ఇక కాల్పులు ఉండవా? | More peace, less militancy: What the historic Modi govt-NSCN (IM) pact means for India | Sakshi
Sakshi News home page

ఇక కాల్పులు ఉండవా?

Published Tue, Aug 4 2015 1:50 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

ఇక కాల్పులు ఉండవా? - Sakshi

ఇక కాల్పులు ఉండవా?

కోహిమా: స్వతంత్య్ర దేశం కోసం దాదాపు శత వత్సరాలుగా ఆందోళన చేస్తున్న నాగాలాండ్ ఉద్యమ నేతలతో చరిత్రాత్మకమైన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇక భారత ప్రభుత్వంపై వారి తిరుగుబాటుకు తెర పడినట్లేనని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సోమవారం నాడు ఘనంగా ప్రకటించుకుంది. ఒప్పందం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

1997 నుంచి భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించకుండా పాటిస్తున్న 'నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్' (ఎన్‌ఎస్‌సీఎన్)కు చెందిన ఇసాక్ మూవా వర్గంతో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఇరువర్గాలు ఒప్పందం చేసుకున్నాయి. తంగ్‌కుల్ నాగాలకు ప్రాతినిథ్యం వహిస్తూ శాంతియుతంగా వ్యవహరిస్తున్న ఇసాక్ మూవా వర్గంతో ఒప్పందం చేసుకున్నంత మాత్రాన నాగాలో శాంతి సుమాలు వికసించే అవకాశం ఉందా? మొన్నగాక మొన్న మణిపూర్‌లో 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఎన్‌ఎస్‌సీఎన్-ఖప్లాంగ్ వర్గం సంగతేంటి?  ఇంకా ఆందోళన పథంలోనే సాగుతున్న అనేక నాగా వర్గాలు ఈ ఒప్పందంతో రాజీ పడతాయా? శాంతి మార్గంలోకి వస్తాయా? అన్నది అసలు ప్రశ్న.

నాగాలాండ్ రాజకీయ సమస్యను పరిష్కరించేందుకు గత 18 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఒక వర్గాన్ని వదిలిపెట్టి మరో వర్గంతో, ఆ వర్గాన్ని వదిలిపెట్టి ఇంకో వర్గంతో సాగించిన చర్చోపచర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే ఈశాన్య పాలసీ పేరిట ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ సమస్య పరిష్కారానికి ఒప్పందం చేసుకున్నామని మోదీ ప్రభుత్వం భుజాలు చరుచుకుంటోంది. ఒక చిన్న వర్గంతో ఒప్పందం చేసుకున్న మాత్రాన సమస్య పరిష్కారమైనట్లు భావించలేం. ఒప్పందంలో ఉన్న అంశాలేమిటీ? ఆ అంశాలతో ఆందోళన పథంలోనే కొనసాగుతున్న ఇతర నాగా ఉద్యమ వర్గాలు ఏకీభవిస్తాయా? అన్న అంశంపైనే ఒప్పందం భవిష్యత్తు ఆధారపడి ఉంది.

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్‌లతోపాటు మైన్మార్‌లోని నాగా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిని కలిపి ఓ దేశంగా లేదా పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది నాగాల ప్రధాన డిమాండ్. సదుద్దేశంతోనే వారి ఆందోళన ప్రారంభమైనా చీలికలు వారి బాటలను మార్చాయి. వారిలోని పలు ఉపజాతుల మధ్య సమన్వయం, ఐక్యత కొరవడడం వల్ల వారిలో అనేక వర్గాలు ఏర్పడ్డాయి. స్వతంత్య్ర రాజ్యం కోసం 1918 నుంచే నాగాల ఆందోళన ప్రారంభమైనా, 1980లో ఎన్‌ఎస్‌సీఎన్ ఏర్పాటుతో వారి ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది. నాగాలిమా లేదా గ్రేటర్ నాగాలాండ్ సాధించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంస్థలో అనేక నాగా గ్రూపులు విలీనమయ్యాయి. ఉప జాతుల నేతల మధ్య సమన్వయం, ఐక్యత లోపించడం వల్ల అనతికాలంలోనే ఇందులో చీలికలు ఏర్పడ్డాయి. 1988లో ఎన్‌ఎస్‌సీఎన్‌లో ఖప్లాంగ్, ఇసాక్ మూవా గ్రూపులు వేరయ్యాయి. 2007లో ఇసాక్ వర్గం నుంచి విడిపోయి కొంత మంది నాగా నేతలు ఐక్య సంఘటన పేరిట మరో వర్గాన్ని ఏర్పాటు చేశాయి.

2011లో మళ్లీ ఖప్లాంగ్ వర్గం నుంచి ఖోలీ-కిటోవి అనే వర్గం పుట్టుకొచ్చింది. ఆదే ఖప్లాంగ్ వర్గం నుంచి గత ఏప్రిల్ నెలలో సంస్కరణావాదం పేరిట మరో వర్గం ఏర్పాటైంది. భారత్‌తో 2011లోనే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఖప్లాంగ్ వర్గానికి ప్రస్తుతం మైన్మార్‌లో గట్టి పునాదులు ఉన్నాయి. మైన్మార్ ప్రభుత్వంతో తాజాగా కాల్పుల విరమణ చేసుకున్న ఖప్లాంగ్ వర్గం నేత ఎస్‌ఎస్ ఖప్లాంగ్ భారత ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు గత ఏప్రిల్ నెలలో నిరాకరించారు. మళ్లీ పోరాటానికి ఆయుధాలు పట్టాడు.

రక్తపాతం మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో మైన్మార్‌లోని ఖప్లాంగ్ శిబిరాలను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఎన్డీయో ప్రభుత్వం గత జూన్ నెలలో సైన్యాన్ని మయన్మార్‌లోకి పంపించింది. అక్కడే ఎదురుదాడిలో భారత్ 18 మంది సైనికులను కోల్పోయింది. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇసా మూవా వర్గంతో ఒప్పందం చేసుకుంది. ఇది చరిత్రాత్మక ఒప్పందం అవుతుందా, కాదా ? అన్నది చరిత్రే తేల్చాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement