నో–ఫ్లయ్ జోన్
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి, ఆ ప్రజలపైనే దాడులకు తెగబడుతున్న మయన్మార్ నియంత పాలకుల మారణహోమం మొత్తానికి భూతలం నుంచి గగనతలానికి చేరుకుంది! కుట్రకు వ్యతిరేకంగా వీధులలోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరుపుతున్న పౌరులపై సొంత సైన్యమే జరిపిన కాల్పులలో ఫిబ్రవరి 1 నుంచి (ప్రభుత్వాన్ని సైన్యం హస్తగతం చేసుకున్న రోజు) ఇంతవరకు వెయ్యిమందికి పైగా మరణించారు. వీరు కాక, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలపై సైనిక విమానాలు నిన్న, మొన్న జరిపిన బాంబు దాడుల వల్ల మరణించినవారిలో వంద మందికి పైగా పౌరులు, చిన్నారులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం నాడు ఐక్యరాజ్య సమితిలో మయన్మార్ రాయబారి క్యాఉమో తున్ మయన్మార్‌ను నిర్వైమానిక మండలం (నో–ఫ్లయ్ జోన్) గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మయన్మార్ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటిస్తే వెంటనే అక్కడ విమానాలు ఎగరడం ఆగిపోవాలి. లేకుంటే అది అంతర్జాతీయ ఆదేశాలకు విరుద్ధం అవుతుంది. అసలు నో–ఫ్లయ్ జోన్‌ను ఏయే పరిస్థితుల్లో ప్రకటిస్తారు? నో–ఫ్లయ్ జోన్ విధింపును ఉల్లంఘిస్తూ ఒక విమానం గాల్లోకి లేస్తే ఆ విమానాన్ని కూల్చివేయవచ్చా? ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వం మిలటరీ చేతుల్లో ఉంది. మిలటరీనే పౌరులపై వైమానిక దాడులకు పాల్పడుతోంది కనుక వారి విమానాలను ఎవరు నేలకు ‘దించుతారు’? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ కింది ఏడు నో–ఫ్లయ్ జోన్స్‌లో దొరుకుతాయి. ఇంకొక విషయం. కేవలం యుద్ధ వాతావరణంలో మాత్రమే నో–ఫ్లయ్ జోన్స్‌ని ప్రకటిస్తారనేం లేదు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కూడా ప్రత్యేక ప్రాంతాలలో విమానాలను ఎగరనివ్వరు.
ఉత్తర కొరియా
ఈ దేశం ఎప్పుడు, ఎక్కడ, ఏ మిస్సయిల్‌ను పరీక్షించి చూసుకుంటుందో ఎవరికీ తెలియదు. చిన్న హెచ్చరికైనా జారీ చేయకుండా తరచు జపాన్ సముద్రం మీదుగా ఉత్తర కొరియా తన క్షిపణుల పని తీరును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ ఉంటుంది! అందుకే ప్రపంచంలోని అనేక దేశాలకు ఉత్తర కొరియా గగనతలం నో–ఫ్లయింగ్ జోన్. చివరికి ఐక్యరాజ్య సమితికి కూడా.
తాజ్‌మహల్, ఇండియా
భారత ప్రభుత్వం 2006లో తాజ్‌మహల్ గగనతలాన్ని నిర్వైమానిక మండలంగా ప్రకటించింది. తాజ్‌మహల్ పైన విమానాలు ఎగిరేందుకు లేదు. కట్టడాన్ని విమానాల శబ్దం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకల వల్ల జనించే కాలుష్యం నుంచి ఆ పాలరాతి భవనాన్ని సంరక్షించే ప్రయత్నం కూడా అది.
బకింగ్‌హామ్ ప్యాలెస్, లండన్
బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి.
ఉత్తర భాగం, ఉక్రెయన్
2014లో ఇక్కడ జరిగిన ఘోర దుర్ఘటనలో మలేషియా విమానం ఎంహెచ్–17 కూలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులంతా మరణించారు. దాంతో విమానాలు ఎగిరేందుకు యోగ్యం కాని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా దీనిని పరిగణించి, నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నడిచే అన్ని విమానాలూ ఒక దాని గగనతలం మీద ఒకటి (కొన్ని ప్రాంతాల మీదుగా) ఎగిరేందుకు లేదు. సరిహద్దు వివాదాలు అందుకు కారణం.
వాల్ట్ డిస్నీ వరల్డ్, యు.ఎస్.ఎ.
ఈ థీమ్ పార్క్‌కు మూడు మైళ్ల పరిధిలో, 3000 అడుగుల లోపు ఎత్తులో విమానాలు ఎగిరేందుకు లేదు. విమానాల ధ్వనులు అత్యంత సున్నితమైన తమ నిర్మాణాలకు పడవని డిస్నీ అంటుంది! ఆ ధ్వనులు.. ప్రశాంతమైన డిస్నీకి కొత్తగా వచ్చినవాళ్లను భయపెట్టే ప్రమాదం ఉందని కూడా యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటించింది. అయితే ‘ఫ్లయింగ్ అడ్వరై్టజ్‌మెంట్‌లు’ ఇచ్చేందుకు వీల్లేకుండా తమను నివారించడానికే డిస్నీ ఆ ప్లాన్ వేసిందని పోటీదారుల ఆరోపణ.
ఏరియా 51, యు.ఎస్.ఎ.
నెవడా రాష్ట్రంలోని ఎడారి వంటి ఈ ప్రాంతం అమెరికా రక్షణదళం అధీనంలో ఉంది. అమెరికా సైన్యం నిరంతరం ఇక్కడ మిలటరీ టెక్నాలజీకి సంబంధించిన రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. 1950 లు, 60 లలో ‘యు–2 స్పై ప్లేన్’ను ఇక్కడే తయారు చేశారు. యు.ఎస్. రాజధాని వాషింగ్టన్‌పై ఎంత గట్టి నిఘా ఉంటుందో ఈ ‘ఏరియా 51’ చుట్టూ, లోపల మానవ కదలికలపై అంతకుమించిన నిఘా, ఆంక్షలు ఉంటాయి. ఏరియా 51 గగనతలంపై చిన్న పిట్టలాంటి విమానం కూడా ఎగరడానికి లేదు. అది స్వదేశీ విమానమే అయినా.. నేల కూల్చేస్తారు.
తియానన్మెన్ స్క్వేర్, చైనా
చైనా గగనతలంలో ఏ ప్రాంతంలోనైనా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయంటే అది తియానన్మెన్ స్క్వేరే. ఆ స్క్వేర్ మీదుగా విమానాలు వెళ్లకూడదు. ఒకప్పుడు పావురాలు, ద్రోణ్‌లు, బెలూన్‌లు కూడా పైన ఎగరడం నిషిద్ధం. వెంటనే షూట్ చేసి పడగొట్టేసేవారు. ఈ స్క్వేర్‌లోనే అమూల్యమైన పురావస్తుశాలల భవంతులు, చైనా చారిత్రక యోధుల స్మరణ మందిరాలు ఉన్నాయి. వాటికి తాకిడి లేకుండా ఉండేందుకే నో–ఫ్లయ్ జోన్ చేశారు. బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment