NSCN
-
నాగా అసెంబ్లీకి వచ్చేనెల ఎన్నికలు జరిగేనా?
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ అసెంబ్లీకి వచ్చే ఫిబ్రవరి నెలలో జరగాల్సిన ఎన్నికలు జరిగేనా? 2015లో నాగాలాండ్ సమస్యపై తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా ఎన్నికలను నిర్వహించినట్లయితే ఆ ఎన్నికలు అర్థరహితం కావడమే కాకుండా కేంద్రం నిజాయితీని శంకించాల్సి వస్తుందని జాతీయ లౌకిక నాగాలిమ్ మండలి (ఎన్ఎస్సీఎన్–ఐఎం) వ్యాఖ్యానించింది. తరతరాల నుంచి నలుగుతున్న సమస్యకు నాగాలు పరిష్కారం ఆశిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎంత మాత్రం సమంజసం కాదని ఎన్ఎస్సీఎన్ సాయుధ విభాగం మాజీ అధిపతి వీఎస్ ఆటెమ్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటిస్తే వాటిని బహిష్కరిస్తారా? అని ప్రశ్నించగా, ముందుగా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనీయండి, ఆ తర్వాత చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆటెమ్ అన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్‌ను తాము గట్టిగా సమర్థిస్తున్నామని పాలకపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్ తెలిపింది. తాము ముందుగా నాగాల సమస్యకు పరిష్కారాన్నే కోరుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఇమ్కాంగ్ ఇమ్చెన్ తెలిపారు. ముందుగా సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేయండని కేంద్రాన్ని కోరుతూ డిసెంబర్ 15వ తేదీన తాము రాష్ట్ర అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించామని కూడా ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మళ్లీ నాగా సమాజంలో అనేక చీలికలు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమై తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించి లాభం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవడం, ఎన్నికలు నిర్వహించడం రెండు వేర్వేరు అంశాలని నాగా ప్రభుత్వంలో నాగా పీపుల్స్ ఫ్రంట్‌తో భాగస్వామిగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. ‘మేము కూడా సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నాం. అయితే టైమన్నది మన చేతిలో లేదు. సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడం మంచిదే. అయినా మేము కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీ. లౌవుంగు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తోంది. అయితే కేంద్రం ఎన్నికలు నిర్వహిస్తే వాటిని బహిష్కరించకుండా పాల్గొంటామని తెలిపింది. నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్‌తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేక నాగాలాండ్ లేదా గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్‌ను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. 2015లో పలు నాగా గ్రూపులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్‌ఎస్‌సీఎన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం వివరాలు ఏమిటీ ఇప్పటికి కూడా బహిర్గతం కాలేదు. 1997లో కేంద్రంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంకు ముందు నాగాలు విస్తరించి ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్ర ప్రాంతాలను కలిపి గ్రేటర్ నాగాలాండ్‌ను కేంద్రం ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని, అందులో భాగంగా భారత సార్వభౌమాధికారానికి లోబడి భారత రాజ్యాంగాన్ని గౌరవించేందుకు నాగా గ్రూపులు అంగీకరించాయన్నది ఒప్పందంగా సూచనప్రాయంగా తెల్సింది. దీన్ని ఇటు రాష్ట్ర, కేంద్ర వర్గాలు అవునంటూ ధ్రువీకరించలేదు. కాదని ఖండించనూ లేదు. -
నాగా తిరుగుబాటుదారులపై పంజా
