Army attacks
-
ఇజ్రాయెల్-గాజా: ఒక్కరోజులో 704 మంది బలి
రఫా/టెల్అవీవ్/న్యూఢిల్లీ: గాజారస్టిప్లో హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు మరింత ఉధృతం చేసింది. గత 24 గంటల వ్యవధిలో 400 వైమానిక దాడులు నిర్వహించామని మంగళవారం ప్రకటించింది. బాంబు దాడులతో హమాస్ స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని పేర్కొంది. ఈ దాడుల్లో పలువురు హమాస్ కమాండర్లు హతమయ్యారని వెల్లడించింది. కానీ, ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలియజేసింది. వీరిలో 305 మంది చిన్నారులు, 173 మంది మహిళలు ఉన్నారని వివరించింది. సోమవారం రాత్రి ఇజ్రాయెల్ దాడుల్లో ఖాన్ యూనిస్ సిటీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 32 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ భవనంలో 100 మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ఉత్తర గాజా నుంచి వచ్చినవారే. గాజాలో 2,055 మంది చిన్నారులు మృతి ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు వెల్లడించాయి. ఈ మారణహోమం ఆపేందుకు అంతర్జాతీయ సమాజం వెంటనే చొరవ చూపాలని కోరాయి. సామాన్య ప్రజల ప్రాణాలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని, కాల్పుల విరమణ పాటించాలని, ఘర్షణకు తెరదించాలని ఇజ్రాయెల్ సైన్యానికి, హమాస్ మిలిటెంట్లకు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మంగళవారం 18వ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇప్పటిదాకా గాజాలో 5,087 మంది మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 2,055 మంది చిన్నపిల్లలు ఉన్నారని పేర్కొంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా చనిపోయారు. మిలిటెంట్ల అదీనంలో 200 మందికిపైగా బందీలు ఉన్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో సాధారణ నివాస గృహాలు, పాఠశాలలు, మసీదులు నేలమట్టయ్యాయి. ఎటుచూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. గాజాలో 10 లక్షల మందికిపైగా మైనర్లు నిర్బంధంలో చిక్కుకుపోయారని ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో 27 మంది బాలలు మరణించారని వెల్లడించింది. ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు చేస్తోందని, చిన్నారుల్ని బలి తీసుకుంటోందని ఆరోపించింది. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో సేవలు బంద్ ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల వల్ల గాజాలో క్షతగాత్రుల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా, మరోవైపు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే మూడింట రెండొంతుల ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఎలాంటి సేవలు అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. 72 ఆరోగ్య కేంద్రాలకు గాను 46, 35 ఆసుపత్రులకు గాను 12 ఆసుపత్రుల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయని మంగళవారం ప్రకటించింది. ఔషధాలు, విద్యుత్, ఇంధన కొరత కారణంగా క్షతగాత్రులకు సేవలందించలేకపోతున్నామని పాలస్తీనా అరోగ్య శాఖ అంటోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కొన్ని ఆరోగ్య కేంద్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికితోడు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజాలో ఆరోగ్య వ్యవస్థ అత్యంత అధ్వాన స్థితికి చేరుకుందని ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. బందీల సమాచారం ఇవ్వండి గాజాపై భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రస్తుతానికి వైమానిక దాడులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భూతల దాడులు ప్రారంభమైతే గాజాలో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లకి హమాస్ మిలిటెంట్లు స్పందిస్తున్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు బందీలను ఇప్పటికే విడుదల చేయగా, సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను విడుదల చేశారు. బందీల సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచిస్తూ ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కరపత్రాలు జారవిడిచింది. సమాచారం అందజేసేవారికి ఆపద రాకుండా కాపాడుతామని హామీ ఇచ్చింది. నిండిపోయిన శ్మశాన వాటికలు ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ ప్రారంభమైన తర్వాత గాజాలో 14 లక్షల మంది ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. వీరిలో దాదాపు 5.80 లక్షల మంది ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోకి ఆహారం, ఇతర సహాయక సామాగ్రిని అనుమతిస్తున్న ఇజ్రాయెల్ పెట్రోల్, డీజిల్‌ను మాత్రం అనుమతించడం లేదు. గాజాలో మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ఒకే సమాధిలో ఐదు మృతదేహాలను ఖననం చేస్తున్నారు. పాత సమాధులను తవ్వేసి, కొత్త మృతదేహాలను సమాధి చేస్తున్నారు. -
కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?
కిందటి వారాంతంలో సాయుధబలగాలు నాగాలాండ్‌లోని ఓ మారుమూల సరిహద్దులో పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాదమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడిపాక... సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. ‘దేశ పౌరులపై చర్యలకు తలపడేటప్పుడు సాయుధ బల గాలు సంయమనం, కనీస బలప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. సుప్రీం కోర్టు, ఈశాన్య ప్రాంత ప్రజలు, అక్కడి ముఖ్యమంత్రులు సైతం నిరంకుశ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరెప్పుడు రద్దు? ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నాయకులు తమ నిరసన శిబిరాన్ని గురువారం ఎత్తివేస్తున్న సమయానికి నాగాలాండ్‌లోని ఓ మారుమూల సరిహద్దులో పరిస్థితి భిన్నంగా ఉంది. మయన్మార్‌తో సరిహద్దు కలిగిన మోన్ జిల్లా ఓటింగ్ పరిసరాల్లోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో నల్ల జెండాలు దర్శనమిస్తున్నాయి. క్రిస్టమస్ కొనుగోళ్లతో సందడిగా ఉండాల్సిన దుకాణాలపైన, దారి పొడుగు స్థంబాలపైన, వాహనాలపైన నల్లజెండాలు ఎగురవేస్తూ స్థానికులు నిరసన చెబుతున్నారు. కిందటి వారాంతంలో సాయుధ బలగాలు పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాధమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. సైనికులతో సహా ఎవరినీ తమ ప్రాంతంలోకి ఓటింగ్ గ్రామస్తులు ఇపుడు అను మతించడం లేదు. కేంద్ర గృహమంత్రి అమిత్‌షా పార్లమెంటులో చేసిన ప్రకటనను ‘నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ (ఎన్ఎస్సీఎన్) ఖండిస్తూ తీవ్రంగా ద్వజమెత్తింది. రక్షణ బలగాలకు విశృంఖల స్వేచ్చ, అధికారం కల్పిస్తున్న ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం–ఏఎఫ్ఎస్పీయే’ ఒక నల్లచట్టమంటూ, వ్యతిరే కంగా ప్రకటన జారీ చేసింది. ఆ చట్టం ఎత్తివేయకుండా, ఏ రాజకీయ ప్రక్రియనూ సాగనివ్వబోమని తేల్చి చెప్పింది. పలు నాగా తిరుగు బాటు సంస్థల్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా నిర్వ హిస్తున్న శాంతి ప్రక్రియపై తాజా పరిణామాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్నది వేచి చూడాల్సిందే! కానీ, ఇదంతా దేశపు ఈశాన్యం లోని ఓ మారుమూలలో జరుగుతున్న చిన్నపాటి ‘కుంపటి రగలడం’ మాత్రమే! దినకూలీతో బతికే సామాన్యుల్ని, కర్కషంగా సాయుధ బలగాలు నలిపేసిన ఓ దుర్ఘటనపై దేశం తగు రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమౌతోంది. అంతర్జాతీయంగా... మానవహక్కుల పరి రక్షణ సూచీలో మనది ఎప్పుడూ నేల చూపే! తాజా ఘటనతో సహా ‘సైనికులది తప్పే’ అని ఏలినవారు ముక్తసరిగా అంగీకరించినా... అటువంటి తప్పులు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్య లేమీ లేవు. బలగాల అకృత్యాలను నిలువరించే కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పడటం లేదని ఈశాన్య రాష్ట్రాల మానవహక్కుల కార్యకర్తలు, పౌర సంఘాల ప్రతినిధులు అంటున్నారు. పదమూడు నెలలకు పైబడి రైతాంగం, ఫలితం రాబట్టుకునే దాకా జరిపినట్టు పోరాటం అన్ని సందర్భాల్లో, అందరివల్లా అవుతుందా? పలు ఈశాన్య రాష్ట్రాల్లో దశా బ్దాలుగా పోరాడినా... ఒక నల్లచట్టాన్ని ప్రభుత్వాలు రద్దు చేయటం లేదనే ఆందోళన ఉంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడి పాక సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. మానవ తప్పిదమా, మానని జాడ్యమా? తప్పు చేసినా తప్పించుకోవచ్చు, శిక్ష ఏమీ ఉండదన్న ధీమాయే సాయుధ బలగాల దుశ్చర్యలకు కారణమని పలుమార్లు రుజువైంది. ఈ చట్టంలోనూ అటువంటి లొసుగులే ఉన్నాయి. చట్టం కల్పించిన అధికారం, చేతిలో ఆయుధం ఇచ్చే బలం ఉన్నాయని అక్కడక్కడ రక్షణ బలగాలు చేసే ఆగడాలను ఉపేక్షించడం తప్పు. ఇలాంటి దుర్ఘటనల వల్ల ప్రభుత్వానికి అపకీర్తి వస్తుందని, పాలకులు సదరు ఆగడాలను వెనుకేసుకొస్తున్నారు. అతకని వాదనల్ని సమర్థిస్తూ మాట్లాడటం, చిన్న తప్పిదంగా కొట్టిపారవేసే వైఖరి మంచిది కాదు. దేశ సరిహద్దుల్లో, కల్లోలిత ప్రాంతాల్లో ఉగ్రమూకల తీవ్రవాదం, హింస, వి«ధ్వంస కార్యకలాపాలను నియంత్రించే క్రమంలో ఇటువం టివి మామూలే! అని బాధ్యత కలిగిన పౌరసమాజం కూడా సాధార ణీకరించడం దుర్మార్గం. ఎవరివైనా ప్రాణాలే! దేశవాసులకు తాము నిరంతర రక్షణ కల్పిస్తున్నామనే ‘త్యాగ భావన’ నీడలో... ఏ సామా న్యుల ప్రాణాలో నిర్హేతుకంగా తీసే హక్కు రక్షణ బలగాలకు ఉంటుందా? ఈ ప్రశ్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు తెగల గిరిజ నులు, ఆదివాసీలు, అల్ప సంఖ్యాకులు, విభిన్న జాతుల వారు తరచూ లేవనెత్తుతున్నారు. జాతుల సమస్య, అస్తిత్వ ఆరాటాలుండే నిత్య పోరాట నేలల్లో సామాన్యుల బతుకు సదా దర్బరమౌతోంది. బలగాల దీష్టీకాలకు అడ్డు–అదుపూ ఉండదు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వీరిపై ఏ విచారణా జరుగదు. సాయుధబలగాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు, యువకుల్ని ఎత్తుకుపోవడం, ఎదురుకాల్పుల పేరిట మట్టుపెట్టడం... మానవ హక్కుల హననానికి ఎన్ని రూపాలో! వీటిని నిరసిస్తూ... హక్కుల కార్యకర్త – ఉక్కు మహిళ, ఇరోమ్ షర్మిల పద హారేళ్లు మౌన–నిరాహార దీక్ష చేసి ప్రపంచ దృష్టినాకర్శించినా మన ప్రభుత్వాలు కదల్లేదు, చట్టం రద్దవలేదు, ఫలితం శూన్యం! 2000–12 మధ్య ఒక్క మణిపూర్‌లో సాయుధబలగాలు జరిపిన 1528 ఎన్‌కౌం టర్ల పై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శానికి ఇవాల్టికీ అతీ–గతీ లేదు. కట్టుకథలదే ‘రాజ్యం’! గత శని–ఆది వారాల దుర్ఘటనలు పుండైతే, మాన్పే ప్రయత్నం చేయక పోగా కేంద్రం వైఖరి దానిపై కారం రుద్దినట్టుందనే విమర్శ వస్తోంది. మూడు రోజుల తర్వాత నోరిప్పిన ఓటింగ్ గ్రామస్తులు చెప్పే విష యాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. కాల్పుల్లో మరణించిన గని కూలీల శవాలను పక్కకు తీసి, వారి చొక్కాలు విప్పి మిలిటెంట్ల గుడ్డలు, బూట్లు తొడిగి, వారి చేతుల్లో ఆయుధాలు పెట్టి... బమటి ప్రపంచానికి చూపే యత్నం చేశారని! తద్వారా తమ దాష్టీకానికి హేతుబద్ధత తెచ్చే ప్రయత్నంలో సాయుధబలగాలు గ్రామస్తులకు దొరికాయి. ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు ప్రతిదాడికి దిగారు. నిరసన చల్లార్చే క్రమంలో మరో ఏడుగురు గ్రామస్తుల్ని బలగాలు పొట్టన పెట్టుకున్నాయి. ట్రాలీ కూలీల్లో బతికిన∙షీవాంగ్ చెప్పడమేమిటంటే, సాయుధులు తమ వాహనాన్ని అడ్డుకోలేదు, ఆపమని అడగలేదు, అదుపులోకి తీసుకునే ఏ ప్రయత్నమూ చేయకుండానే నేరుగా కాల్పులు జరిపారని. మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్లు ఎకే–47 మారణాయుధాలు, మర తుపాకులు, గ్రెనేడ్ల అక్రమ రవాణాకు పాల్ప డుతున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది అనేది ‘21 పారా స్పెషల్ ఫోర్స్’ బృంద కథనం! సరే, వాదన కోసమైనా, ‘వారు చెప్పేది’ కాసేపు నిజమనుకుందాం, ఈ విషయం స్థానిక పోలీసులకు, అస్సాం రైఫిల్స్‌కి ఎందుకు చెప్పలేదు? దారికాచి వాహనాన్ని అడ్డ గించే ప్రయత్నమో, టైర్లనో, ఇంజన్నో కాల్పులతో పనికి రాకుండా చేసి అనుమానితుల్ని నిర్బంధంలోకి తీసుకోవడమో, బలవంతపు లొంగుబాట్లకో ఎందుకు యత్నించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. అసలక్కడ కవ్వింపులే లేవు! వారు జరిపింది ఆత్మరక్షణ కాల్పులు కాదు, అణచివేసే అహంతోనో, అధికారాలున్నాయనే మిడి సిపాటో, ట్రిగ్గర్ మోజో... అయి ఉంటుందనేది విశ్లేషణ! వదలని వలసవాద మూలాలు ఎన్ని కమిటీలు? ఎన్ని అధ్యయనాలు? ఎన్నెన్ని నివేధికలున్నా.... చట్టంపై పునరాలోచనే లేదు. 1958 సాయుధ బలగాల ప్రత్యేక అధి కారాల చట్టమైనా,1972 కల్లోలిత ప్రాంతాల చట్టమైనా... వీటి మూలాలు బ్రిటిష్ వాలసపాలకులు, 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్య మాన్ని అణచివేసేందుకు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. సర్వ సత్తాక సార్వభౌమ దేశానికి అవి పొసగేవి కావు. ‘దేశ పౌరులపై చర్య లకు తలపడేప్పుడు సాయుధ బలగాలు సంయమనం, కనీస బల ప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్, జస్టిస్ జె.ఎస్.వర్మ కమిషన్ కూడా ఈ చట్టం వద్దనే సిఫారసు చేశాయి. ప్రస్తుతం నాగాలాండ్, మెఘాలయ ముఖ్యమం త్రులే కోరుతున్నారు. కేంద్రం 2004లో, జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సమాచారం సేకరించి 2005లో ఇచ్చిన నివేదికలో ‘సత్వరమే ఈ చట్టాన్ని రద్దు చేయాలి’ అని నివేదించింది. మరెప్పుడు రద్దు? దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
17 మంది అమాయకులు బలి.. ఇంకెన్నాళ్లీ చట్టం?
సాక్షి, నేషనల్ డెస్క్: వచ్చిందెవరో ధ్రువీకరించుకోకుండానే... వారి వద్ద ఆయుధాలున్నాయా? దాడికి ప్రయత్నిస్తున్నారా? అనేవి ఏవీ చూడకుండా పనులకెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఆర్మీ జవాన్లు కాల్పులకు తెగబడటం విభ్రాంతికలిగించింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కే చేరింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు కొత్తేమీ కాదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కట్టబెట్టిన అపరిమిత అధికారాలతోనే సైన్యం ఇలాంటి అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తిరుగుబాట్లను, వేర్పాటువాదాన్ని, నిషేధిత ఉగ్రసంస్థలను అణచివేసే చర్యల పేరిట అమాయాకుల ఊచకోత, మహిళలపై సైన్యం అకృత్యాలు చేసిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి. ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని ఇక్కడి పౌర సమాజం, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని, అలజడులను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వాల యం త్రాంగాలకు సాధ్యం కాకపోవడంతో ఆరు దశాబ్దాల కిందట 1958లో కేంద్ర ప్రభుత్వం ‘ఏఎఫ్ఎస్పీఏ’ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం... ►కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రదేశాల్లో శాంతిభద్రతలను కాపాడే అధికారం సైనిక బలగాలకు దఖలు పడుతుంది. ►ఐదుగురికి మించి ఒకేచోట గుమిగూడకుండా ఆర్మీ నిషేధం విధించగలదు. ►ఎవరైనా ఈ ఆజ్ఞలను ఉల్లంఘించారని భావిస్తే బలప్రయోగం ద్వారా నియంత్రించొచ్చు. ముందస్తు హెచ్చరిక జారీచేసి కాల్పులూ జరపొచ్చు. ►సమంజసమైన అనుమానం ఉంటే వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టుకు కారణాలను వివరిస్తూ తర్వాత సమీపంలోని పోలీసుస్టేషన్లో సదరు వ్యక్తిని లేదా వ్యక్తులను అప్పగించవచ్చు. ►వారెంటు లేకుండానే ఎవరి ఇంట్లోకైనా ప్రవేశించి సోదాలు జరపొచ్చు. ►ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించొచ్చు. ఏది కల్లోలిత ప్రాంతమంటే... భిన్న మతాలు, జాతులు, భాషలు, కులాలు, ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి ఘర్షణలు తలెత్తితే... ఆ ఏరియాను ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించే వీలును ఏఎఫ్ఎస్పీఏ చట్టంలోని సెక్షన్–3 కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ), లేదా రాష్ట్ర గవర్నర్ మొత్తం రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించొచ్చు. శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర యంత్రాంగానికి సైనిక బలగాల సాయం అవసరమైన చోట్ల ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను ప్రయోగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలివేయవచ్చు. ఎక్కడెక్కడ అమలులో ఉంది? అస్సాం, నాగాలాండ్, మణిపూర్ (మణిపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాను మినహాయించి), అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్, లాంగ్డింగ్, తిరప్ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. నాగాలాండ్‌లో డిసెంబరు 31 దాకా దీన్ని పొడిగిస్తూ ఈ ఏడాది జూన్ 30నే ఆదేశాలు జారీ అయ్యాయి. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 11న మరో ఆరునెలలు ఈ చట్టం అమలును పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మేఘాలయలో ఏప్రిల్ 1, 2018న ఈ చట్టాన్ని కేంద్రం ఎత్తివేసింది. 16 ఏళ్ల పోరాటం ఇరోమ్ షర్మిల... మణిపూర్ ఉక్కుమహిళగా ఖ్యాతికెక్కిన ఈ పేరు చిరపరిచితమే. 2000 నవంబరులో మణిపూర్‌లోని మలోమ్ పట్టణంలో బస్సు కోసం వేచిచూస్తున్న 10 మంది సాధారణ పౌరులను అస్సాం రైఫిల్స్ దళం కాల్చి చంపింది. ఈ మలోమ్ ఊచకోతకు నిరసనగా, ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్‌తో 28 ఏళ్ల ఇరోమ్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులకే ఆత్మహత్యకు ప్రయత్నించిందనే అభియోగంపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 2000 నవంబర్ నుంచి 2016 ఆగస్టు దాకా పోలీసు కస్టడీలోనే ఇరోమ్ షర్మిల నిరాహారదీక్షను కొనసాగించారు. ఈ సమయంలో ట్యూబ్ ద్వారా ఆమెకు బలవంతంగా ద్రవాహారం అందించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఎంతకీ ఉపసంహరించుకోకపోవడంతో ఆమె మనసు మార్చుకొని 2016 ఆగస్టు 9న తన దీక్షను విరమించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇరోమ్ సొంత పార్టీ పెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబీ సింగ్‌పై పోటీచేశారు. కేవలం 90 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ ప్రజలపై అకృత్యాలను ఎండగడుతూ... ప్రపంచం దృష్టిని అకర్షించి, ఏకధాటిగా 16 ఏళ్లు దీక్ష చేసినా... సొంత జనమే ఆదరించలేదు. సాయుధ బలగాల అకృత్యాలకు ఊతమిచ్చే ఈ నిరంకుశ చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
మయన్మార్‌లో ఘర్షణలు, 25 మంది మృతి
యాంగాన్: మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, పెత్తనం సాగిస్తోన్న జుంటా సైనిక చర్యకు వ్యతిరేకంగా సెంట్రల్ మయన్మార్‌లో జరిగిన ఘర్షణల్లో ఇరవై ఐదు మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో యాంటీ జుంటా ఉద్యమకారులతో పాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలగొట్టి, పాలనా పగ్గాలు చేపట్టిన జుంటా సైన్యం.. నిత్యం తుపాకుల మోత మోగిస్తూ అరాచకం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు సైనిక బలగాల చేతుల్లో 890 మంది ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంఘం తెలిపింది. కాగా, జుంటా సైన్యం చేపడుతున్న చర్యలు సిరియాలో మాదిరిగా పౌర సంఘర్షణలకు దారి తీయవచ్చని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తుంది. -
తాజ్‌మహల్ పైనుంచి విమానాలు వెళ్లలేవు, ఎందుకో తెలుసా?
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి, ఆ ప్రజలపైనే దాడులకు తెగబడుతున్న మయన్మార్ నియంత పాలకుల మారణహోమం మొత్తానికి భూతలం నుంచి గగనతలానికి చేరుకుంది! కుట్రకు వ్యతిరేకంగా వీధులలోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరుపుతున్న పౌరులపై సొంత సైన్యమే జరిపిన కాల్పులలో ఫిబ్రవరి 1 నుంచి (ప్రభుత్వాన్ని సైన్యం హస్తగతం చేసుకున్న రోజు) ఇంతవరకు వెయ్యిమందికి పైగా మరణించారు. వీరు కాక, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలపై సైనిక విమానాలు నిన్న, మొన్న జరిపిన బాంబు దాడుల వల్ల మరణించినవారిలో వంద మందికి పైగా పౌరులు, చిన్నారులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం నాడు ఐక్యరాజ్య సమితిలో మయన్మార్ రాయబారి క్యాఉమో తున్ మయన్మార్‌ను నిర్వైమానిక మండలం (నో–ఫ్లయ్ జోన్) గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మయన్మార్ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటిస్తే వెంటనే అక్కడ విమానాలు ఎగరడం ఆగిపోవాలి. లేకుంటే అది అంతర్జాతీయ ఆదేశాలకు విరుద్ధం అవుతుంది. అసలు నో–ఫ్లయ్ జోన్‌ను ఏయే పరిస్థితుల్లో ప్రకటిస్తారు? నో–ఫ్లయ్ జోన్ విధింపును ఉల్లంఘిస్తూ ఒక విమానం గాల్లోకి లేస్తే ఆ విమానాన్ని కూల్చివేయవచ్చా? ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వం మిలటరీ చేతుల్లో ఉంది. మిలటరీనే పౌరులపై వైమానిక దాడులకు పాల్పడుతోంది కనుక వారి విమానాలను ఎవరు నేలకు ‘దించుతారు’? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ కింది ఏడు నో–ఫ్లయ్ జోన్స్‌లో దొరుకుతాయి. ఇంకొక విషయం. కేవలం యుద్ధ వాతావరణంలో మాత్రమే నో–ఫ్లయ్ జోన్స్‌ని ప్రకటిస్తారనేం లేదు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కూడా ప్రత్యేక ప్రాంతాలలో విమానాలను ఎగరనివ్వరు. ఉత్తర కొరియా ఈ దేశం ఎప్పుడు, ఎక్కడ, ఏ మిస్సయిల్ను పరీక్షించి చూసుకుంటుందో ఎవరికీ తెలియదు. చిన్న హెచ్చరికైనా జారీ చేయకుండా తరచు జపాన్ సముద్రం మీదుగా ఉత్తర కొరియా తన క్షిపణుల పని తీరును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ ఉంటుంది! అందుకే ప్రపంచంలోని అనేక దేశాలకు ఉత్తర కొరియా గగనతలం నో–ఫ్లయింగ్ జోన్. చివరికి ఐక్యరాజ్య సమితికి కూడా. తాజ్‌మహల్, ఇండియా భారత ప్రభుత్వం 2006లో తాజ్‌మహల్ గగనతలాన్ని నిర్వైమానిక మండలంగా ప్రకటించింది. తాజ్‌మహల్ పైన విమానాలు ఎగిరేందుకు లేదు. కట్టడాన్ని విమానాల శబ్దం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకల వల్ల జనించే కాలుష్యం నుంచి ఆ పాలరాతి భవనాన్ని సంరక్షించే ప్రయత్నం కూడా అది. బకింగ్‌హామ్ ప్యాలెస్, లండన్ బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఉత్తర భాగం, ఉక్రెయన్ 2014లో ఇక్కడ జరిగిన ఘోర దుర్ఘటనలో మలేషియా విమానం ఎంహెచ్–17 కూలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులంతా మరణించారు. దాంతో విమానాలు ఎగిరేందుకు యోగ్యం కాని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా దీనిని పరిగణించి, నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు, రష్యా, ఉక్రెయిన్ల మధ్య నడిచే అన్ని విమానాలూ ఒక దాని గగనతలం మీద ఒకటి (కొన్ని ప్రాంతాల మీదుగా) ఎగిరేందుకు లేదు. సరిహద్దు వివాదాలు అందుకు కారణం. వాల్ట్ డిస్నీ వరల్డ్, యు.ఎస్.ఎ. ఈ థీమ్ పార్క్‌కు మూడు మైళ్ల పరిధిలో, 3000 అడుగుల లోపు ఎత్తులో విమానాలు ఎగిరేందుకు లేదు. విమానాల ధ్వనులు అత్యంత సున్నితమైన తమ నిర్మాణాలకు పడవని డిస్నీ అంటుంది! ఆ ధ్వనులు.. ప్రశాంతమైన డిస్నీకి కొత్తగా వచ్చినవాళ్లను భయపెట్టే ప్రమాదం ఉందని కూడా యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటించింది. అయితే ‘ఫ్లయింగ్ అడ్వరై్టజ్మెంట్లు’ ఇచ్చేందుకు వీల్లేకుండా తమను నివారించడానికే డిస్నీ ఆ ప్లాన్ వేసిందని పోటీదారుల ఆరోపణ. ఏరియా 51, యు.ఎస్.ఎ. నెవడా రాష్ట్రంలోని ఎడారి వంటి ఈ ప్రాంతం అమెరికా రక్షణదళం అధీనంలో ఉంది. అమెరికా సైన్యం నిరంతరం ఇక్కడ మిలటరీ టెక్నాలజీకి సంబంధించిన రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. 