కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష? | Dileep Reddy Guest Column On Neso To Protest Across Northeast Today Demanding Withdrawal Of Afspa | Sakshi
Sakshi News home page

కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?

Published Fri, Dec 10 2021 12:16 AM | Last Updated on Fri, Dec 10 2021 12:41 AM

Dileep Reddy Guest Column On Neso To Protest Across Northeast Today Demanding Withdrawal Of Afspa - Sakshi

కిందటి వారాంతంలో సాయుధబలగాలు నాగాలాండ్‌లోని ఓ మారుమూల సరిహద్దులో పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాదమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడిపాక... సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. ‘దేశ పౌరులపై చర్యలకు తలపడేటప్పుడు సాయుధ బల గాలు సంయమనం, కనీస బలప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. సుప్రీం కోర్టు, ఈశాన్య ప్రాంత ప్రజలు, అక్కడి ముఖ్యమంత్రులు సైతం నిరంకుశ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. మరెప్పుడు రద్దు?

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నాయకులు తమ నిరసన శిబిరాన్ని గురువారం ఎత్తివేస్తున్న సమయానికి నాగాలాండ్‌లోని ఓ మారుమూల సరిహద్దులో పరిస్థితి భిన్నంగా ఉంది. మయన్మార్‌తో సరిహద్దు కలిగిన మోన్‌ జిల్లా ఓటింగ్‌ పరిసరాల్లోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో నల్ల జెండాలు దర్శనమిస్తున్నాయి. క్రిస్టమస్‌ కొనుగోళ్లతో సందడిగా ఉండాల్సిన దుకాణాలపైన, దారి పొడుగు స్థంబాలపైన, వాహనాలపైన నల్లజెండాలు ఎగురవేస్తూ స్థానికులు నిరసన చెబుతున్నారు. కిందటి వారాంతంలో సాయుధ బలగాలు పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాధమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. సైనికులతో సహా ఎవరినీ తమ ప్రాంతంలోకి ఓటింగ్‌ గ్రామస్తులు ఇపుడు అను మతించడం లేదు. కేంద్ర గృహమంత్రి అమిత్‌షా పార్లమెంటులో చేసిన ప్రకటనను ‘నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌’ (ఎన్‌ఎస్‌సీఎన్‌) ఖండిస్తూ తీవ్రంగా ద్వజమెత్తింది. రక్షణ బలగాలకు విశృంఖల స్వేచ్చ, అధికారం కల్పిస్తున్న ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం–ఏఎఫ్‌ఎస్పీయే’ ఒక నల్లచట్టమంటూ, వ్యతిరే కంగా ప్రకటన జారీ చేసింది. ఆ చట్టం ఎత్తివేయకుండా, ఏ రాజకీయ ప్రక్రియనూ సాగనివ్వబోమని తేల్చి చెప్పింది. పలు నాగా తిరుగు బాటు సంస్థల్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా నిర్వ హిస్తున్న శాంతి ప్రక్రియపై తాజా పరిణామాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్నది వేచి చూడాల్సిందే! కానీ, ఇదంతా దేశపు ఈశాన్యం లోని ఓ మారుమూలలో జరుగుతున్న చిన్నపాటి ‘కుంపటి రగలడం’ మాత్రమే! దినకూలీతో బతికే సామాన్యుల్ని, కర్కషంగా సాయుధ బలగాలు నలిపేసిన ఓ దుర్ఘటనపై దేశం తగు రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమౌతోంది. అంతర్జాతీయంగా... మానవహక్కుల పరి రక్షణ సూచీలో మనది ఎప్పుడూ నేల చూపే! తాజా ఘటనతో సహా ‘సైనికులది తప్పే’ అని ఏలినవారు ముక్తసరిగా అంగీకరించినా... అటువంటి తప్పులు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్య లేమీ లేవు. బలగాల అకృత్యాలను నిలువరించే కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పడటం లేదని ఈశాన్య రాష్ట్రాల మానవహక్కుల కార్యకర్తలు, పౌర సంఘాల ప్రతినిధులు అంటున్నారు. పదమూడు నెలలకు పైబడి రైతాంగం, ఫలితం రాబట్టుకునే దాకా జరిపినట్టు పోరాటం అన్ని సందర్భాల్లో, అందరివల్లా అవుతుందా? పలు ఈశాన్య రాష్ట్రాల్లో దశా బ్దాలుగా పోరాడినా... ఒక నల్లచట్టాన్ని ప్రభుత్వాలు రద్దు చేయటం లేదనే ఆందోళన ఉంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడి పాక సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది.