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంత తిరుగుబాటు సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–కప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లోని మయన్మార్ సరిహద్దులో బుధవారం వేకువ జామున భారత బలగాలు జరిపిన ప్రతీకార దాడుల్లో ఎన్ఎస్సీఎన్–కే భారీగా నష్టపోయినట్లు తూర్పు కమాండ్ ప్రకటించింది. భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లను హతమార్చామని, తమకెలాంటి నష్టం వాటిల్లలేదని ఎన్ఎస్సీఎన్–కే పేర్కొంది. ‘భారత్–మయన్మార్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులపై ఎన్ఎస్సీఎన్–కే తిరుగుబాటుదారులు ఉదయం 4.45 గంటలకు కాల్పులు జరిపారు. బదులుగా భారత బలగాలు పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. తిరుగుబాటుదారులు భారీగా నష్టపోయారు. భారత బలగాలు వైపు ఎలాంటి నష్టం జరగలేదు’ అని తూర్పు కమాండ్ ప్రకటించింది. చనిపోయిన లేదా గాయపడిన తిరుగుబాటుదారులెందరో వెల్లడించలేదు. భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దును దాటలేదని పేర్కొంది. భారత్ వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్లు వెలువడిన వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేసింది. ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా...‘మయన్మార్ భారత్‌కు మిత్ర దేశం అనడంలో మరో అభిప్రాయానికి తావు లేదు. మాకు అందిన సమాచారాన్నే మీకు తెలియజేస్తాం’ అని బదులిచ్చారు. ముగ్గురు జవాన్లు హతం: ఎన్ఎస్సీఎన్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎన్ఎస్సీఎన్ పీఆర్వో ఇసాక్ సుమి ఈ దాడి గురించి సమాచారాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. భారత్–మయన్మార్ సరిహద్దుకు 10–15 కి.మీ దూరంలోని మయన్మార్ ఆక్రమిత నాగా ప్రాంతంలోని లాంగ్‌కు గ్రామంలో ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించాడు. ‘తమ శిబిరాల వైపు వస్తున్న భారత ఆర్మీని గుర్తించిన నాగా తిరుగుబాటుదారులు తెల్లవారు జామున 3 గంటలకు కాల్పులకు దిగారు. నేను ఈ పోస్ట్ చేసే సమయంలోనూ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి’ అని పోస్ట్ చేశాడు. ఈ దాడుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు వెల్లడించాడు. తమ వర్గంవైపు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపాడు. ఇసాక్ ప్రస్తుతం మయన్మార్‌లోని యాంగాన్‌లో ఉన్నట్లు అతని పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఇసాక్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత ఆర్మీ...ఈ దాడులు సర్జికల్ స్ట్రైక్స్ కావంది. మణిపూర్‌లో 20 మంది సైనికుల హత్యకు ప్రతీకారంగా 2015, జూన్‌లో కూడా ఆర్మీ ఇలాంటి ఆపరేషనే చేపట్టి వారికి తీవ్ర నష్టం మిగిల్చింది. -
ఇక కాల్పులు ఉండవా?
కోహిమా: స్వతంత్య్ర దేశం కోసం దాదాపు శత వత్సరాలుగా ఆందోళన చేస్తున్న నాగాలాండ్ ఉద్యమ నేతలతో చరిత్రాత్మకమైన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇక భారత ప్రభుత్వంపై వారి తిరుగుబాటుకు తెర పడినట్లేనని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సోమవారం నాడు ఘనంగా ప్రకటించుకుంది. ఒప్పందం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. 1997 నుంచి భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించకుండా పాటిస్తున్న 'నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్' (ఎన్ఎస్సీఎన్)కు చెందిన ఇసాక్ మూవా వర్గంతో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఇరువర్గాలు ఒప్పందం చేసుకున్నాయి. తంగ్‌కుల్ నాగాలకు ప్రాతినిథ్యం వహిస్తూ శాంతియుతంగా వ్యవహరిస్తున్న ఇసాక్ మూవా వర్గంతో ఒప్పందం చేసుకున్నంత మాత్రాన నాగాలో శాంతి సుమాలు వికసించే అవకాశం ఉందా? మొన్నగాక మొన్న మణిపూర్‌లో 18 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఎన్ఎస్సీఎన్-ఖప్లాంగ్ వర్గం సంగతేంటి? ఇంకా ఆందోళన పథంలోనే సాగుతున్న అనేక నాగా వర్గాలు ఈ ఒప్పందంతో రాజీ పడతాయా? శాంతి మార్గంలోకి వస్తాయా? అన్నది అసలు ప్రశ్న. నాగాలాండ్ రాజకీయ సమస్యను పరిష్కరించేందుకు గత 18 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఒక వర్గాన్ని వదిలిపెట్టి మరో వర్గంతో, ఆ వర్గాన్ని వదిలిపెట్టి ఇంకో వర్గంతో సాగించిన చర్చోపచర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే ఈశాన్య పాలసీ పేరిట ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ సమస్య పరిష్కారానికి ఒప్పందం చేసుకున్నామని మోదీ ప్రభుత్వం భుజాలు చరుచుకుంటోంది. ఒక చిన్న వర్గంతో ఒప్పందం చేసుకున్న మాత్రాన సమస్య పరిష్కారమైనట్లు