శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదలు ఏరివేత కార్యక్రమం మొదలైంది. రంజాన్ తర్వాత కాల్పుల విరమణ ముగిసినట్లు కేంద్రం ప్రకటించటం, ఆ తర్వాత కశ్మీర్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు విదితమే. తదనంతరం భారీ సంఖ్యలో భద్రతా బలగాలు కశ్మీర్‌లో పాగా వేశాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.
‘శ్రీగుఫరా ప్రాంతంలోని ఖీరమ్ వద్ద ఉగ్రవాదులు దాక్కున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సైన్యానికి సమాచారం అందించాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా, భద్రతా బలగాలు ప్రతిదాడిని ప్రారంభించాయి. సుమారు ఐదు గంటలపాటు కాల్పులు కొనసాగగా.. నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పౌరులు గాయపడ్డారు’ అని అధికారి ఒకరు తెలిపారు. ‘ఇస్లామిక్ స్టేట్ జమ్ము కశ్మీర్ (ఐఎస్‌జేకే) సంస్థ చీఫ్‌తోపాటు ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఎన్‌కౌంటర్ విషయాన్ని డీజీపీ శేష్‌పౌల్ వైద్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
రాళ్లు విసిరారు... అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ సందర్భంగా భద్రతాదళాలపై అల్లరిమూక రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ‘ఎన్‌కౌంటర్ ఘటనాస్థలానికి చేరుకున్న కొంత మంది యువకులు.. బలగాలపై రాళ్లు రువ్వి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వారిని అదుపులోకి తెచ్చే క్రమంలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి’ అని డీజీపీ మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment