిన రషీద్ భట్ అలియాస్ జకీర్ ముసా నాయకత్వం వహిస్తున్నాడని చెప్పారు. పాకిస్తాన్ అనుకూల నినాదాలను పక్కనబెడుతూ ముసా ఇచ్చిన సరికొత్త ‘షరియత్ యా షహదత్ (ఇస్లాం చట్టాలను అమలు చేద్దాం లేదా మరణిద్దాం)’ నినాదం వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నాని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసిన ముసా.. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన బుర్హన్ వనీ 2016లో హతమైన తర్వాత అక్కడి యువతను ఆకర్షించడంలో సఫలీకృతుడవుతున్నాడని అంటున్నారు. ముసా చదువులో, ఆటల్లో ముందుండేవాడని.. అంతరాష్ట్ర క్యారమ్ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడాడని చెప్పారు. అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ సంస్థ ఇంకా మొదలవలేదని పోలీసులు చెబుతున్నా.. ఆ సంస్థకు అక్కడి యువతలో ఆదరణ మాత్రం పెరుగుతున్నట్లు అనుమానం. -
కశ్మీర్ : 27 ఏళ్లు.. 41 వేల మృతులు
ఉగ్రవాదానికి ఊతమిస్తోంది ఎవరు? సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది ఎవరు? కశ్మీర్ లోయని కల్లోలం చేస్తోంది? అక్కడి ప్రజలను తీవ్రవాదానికి ఆకర్షించేది? నిరంతరం ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది? ఎవరన్న ప్రశ్నలకు మన దగ్గర పసిపిల్లాడుకూడా సమాధానం చెబుతాడు. ఐక్యరాజ్య సమితిముందు భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని నిందలేసిన పాకిస్తాన్‌కు.. కేంద్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలే సమాధానం చెబుతాయి. న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం పారించిన నెత్తుటేరులకు సాక్ష్యం గడచిన 27 సంవత్సరాలు . 1990 నుంచి 2017 వరకూ పాకిస్తాన్ లోయలో తీవ్రవాదులను అడ్డుపెట్టుకుని అరాచకాలే చేసింది. తీవ్రవాదుల దాడిలో ఈ 27 ఏళ్లలో 41 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే సగటున రోజుకు నలుగురు చొప్పున మృతి చెందారు. ఇక ప్రతి ఏడాది 1519 మంది గాయాల పాలయ్యారు. లోయలో పరిస్థితిపై ప్రభుత్వం సోమవారం గణాంకాలను విడుదల చేసింది. వేలలో క్షతగాత్రులు 1990 నుంచి ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో 14 వేల మంది పౌరులు, 5 వేల మంది భద్రతా సిబ్బంది, 22 వేల మంది టెర్రరిస్టులు గాయాల పాలయ్యారు. మొత్తంగా తీవ్రవాద కార్యకలాపాల వల్ల 69వేల 820 మంది గాయాల పాలయ్యారు. సగటున ప్రతిఏడాది 2 వేల 500 తీవ్రవాద ఘటనలు లోయలో జరుగుతున్నాయి. లోయలో జరిగే తీవ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఊతమిస్తోందని.. ప్రతి రోజూ మిలిటెంట్లు కంచెను దాటి భారత్‌లోకి చొరబడేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. 2014 తరువాత.. మరింతగా! 1990 నుంచి 2000 వరకూ మిలిటెంట్ కార్యక్రమాలు ఒకలా ఉన్నా.. తరువాత పూర్తిగా రూపు మార్చుకున్నాయి. ఇక 2014 నుంచి లోయలో మిలిటెంట్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. 2014నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 795 దాడులు జరిగాయి. ఈ ఘటనలో 397 మంది తీవ్రవాదులు హతమయ్యారు. అలాగే 64 మంది సాధారణ పౌరులు, 178 మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక 2014లో 222 తీవ్రవాద దాడులు లోయలో జరగ్గా.. 2016లో ఈ సంఖ్య 322కు పెరిగింది. తీవ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తరువాత కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 2001లో అత్యధికం ఈ 27 ఏళ్లలో 2001 సంవత్సరంమాత్రం లోయలో రక్తం పారించింది. ఈ ఒక్క ఏడాదే.. భద్రతా బలగాలు 2020 మంది మిలిటెంట్లను హతమార్చాయి. 536 మంది సైనికులు, 996 మంది పౌరులు చనిపోయారు. కశ్మీర్లో ఈ ఒక్క ఏడాదే 4,522 తీవ్రవాద ఘటనలు జరిగాయి. మిలిటెంట్ల ఏరివేత 1990 నుంచి 97 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇతర సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో 6,522 మంది తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. 1999-2003 వరకూ అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 7,820 మంది తీవ్రవాదులను భద్రతాబలగాలు ఏరిపారేశాయి. సైన్యం, భద్రతా బలగాలు అత్యంత ధైర్యంతోనూ, సాహసంతోనూ పనిచేసిన కాలంగా చెప్పుకుంటాయి. 2004 నుంచి 2014 మధ్య కాలంలో తీవ్రవాద ఘటనలు పెద్దగా చోటు చేసుకోలేదు. కేవలం 2013లో 170 తీవ్రవాద ఘటనలు జరగ్గా.. 67 మంది మిలిటెంట్లు హతమయ్యారు. -
ఇక కాల్పులు ఉండవా?