భావించలేం. ఒప్పందంలో ఉన్న అంశాలేమిటీ? ఆ అంశాలతో ఆందోళన పథంలోనే కొనసాగుతున్న ఇతర నాగా ఉద్యమ వర్గాలు ఏకీభవిస్తాయా? అన్న అంశంపైనే ఒప్పందం భవిష్యత్తు ఆధారపడి ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్‌లతోపాటు మైన్మార్‌లోని నాగా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిని కలిపి ఓ దేశంగా లేదా పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది నాగాల ప్రధాన డిమాండ్. సదుద్దేశంతోనే వారి ఆందోళన ప్రారంభమైనా చీలికలు వారి బాటలను మార్చాయి. వారిలోని పలు ఉపజాతుల మధ్య సమన్వయం, ఐక్యత కొరవడడం వల్ల వారిలో అనేక వర్గాలు ఏర్పడ్డాయి. స్వతంత్య్ర రాజ్యం కోసం 1918 నుంచే నాగాల ఆందోళన ప్రారంభమైనా, 1980లో ఎన్ఎస్సీఎన్ ఏర్పాటుతో వారి ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుంది. నాగాలిమా లేదా గ్రేటర్ నాగాలాండ్ సాధించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంస్థలో అనేక నాగా గ్రూపులు విలీనమయ్యాయి. ఉప జాతుల నేతల మధ్య సమన్వయం, ఐక్యత లోపించడం వల్ల అనతికాలంలోనే ఇందులో చీలికలు ఏర్పడ్డాయి. 1988లో ఎన్ఎస్సీఎన్లో ఖప్లాంగ్, ఇసాక్ మూవా గ్రూపులు వేరయ్యాయి. 2007లో ఇసాక్ వర్గం నుంచి విడిపోయి కొంత మంది నాగా నేతలు ఐక్య సంఘటన పేరిట మరో వర్గాన్ని ఏర్పాటు చేశాయి. 2011లో మళ్లీ ఖప్లాంగ్ వర్గం నుంచి ఖోలీ-కిటోవి అనే వర్గం పుట్టుకొచ్చింది. ఆదే ఖప్లాంగ్ వర్గం నుంచి గత ఏప్రిల్ నెలలో సంస్కరణావాదం పేరిట మరో వర్గం ఏర్పాటైంది. భారత్‌తో 2011లోనే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఖప్లాంగ్ వర్గానికి ప్రస్తుతం మైన్మార్‌లో గట్టి పునాదులు ఉన్నాయి. మైన్మార్ ప్రభుత్వంతో తాజాగా కాల్పుల విరమణ చేసుకున్న ఖప్లాంగ్ వర్గం నేత ఎస్ఎస్ ఖప్లాంగ్ భారత ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు గత ఏప్రిల్ నెలలో నిరాకరించారు. మళ్లీ పోరాటానికి ఆయుధాలు పట్టాడు. రక్తపాతం మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో మైన్మార్‌లోని ఖప్లాంగ్ శిబిరాలను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఎన్డీయో ప్రభుత్వం గత జూన్ నెలలో సైన్యాన్ని మయన్మార్‌లోకి పంపించింది. అక్కడే ఎదురుదాడిలో భారత్ 18 మంది సైనికులను కోల్పోయింది. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇసా మూవా వర్గంతో ఒప్పందం చేసుకుంది. ఇది చరిత్రాత్మక ఒప్పందం అవుతుందా, కాదా ? అన్నది చరిత్రే తేల్చాలి. -
నాగాలతో కేంద్రం శాంతి ఒప్పందం
-
నాగాలతో కేంద్రం శాంతి ఒప్పందం
1948 నుంచి నాగాలు చేస్తున్న పోరాటానికి తెర పడింది. ఎన్ఎస్సీఎన్ (నేషనలిస్టు సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్) లోని రెండు ప్రధాన వర్గాల్లో అతి బలీయమైన టి. ముయివా వర్గంతో కేంద్రం నాగా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఎస్సీఎన్లోని రెండో వర్గమైన ఖప్లాంగ్ వర్గం మీద ఇటీవలే బర్మాలో భారత సైన్యం దాడి చేసి, ఆ వర్గాన్ని దాదాపుగా నిర్మూలించింది. దాంతో ముయివా వర్గంతో ఒప్పందం సాధ్యమైంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి రవికుమార్ ఈ మేరకు టి.ముయివాతో ఒప్పంద పత్రాలు పంచుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో చర్చలు మొదలయ్యాయని ఈ సందర్భంగా టి. ముయివా పేర్కొన్నారు. తర్వాత మాజీ ప్రధాని వాజ్‌పేయి పరిపాలనా దక్షత కూడా కొంతవరకు ఈ చర్చల ప్రక్రియకు మేలు చేసిందన్నారు. కాగా, పీవీ హయాంలో జరిగిన చర్చల్లో.. ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి, హోం శాఖ మాజీ కార్యదర్శి టి.పద్మనాభయ్య పాల్గొని.. ఈ సమస్య ఓ పరిష్కారానికి వచ్చేందుకు పునాదులు వేశారు. చివరకు ప్రధాని నరేంద్రమోదీ హయాంలో.. ఈ ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దొవాల్ కూడా పాల్గొన్నారు. నాగాలకు, భారతీయులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ప్రభుత్వం చూపిన చొరవను టి.ముయివా ఈ సందర్భంగా ప్రశంసించారు. 'కుక్ నాలిం' (అంటే గాడ్ బ్లెస్ యు) అంటూ తన ప్రసంగాన్ని ఆయన ముగించారు. తర్వాత నాగా ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీకి తమ సంప్రదాయ జాకెట్ తొడిగి, శాలువ బహూకరించారు.