ananthnag
-
jammu: అనంత్‌నాగ్ నుంచి బరిలో గులాంనబీ
జమ్మూ: మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్(డీపీఏపీ) మంగళవారం(ఏప్రిల్ 2) ఒక ప్రకటనలో తెలిపింది. డీపీఏపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆజాద్ పోటీపై నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఎక్స్(ట్విటర్)లో ప్రకటించారు. ఇదే నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పొత్తులో భాగంగా ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్ ఉదంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి జితేంద్రసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి 2022లో డీపీఏపీ పార్టీని స్థాపించారు. ఇదీ చదవండి.. బారామతిలో వదిన మరదళ్ల సమరం -
పాలిథీన్ చెత్తతో రండి.. గోల్డ్ కాయిన్‌తో వెళ్లండి
అనంతనాగ్(జమ్ము కశ్మీర్): ఈ భూమ్మీద పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. మనసు పెడితే.. చెత్త కూడా బంగారమే అవుతుంది!. నమ్మరా?.. అయితే.. ఆ సర్పంచ్ వైవిధ్యభరితమైన ఆలోచన, దాని వెనుక ఉన్న బలమైన కారణం.. ఏడాది కాలంలో ఆ ప్రయత్నంతో తన ఊరిలో తెచ్చిన మార్పు గురించి తెలుసుకోవాల్సిందే!. ఫరూఖ్ అహ్మద్ ఘనై.. పాలిథీన్ చెత్తతో వచ్చి గోల్డ్ కాయిన్‌తో వెళ్లమంటున్నాడు. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని కొండల మధ్య ఉండే సాదివారా అనే ఓ గ్రామానికి ఆయన సర్పంచ్. పైగా లాయర్ కూడా. పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. ఒక తీవ్రమైన సమస్యగా అర్థం చేసుకున్నాడాయన. శుభ్రత మీద ఇప్పుడు దృష్టిసారించకపోతే.. రాబోయే పదేళ్లలో సారవంతమైన భూమి, స్వచ్ఛమైన నీటి వనరులను కనుగొనలేరంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారాయన. ఇంట్లో పేరుకుపోయిన పాలిథీన్ చెత్తను బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో, నీళ్లలో పడేస్తున్నారు గ్రామస్తులు. అది నేలలో కలిసిపోవడం జరగని పని. అందుకే శుభ్రత కోసం అధికారులు, ప్రభుత్వం శ్రమించే కంటే.. ప్రజలే దృష్టిసారించడం మేలని భావించాడాయన. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడం కంటే.. వాళ్లకు ఆశ కల్పిస్తే ఎలా ఉంటుందని భావించాడు. అందుకే పాలిథీన్ చెత్తతో రండి.. బంగారు కాయిన్‌తో వెళ్లండి అనే పిలుపు ఇచ్చాడు. ఎవరైతే 20 క్వింటాళ్లకు తగ్గకుండా, అంతకు మించి పాలిథీన్ చెత్త తీసుకొస్తారో.. వాళ్లకు ఓ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాడు. అలాగే.. అంతకంటే కాస్త తక్కువ చెత్త వచ్చినవాళ్లకు సిల్వర్ కాయిన్ బహుకరిస్తున్నాడు. అంత చెత్త తెచ్చి ఎవరు ఇస్తాడని అనుకోకండి!. ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. ఏడాదిలోనే ఎంతో మార్పు తెచ్చిందని సంబురపడిపోతున్నాడాయన. అంతేకాదు.. ఈ ఆలోచన జిల్లా అధికారులను సైతం కదిలించింది. అన్ని పంచాయితీల్లోనూ ఈ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా అభివృద్ధి అధికార యంత్రాంగం నిర్ణయించుకుంది. -
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకి ఆ గ్రామానికి ‘కరెంట్’ కనెక్షన్
శ్రీనగర్: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్నా ఇంకా చాలా గ్రామాలు కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మారుమూల ప్రాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే కోవకు చెందుతుంది జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా డూరు బ్లాక్ పరిధిలోని టెథాన్ గ్రామం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంలో భాగంగా ఆ ఊరికి విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేశారు అధికారులు. అనంతనాగ్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి 75 ఏళ్ల తర్వాత కరెంట్ సరఫరా జరుగుతోంది. అనంతనాగ్ కొండ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామం టెథాన్‌లో సుమారు 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం డెవలప్మెంట్ ప్యాకేజీ స్కీమ్‌లో విద్యుత్తు సరఫరాను అందించారు అధికారులు. గ్రామంలో 75 ఏళ్ల తర్వాత తొలి విద్యుత్తు దీపం వెలిగింది. తమ ఇళ్లల్లో విద్యుత్తు కాంతులు చూసి అక్కడి ప్రజలు మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు తమ అవసరాల కోసం సాంప్రదాయ కలప, దీపాలను వాడేవారు. ‘ఈరోజు తొలిసారి విద్యుత్తు కాంతులను చూస్తున్నాం. ఇకపై మా పిల్లలు విద్యుత్తు దీపాల కింద చదువుకుంటారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. కరెంట్ లేకపోవడంతో చాలా కష్టాలు పడ్డాము. ఇప్పటి వరకు మా అవసరాల కోసం సంప్రదాయ కలపను ఉపయోగించాం. ఇప్పుడు మా సమస్యలకు ఓ పరిష్కారం లభించింది. ప్రభుత్వానికి, విద్యుత్తు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.’ అని ఫాజుల్ ఉదిన్ ఖాన్ అనే గ్రామస్థుడు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యుత్తు కాంతులను చూసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు. ఇదీ చదవండి: ‘కశ్మీర్లో భాగం కావడమే మంచిది’.. విలీనానికే లద్దాఖ్ నేతల మొగ్గు! -