కోహిమా: స్వతంత్య్ర దేశం కోసం దాదాపు శత వత్సరాలుగా ఆందోళన చేస్తున్న నాగాలాండ్ ఉద్యమ నేతలతో చరిత్రాత్మకమైన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇక భారత ప్రభుత్వంపై వారి తిరుగుబాటుకు తెర పడినట్లేనని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సోమవారం నాడు ఘనంగా ప్రకటించుకుంది. ఒప్పందం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. 1997 నుంచి భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించకుండా పాటిస్తున్న 'నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్' (ఎన్ఎస్సీఎన్)కు చెందిన ఇసాక్ మూవా వర్గంతో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఇరువర్గాలు ఒప్పందం చేసుకున్నాయి. తంగ్‌కుల్ నాగాలకు ప్రాతినిథ్యం వహిస్తూ శాంతియుతంగా వ్యవహరిస్తున్న ఇసాక్ మూవా వర్గంతో ఒప్పందం చేసుకున్నంత మాత్రాన నాగాలో శాంతి సుమాలు వికసించే అవకాశం ఉందా? మొన్నగాక మొన్న మణిపూర్‌లో 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఎన్ఎస్సీఎన్-ఖప్లాంగ్ వర్గం సంగతేంటి? ఇంకా ఆందోళన పథంలోనే సాగుతున్న అనేక నాగా వర్గాలు ఈ ఒప్పందంతో రాజీ పడతాయా? శాంతి మార్గంలోకి వస్తాయా? అన్నది అసలు ప్రశ్న. నాగాలాండ్ రాజకీయ సమస్యను పరిష్కరించేందుకు గత 18 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఒక వర్గాన్ని వదిలిపెట్టి మరో వర్గంతో, ఆ వర్గాన్ని వదిలిపెట్టి ఇంకో వర్గంతో సాగించిన చర్చోపచర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే ఈశాన్య పాలసీ పేరిట ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ సమస్య పరిష్కారానికి ఒప్పందం చేసుకున్నామని మోదీ ప్రభుత్వం భుజాలు చరుచుకుంటోంది. ఒక చిన్న వర్గంతో ఒప్పందం చేసుకున్న మాత్రాన సమస్య పరిష్కారమైనట్లు భావించలేం. ఒప్పందంలో ఉన్న అంశాలేమిటీ? ఆ అంశాలతో ఆందోళన పథంలోనే కొనసాగుతున్న ఇతర నాగా ఉద్యమ వర్గాలు ఏకీభవిస్తాయా? అన్న అంశంపైనే ఒప్పందం భవిష్యత్తు ఆధారపడి ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్‌లతోపాటు మైన్మార్‌లోని నాగా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిని కలిపి ఓ దేశంగా లేదా పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది నాగాల ప్రధాన డిమాండ్. సదుద్దేశంతోనే వారి ఆందోళన ప్రారంభమైనా చీలికలు వారి బాటలను మార్చాయి. వారిలోని పలు ఉపజాతుల మధ్య సమన్వయం, ఐక్యత కొరవడడం వల్ల వారిలో అనేక వర్గాలు ఏర్పడ్డాయి. స్వతంత్య్ర రాజ్యం కోసం 1918 నుంచే నాగాల ఆందోళన ప్రారంభమైనా, 1980లో ఎన్ఎస్సీఎన్ ఏర్పాటుతో వారి ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది. నాగాలిమా లేదా గ్రేటర్ నాగాలాండ్ సాధించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంస్థలో అనేక నాగా గ్రూపులు విలీనమయ్యాయి. ఉప జాతుల నేతల మధ్య సమన్వయం, ఐక్యత లోపించడం వల్ల అనతికాలంలోనే ఇందులో చీలికలు ఏర్పడ్డాయి. 1988లో ఎన్ఎస్సీఎన్లో ఖప్లాంగ్, ఇసాక్ మూవా గ్రూపులు వేరయ్యాయి. 2007లో ఇసాక్ వర్గం నుంచి విడిపోయి కొంత మంది నాగా నేతలు ఐక్య సంఘటన పేరిట మరో వర్గాన్ని ఏర్పాటు చేశాయి. 2011లో మళ్లీ ఖప్లాంగ్ వర్గం నుంచి ఖోలీ-కిటోవి అనే వర్గం పుట్టుకొచ్చింది. ఆదే ఖప్లాంగ్ వర్గం నుంచి గత ఏప్రిల్ నెలలో సంస్కరణావాదం పేరిట మరో వర్గం ఏర్పాటైంది. భారత్‌తో 2011లోనే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఖప్లాంగ్ వర్గానికి ప్రస్తుతం మైన్మార్‌లో గట్టి పునాదులు ఉన్నాయి. మైన్మార్ ప్రభుత్వంతో తాజాగా కాల్పుల విరమణ చేసుకున్న ఖప్లాంగ్ వర్గం నేత ఎస్ఎస్ ఖప్లాంగ్ భారత ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు గత ఏప్రిల్ నెలలో నిరాకరించారు. మళ్లీ పోరాటానికి ఆయుధాలు పట్టాడు. రక్తపాతం మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో మైన్మార్‌లోని ఖప్లాంగ్ శిబిరాలను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఎన్డీయో ప్రభుత్వం గత జూన్ నెలలో సైన్యాన్ని మయన్మార్‌లోకి పంపించింది. అక్కడే ఎదురుదాడిలో భారత్ 18 మంది సైనికులను కోల్పోయింది. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇసా మూవా వర్గంతో ఒప్పందం చేసుకుంది. ఇది చరిత్రాత్మక ఒప్పందం అవుతుందా, కాదా ? అన్నది చరిత్రే తేల్చాలి.