సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ అసెంబ్లీకి వచ్చే ఫిబ్రవరి నెలలో జరగాల్సిన ఎన్నికలు జరిగేనా? 2015లో నాగాలాండ్ సమస్యపై తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా ఎన్నికలను నిర్వహించినట్లయితే ఆ ఎన్నికలు అర్థరహితం కావడమే కాకుండా కేంద్రం నిజాయితీని శంకించాల్సి వస్తుందని జాతీయ లౌకిక నాగాలిమ్ మండలి (ఎన్‌ఎస్‌సీఎన్–ఐఎం) వ్యాఖ్యానించింది. తరతరాల నుంచి నలుగుతున్న సమస్యకు నాగాలు పరిష్కారం ఆశిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎంత మాత్రం సమంజసం కాదని ఎన్‌ఎస్‌సీఎన్ సాయుధ విభాగం మాజీ అధిపతి వీఎస్ ఆటెమ్ అభిప్రాయపడ్డారు.
ఈ అభిప్రాయలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటిస్తే వాటిని బహిష్కరిస్తారా? అని ప్రశ్నించగా, ముందుగా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనీయండి, ఆ తర్వాత చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆటెమ్ అన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్‌ను తాము గట్టిగా సమర్థిస్తున్నామని పాలకపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్ తెలిపింది. తాము ముందుగా నాగాల సమస్యకు పరిష్కారాన్నే కోరుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఇమ్‌కాంగ్ ఇమ్‌చెన్ తెలిపారు. ముందుగా సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేయండని కేంద్రాన్ని కోరుతూ డిసెంబర్ 15వ తేదీన తాము రాష్ట్ర అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించామని కూడా ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మళ్లీ నాగా సమాజంలో అనేక చీలికలు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమై తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించి లాభం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవడం, ఎన్నికలు నిర్వహించడం రెండు వేర్వేరు అంశాలని నాగా ప్రభుత్వంలో నాగా పీపుల్స్ ఫ్రంట్‌తో భాగస్వామిగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. ‘మేము కూడా సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నాం. అయితే టైమన్నది మన చేతిలో లేదు. సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడం మంచిదే. అయినా మేము కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీ. లౌవుంగు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తోంది. అయితే కేంద్రం ఎన్నికలు నిర్వహిస్తే వాటిని బహిష్కరించకుండా పాల్గొంటామని తెలిపింది.
నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్‌తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేక నాగాలాండ్ లేదా గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్‌ను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. 2015లో పలు నాగా గ్రూపులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్‌ఎస్‌సీఎన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం వివరాలు ఏమిటీ ఇప్పటికి కూడా బహిర్గతం కాలేదు. 1997లో కేంద్రంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంకు ముందు నాగాలు విస్తరించి ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్ర ప్రాంతాలను కలిపి గ్రేటర్ నాగాలాండ్‌ను కేంద్రం ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని, అందులో భాగంగా భారత సార్వభౌమాధికారానికి లోబడి భారత రాజ్యాంగాన్ని గౌరవించేందుకు నాగా గ్రూపులు అంగీకరించాయన్నది ఒప్పందంగా సూచనప్రాయంగా తెల్సింది. దీన్ని ఇటు రాష్ట్ర, కేంద్ర వర్గాలు అవునంటూ ధ్రువీకరించలేదు. కాదని ఖండించనూ లేదు.
Comments
Please login to add a commentAdd a comment