గ్రెనేడ్ దాడిలో సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మృతి
శ్రీనగర్ : కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సీఆర్పీఎప్ పెట్రోలింగ్ వాహనమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనైడ్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలోని బిజేహరాలో చోటుచేసుకుంది. కాగా గ్రనైడ్ దాడిలో ఇద్దరు గాయపడగా వారిలో హెడ్ కానిస్టేబుల్ శివలాల్ నీతమ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా మరొకరి పరిస్థితి బాగానే ఉందన్నారు. మంగళవారం సాయంత్రం బిజ్బెహరా ఏరియాలో సీఆర్పీఎఫ్ వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. -
అక్కడ ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభం
శ్రీనగర్ : భద్రతా కారణాల రీత్యా శుక్రవారం శ్రీనగర్, అనంత్‌నాగ్‌లలో ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపివేసిన అధికారులు శనివారం తిరిగి పునరుద్దరించారు. నలుగురు ఉగ్రవాదులు అనంతనాగ్‌లోకి చొరబడడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అనంత్‌నాగ్, శ్రీనగర్‌లలో శుక్రవారం ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా భద్రతా దళాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో తీవ్రవాదులు, సైన్యం మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి నెట్ సర్వీసుల్ని తిరిగి ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. కాగా, కశ్మీర్లో రంజాన్ ముగిసిన తర్వాత జరిగిన భారీ ఎన్కౌంటర్ ఇదే. ఈద్ సందర్భంగా నెల రోజులు పాటు సంయమనంతో ఉన్న సైన్యం ఉగ్రవాదలు వేటను తిరిగి ప్రారంభించింది. ఇది కూడా చదవండి : వేట షురూ.. భారీ ఎన్కౌంటర్ -
వేట షురూ.. భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదలు ఏరివేత కార్యక్రమం మొదలైంది. రంజాన్ తర్వాత కాల్పుల విరమణ ముగిసినట్లు కేంద్రం ప్రకటించటం, ఆ తర్వాత కశ్మీర్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు విదితమే. తదనంతరం భారీ సంఖ్యలో భద్రతా బలగాలు కశ్మీర్లో పాగా వేశాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ‘శ్రీగుఫరా ప్రాంతంలోని ఖీరమ్ వద్ద ఉగ్రవాదులు దాక్కున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు సైన్యానికి సమాచారం అందించాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా, భద్రతా బలగాలు ప్రతిదాడిని ప్రారంభించాయి. సుమారు ఐదు గంటలపాటు కాల్పులు కొనసాగగా.. నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పౌరులు గాయపడ్డారు’ అని అధికారి ఒకరు తెలిపారు. ‘ఇస్లామిక్ స్టేట్ జమ్ము కశ్మీర్ (ఐఎస్‌జేకే) సంస్థ చీఫ్‌తోపాటు ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఎన్కౌంటర్ విషయాన్ని డీజీపీ శేష్‌పౌల్ వైద్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాళ్లు విసిరారు... అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ సందర్భంగా భద్రతాదళాలపై అల్లరిమూక రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ‘ఎన్కౌంటర్ ఘటనాస్థలానికి చేరుకున్న కొంత మంది యువకులు.. బలగాలపై రాళ్లు రువ్వి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వారిని అదుపులోకి తెచ్చే క్రమంలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి’ అని డీజీపీ మీడియాకు వెల్లడించారు. -
అనంతనాగ్‌లో ఎన్కౌంటర్.. మహిళ మృతి
అనంతనాగ్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. అనంతనాగ్ జిల్లాలోని కొన్ని నివాసాల్లో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడంతో శనివారం ఉదయం పోలీసులు, బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించగా ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే కాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఓ ఇంట్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని, అందులోని కుటుంబ సభ్యులను వారు బందించారని చెబుతున్నారు. కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. కొంతమంది మాత్రం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ టాప్ లీడర్ అందులో ఉన్నట్లు చెబుతున్నారు. -
కశ్మీర్లో ఉగ్రవాది హతం, ఏకే 47 స్వాధీనం
శ్రీనగర్: మరోసారి జమ్మూకశ్మీర్‌లో తుపాకులు చప్పుళ్లు చేశాయి. మంగళవారం వేకువ జామున ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ చేసుకొని ఒక ఉగ్రవాది మృతిచెందాడు. అతడి వద్ద నుంచి బలగాలు ఏకే 47 తుపాకీని, ఇతర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం బలగాలను మరింత అప్రమత్తం చేసింది. ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.