
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంత తిరుగుబాటు సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–కప్లాంగ్(ఎన్‌ఎస్‌సీఎన్–కే)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లోని మయన్మార్ సరిహద్దులో బుధవారం వేకువ జామున భారత బలగాలు జరిపిన ప్రతీకార దాడుల్లో ఎన్‌ఎస్‌సీఎన్–కే భారీగా నష్టపోయినట్లు తూర్పు కమాండ్ ప్రకటించింది.
భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లను హతమార్చామని, తమకెలాంటి నష్టం వాటిల్లలేదని ఎన్‌ఎస్‌సీఎన్–కే పేర్కొంది. ‘భారత్–మయన్మార్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులపై ఎన్‌ఎస్‌సీఎన్–కే తిరుగుబాటుదారులు ఉదయం 4.45 గంటలకు కాల్పులు జరిపారు. బదులుగా భారత బలగాలు పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. తిరుగుబాటుదారులు భారీగా నష్టపోయారు.
భారత బలగాలు వైపు ఎలాంటి నష్టం జరగలేదు’ అని తూర్పు కమాండ్ ప్రకటించింది. చనిపోయిన లేదా గాయపడిన తిరుగుబాటుదారులెందరో వెల్లడించలేదు. భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దును దాటలేదని పేర్కొంది. భారత్ వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్లు వెలువడిన వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేసింది. ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా...‘మయన్మార్ భారత్‌కు మిత్ర దేశం అనడంలో మరో అభిప్రాయానికి తావు లేదు. మాకు అందిన సమాచారాన్నే మీకు తెలియజేస్తాం’ అని బదులిచ్చారు.
ముగ్గురు జవాన్లు హతం: ఎన్‌ఎస్‌సీఎన్
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎన్‌ఎస్‌సీఎన్ పీఆర్వో ఇసాక్ సుమి ఈ దాడి గురించి సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. భారత్–మయన్మార్ సరిహద్దుకు 10–15 కి.మీ దూరంలోని మయన్మార్ ఆక్రమిత నాగా ప్రాంతంలోని లాంగ్‌కు గ్రామంలో ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించాడు. ‘తమ శిబిరాల వైపు వస్తున్న భారత ఆర్మీని గుర్తించిన నాగా తిరుగుబాటుదారులు తెల్లవారు జామున 3 గంటలకు కాల్పులకు దిగారు. నేను ఈ పోస్ట్ చేసే సమయంలోనూ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి’ అని పోస్ట్ చేశాడు.
ఈ దాడుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు వెల్లడించాడు. తమ వర్గంవైపు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపాడు. ఇసాక్ ప్రస్తుతం మయన్మార్‌లోని యాంగాన్‌లో ఉన్నట్లు అతని పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఇసాక్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత ఆర్మీ...ఈ దాడులు సర్జికల్ స్ట్రైక్స్ కావంది. మణిపూర్‌లో 20 మంది సైనికుల హత్యకు ప్రతీకారంగా 2015, జూన్‌లో కూడా ఆర్మీ ఇలాంటి ఆపరేషనే చేపట్టి వారికి తీవ్ర నష్టం మిగిల్చింది.