మానవ తప్పిదమా, మానని జాడ్యమా?
తప్పు చేసినా తప్పించుకోవచ్చు, శిక్ష ఏమీ ఉండదన్న ధీమాయే సాయుధ బలగాల దుశ్చర్యలకు కారణమని పలుమార్లు రుజువైంది. ఈ చట్టంలోనూ అటువంటి లొసుగులే ఉన్నాయి. చట్టం కల్పించిన అధికారం, చేతిలో ఆయుధం ఇచ్చే బలం ఉన్నాయని అక్కడక్కడ రక్షణ బలగాలు చేసే ఆగడాలను ఉపేక్షించడం తప్పు. ఇలాంటి దుర్ఘటనల వల్ల ప్రభుత్వానికి అపకీర్తి వస్తుందని, పాలకులు సదరు ఆగడాలను వెనుకేసుకొస్తున్నారు. అతకని వాదనల్ని సమర్థిస్తూ మాట్లాడటం, చిన్న తప్పిదంగా కొట్టిపారవేసే వైఖరి మంచిది కాదు. దేశ సరిహద్దుల్లో, కల్లోలిత ప్రాంతాల్లో ఉగ్రమూకల తీవ్రవాదం, హింస, వి«ధ్వంస కార్యకలాపాలను నియంత్రించే క్రమంలో ఇటువం టివి మామూలే! అని బాధ్యత కలిగిన పౌరసమాజం కూడా సాధార ణీకరించడం దుర్మార్గం. ఎవరివైనా ప్రాణాలే! దేశవాసులకు తాము నిరంతర రక్షణ కల్పిస్తున్నామనే ‘త్యాగ భావన’ నీడలో... ఏ సామా న్యుల ప్రాణాలో నిర్హేతుకంగా తీసే హక్కు రక్షణ బలగాలకు ఉంటుందా? ఈ ప్రశ్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు తెగల గిరిజ నులు, ఆదివాసీలు, అల్ప సంఖ్యాకులు, విభిన్న జాతుల వారు తరచూ లేవనెత్తుతున్నారు. జాతుల సమస్య, అస్తిత్వ ఆరాటాలుండే నిత్య పోరాట నేలల్లో సామాన్యుల బతుకు సదా దర్బరమౌతోంది. బలగాల దీష్టీకాలకు అడ్డు–అదుపూ ఉండదు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వీరిపై ఏ విచారణా జరుగదు. సాయుధబలగాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు, యువకుల్ని ఎత్తుకుపోవడం, ఎదురుకాల్పుల పేరిట మట్టుపెట్టడం... మానవ హక్కుల హననానికి ఎన్ని రూపాలో! వీటిని నిరసిస్తూ... హక్కుల కార్యకర్త – ఉక్కు మహిళ, ఇరోమ్‌ షర్మిల పద హారేళ్లు మౌన–నిరాహార దీక్ష చేసి ప్రపంచ దృష్టినాకర్శించినా మన ప్రభుత్వాలు కదల్లేదు, చట్టం రద్దవలేదు, ఫలితం శూన్యం! 2000–12 మధ్య ఒక్క మణిపూర్‌లో సాయుధబలగాలు జరిపిన 1528 ఎన్‌కౌం టర్ల పై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శానికి ఇవాల్టికీ అతీ–గతీ లేదు.