1950 లు, 60 లలో ‘యు–2 స్పై ప్లేన్’ను ఇక్కడే తయారు చేశారు. యు.ఎస్. రాజధాని వాషింగ్టన్‌పై ఎంత గట్టి నిఘా ఉంటుందో ఈ ‘ఏరియా 51’ చుట్టూ, లోపల మానవ కదలికలపై అంతకుమించిన నిఘా, ఆంక్షలు ఉంటాయి. ఏరియా 51 గగనతలంపై చిన్న పిట్టలాంటి విమానం కూడా ఎగరడానికి లేదు. అది స్వదేశీ విమానమే అయినా.. నేల కూల్చేస్తారు. తియానన్మెన్ స్క్వేర్, చైనా చైనా గగనతలంలో ఏ ప్రాంతంలోనైనా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయంటే అది తియానన్మెన్ స్క్వేరే. ఆ స్క్వేర్ మీదుగా విమానాలు వెళ్లకూడదు. ఒకప్పుడు పావురాలు, ద్రోణ్‌లు, బెలూన్లు కూడా పైన ఎగరడం నిషిద్ధం. వెంటనే షూట్ చేసి పడగొట్టేసేవారు. ఈ స్క్వేర్‌లోనే అమూల్యమైన పురావస్తుశాలల భవంతులు, చైనా చారిత్రక యోధుల స్మరణ మందిరాలు ఉన్నాయి. వాటికి తాకిడి లేకుండా ఉండేందుకే నో–ఫ్లయ్ జోన్ చేశారు. బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి. -
హింసాత్మక ఘటనపై స్పందించిన అమెరికా
వాషింగ్టన్: తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై అమెరికా స్పందించింది. దీనిపై అమెరికా విదేశాంగ ప్రతినిధి వాషింగ్టన్ నుంచి మాట్లాడుతూ.. భారత్, చైనా దళాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. 20 మంది భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. మేము వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. భారత్- చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు త్వరగా సద్దుమణిగి.. శాంతియుత పరిష్కారానికి రావాలనే ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాము. కాగా.. జూన్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఫోన్ ద్వారా సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చించినట్లు ఆ దేశ ప్రతినిధి చెప్పారు. చదవండి: విషం చిమ్మిన చైనా.. ఐరాస ఆందోళన భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు భారత్ - చైనా చర్యలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
లదాఖ్‌లో భారత్, చైనా బాహాబాహీ
న్యూఢిల్లీ: లదాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత్, చైనా బలగాల మధ్య బుధవారం ఉద్రిక్తత తలెత్తింది. అయితే, చర్చల అనంతరం సాయంత్రానికి ఉద్రిక్తత సమసింది. పాంగోంగ్ త్సో సరస్సు ఒడ్డున బుధవారం ఉదయం భారత్ బలగాలు పహారా కాస్తుండగా చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. తర్వాత, చైనా బలగాలు పోట్లాటకు దిగాయి. దీంతో రెండు వైపులా పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంలో బలగాలను మోహరించాయి. దీంతో రెండు దేశాల సైనిక ప్రతినిధులు చర్చించి ఓ అంగీకారానికి వచ్చారు. సాయంత్రానికి ఎవరికి వారు బలగాలను ఉపసంహరించుకోవడంతో ఉద్రిక్తత సడలింది. -
వేట షురూ.. భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదలు ఏరివేత కార్యక్రమం మొదలైంది. రంజాన్ తర్వాత కాల్పుల విరమణ ముగిసినట్లు కేంద్రం ప్రకటించటం, ఆ తర్వాత కశ్మీర్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు విదితమే. తదనంతరం భారీ సంఖ్యలో భద్రతా బలగాలు కశ్మీర్లో పాగా వేశాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ‘శ్రీగుఫరా ప్రాంతంలోని ఖీరమ్ వద్ద ఉగ్రవాదులు దాక్కున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సైన్యానికి సమాచారం అందించాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా, భద్రతా బలగాలు ప్రతిదాడిని ప్రారంభించాయి. సుమారు ఐదు గంటలపాటు కాల్పులు కొనసాగగా.. నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పౌరులు గాయపడ్డారు’ అని అధికారి ఒకరు తెలిపారు. ‘ఇస్లామిక్ స్టేట్ జమ్ము కశ్మీర్ (ఐఎస్‌జేకే) సంస్థ చీఫ్‌తోపాటు ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఎన్కౌంటర్ విషయాన్ని డీజీపీ శేష్‌పౌల్ వైద్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాళ్లు విసిరారు... అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ సందర్భంగా భద్రతాదళాలపై అల్లరిమూక రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ‘ఎన్కౌంటర్ ఘటనాస్థలానికి చేరుకున్న కొంత మంది యువకులు.. బలగాలపై రాళ్లు రువ్వి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వారిని అదుపులోకి తెచ్చే క్రమంలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి’ అని డీజీపీ మీడియాకు వెల్లడించారు. -
నాగా తిరుగుబాటుదారులపై పంజా
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంత తిరుగుబాటు సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–కప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్‌లోని మయన్మార్ సరిహద్దులో బుధవారం వేకువ జామున భారత బలగాలు జరిపిన ప్రతీకార దాడుల్లో ఎన్ఎస్సీఎన్–కే భారీగా నష్టపోయినట్లు తూర్పు కమాండ్ ప్రకటించింది. భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లను హతమార్చామని, తమకెలాంటి నష్టం వాటిల్లలేదని ఎన్ఎస్సీఎన్–కే పేర్కొంది. ‘భారత్–మయన్మార్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులపై ఎన్ఎస్సీఎన్–కే తిరుగుబాటుదారులు ఉదయం 4.45 గంటలకు కాల్పులు జరిపారు. బదులుగా భారత బలగాలు పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. తిరుగుబాటుదారులు భారీగా నష్టపోయారు. భారత బలగాలు వైపు ఎలాంటి నష్టం జరగలేదు’ అని తూర్పు కమాండ్ ప్రకటించింది. చనిపోయిన లేదా గాయపడిన తిరుగుబాటుదారులెందరో వెల్లడించలేదు. భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దును దాటలేదని పేర్కొంది. భారత్ వైపు కూడా ప్రాణ నష్టం జరిగినట్లు వెలువడిన వార్తలు వాస్తవం కాదని ట్వీట్ చేసింది. ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా...‘మయన్మార్ భారత్‌కు మిత్ర దేశం అనడంలో మరో అభిప్రాయానికి తావు లేదు. మాకు అందిన సమాచారాన్నే మీకు తెలియజేస్తాం’ అని బదులిచ్చారు. ముగ్గురు జవాన్లు హతం: ఎన్ఎస్సీఎన్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎన్ఎస్సీఎన్ పీఆర్వో ఇసాక్ సుమి ఈ దాడి గురించి సమాచారాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. భారత్–మయన్మార్ సరిహద్దుకు 10–15 కి.మీ దూరంలోని మయన్మార్ ఆక్రమిత నాగా ప్రాంతంలోని లాంగ్‌కు గ్రామంలో ఎదురుకాల్పులు జరిగినట్లు వెల్లడించాడు. ‘తమ శిబిరాల వైపు వస్తున్న భారత ఆర్మీని గుర్తించిన నాగా తిరుగుబాటుదారులు తెల్లవారు జామున 3 గంటలకు కాల్పులకు దిగారు. నేను ఈ పోస్ట్ చేసే సమయంలోనూ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి’ అని పోస్ట్ చేశాడు. ఈ దాడుల్లో ముగ్గురు భారత జవాన్లు మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు వెల్లడించాడు. తమ వర్గంవైపు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపాడు. ఇసాక్ ప్రస్తుతం మయన్మార్‌లోని యాంగాన్‌లో ఉన్నట్లు అతని పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఇసాక్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత ఆర్మీ...ఈ దాడులు సర్జికల్ స్ట్రైక్స్ కావంది. మణిపూర్‌లో 20 మంది సైనికుల హత్యకు ప్రతీకారంగా 2015, జూన్‌లో కూడా ఆర్మీ ఇలాంటి ఆపరేషనే చేపట్టి వారికి తీవ్ర నష్టం మిగిల్చింది. -
వీటో దేశాలకు భారత్ సమాచారం
-
దాడులపై వీటో దేశాలకు భారత్ సమాచారం
ఢిల్లీ: ఆర్మీదాడులపై ఐక్యరాజ్యసమితిలోని వీటో దేశాలకు భారత్ సమాచారం అందించింది. పీఓకే( పాక్ ఆక్రమిత కశ్మీర్)లో ఆర్మీదాడులపై వీటో దేశాలకు భారత్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. 22 దేశాలకు చెందిన రాయబారులకు దాడులకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో భారత్‌కు మద్దతుగా బంగ్లాదేశ్ నిలిచింది. దాడులపై భారత్‌తో అమెరికా ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచ బ్యాంకు కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. చైనా మాత్రం భారత్, పాకిస్తాన్‌లు ఈ దాడులపై చర్చలు జరపాలని సూచిస్తోంది.