కట్టుకథలదే ‘రాజ్యం’!
గత శని–ఆది వారాల దుర్ఘటనలు పుండైతే, మాన్పే ప్రయత్నం చేయక పోగా కేంద్రం వైఖరి దానిపై కారం రుద్దినట్టుందనే విమర్శ వస్తోంది. మూడు రోజుల తర్వాత నోరిప్పిన ఓటింగ్‌ గ్రామస్తులు చెప్పే విష యాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. కాల్పుల్లో మరణించిన గని కూలీల శవాలను పక్కకు తీసి, వారి చొక్కాలు విప్పి మిలిటెంట్ల గుడ్డలు, బూట్లు తొడిగి, వారి చేతుల్లో ఆయుధాలు పెట్టి... బమటి ప్రపంచానికి చూపే యత్నం చేశారని! తద్వారా తమ దాష్టీకానికి హేతుబద్ధత తెచ్చే ప్రయత్నంలో సాయుధబలగాలు గ్రామస్తులకు దొరికాయి. ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు ప్రతిదాడికి దిగారు. నిరసన చల్లార్చే క్రమంలో మరో ఏడుగురు గ్రామస్తుల్ని బలగాలు పొట్టన పెట్టుకున్నాయి. ట్రాలీ కూలీల్లో బతికిన∙షీవాంగ్‌ చెప్పడమేమిటంటే, సాయుధులు తమ వాహనాన్ని అడ్డుకోలేదు, ఆపమని అడగలేదు, అదుపులోకి తీసుకునే ఏ ప్రయత్నమూ చేయకుండానే నేరుగా కాల్పులు జరిపారని. మయన్మార్‌ సరిహద్దుల్లో మిలిటెంట్లు ఎకే–47 మారణాయుధాలు, మర తుపాకులు, గ్రెనేడ్ల అక్రమ రవాణాకు పాల్ప డుతున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది అనేది ‘21 పారా స్పెషల్‌ ఫోర్స్‌’ బృంద కథనం! సరే, వాదన కోసమైనా, ‘వారు చెప్పేది’ కాసేపు నిజమనుకుందాం, ఈ విషయం స్థానిక పోలీసులకు, అస్సాం రైఫిల్స్‌కి ఎందుకు చెప్పలేదు? దారికాచి వాహనాన్ని అడ్డ గించే ప్రయత్నమో, టైర్లనో, ఇంజన్‌నో కాల్పులతో పనికి రాకుండా చేసి అనుమానితుల్ని నిర్బంధంలోకి తీసుకోవడమో, బలవంతపు లొంగుబాట్లకో ఎందుకు యత్నించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. అసలక్కడ కవ్వింపులే లేవు! వారు జరిపింది ఆత్మరక్షణ కాల్పులు కాదు, అణచివేసే అహంతోనో, అధికారాలున్నాయనే మిడి సిపాటో, ట్రిగ్గర్‌ మోజో... అయి ఉంటుందనేది విశ్లేషణ!

వదలని వలసవాద మూలాలు
ఎన్ని కమిటీలు? ఎన్ని అధ్యయనాలు? ఎన్నెన్ని నివేధికలున్నా.... చట్టంపై పునరాలోచనే లేదు. 1958 సాయుధ బలగాల ప్రత్యేక అధి కారాల చట్టమైనా,1972 కల్లోలిత ప్రాంతాల చట్టమైనా... వీటి మూలాలు బ్రిటిష్‌ వాలసపాలకులు, 1942లో ‘క్విట్‌ ఇండియా’ ఉద్య మాన్ని అణచివేసేందుకు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. సర్వ సత్తాక సార్వభౌమ దేశానికి అవి పొసగేవి కావు. ‘దేశ పౌరులపై చర్య లకు తలపడేప్పుడు సాయుధ బలగాలు సంయమనం, కనీస బల ప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే కమిషన్, జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ కమిషన్‌ కూడా ఈ చట్టం వద్దనే సిఫారసు చేశాయి. ప్రస్తుతం నాగాలాండ్, మెఘాలయ ముఖ్యమం త్రులే కోరుతున్నారు. కేంద్రం 2004లో, జస్టిస్‌ జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సమాచారం సేకరించి 2005లో ఇచ్చిన నివేదికలో ‘సత్వరమే ఈ చట్టాన్ని రద్దు చేయాలి’ అని నివేదించింది. మరెప్పుడు రద్దు?


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement