న్యూఢిల్లీ: ఈశాన్యాన మళ్లీ కమల వికాసమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తాజాగా ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో నాగాలాండ్, త్రిపురల్లో మళ్లీ బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని, మేఘాలయలో హంగ్ తప్పదని జోస్యం చెప్పాయి. అక్కడ అధికార ఎన్‌పీపీ మరోసారి ఏకైక పెద్ద పార్టీగా నిలుస్తుందని చెప్పాయి. త్రిపురలో ఎన్నో ఆశలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కొత్త పార్టీ టిప్రా మోర్చా గట్టి దెబ్బ కొట్టనుంది. అధికార బీజేపీ జైత్రయాత్రకూ అది కాస్త అడ్డుకట్ట వేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయల్లో సోమవారం పోలింగ్ పూర్తయింది.
మేఘాలయ
రాష్ట్రంలో ఈసారి హంగ్ తప్పకపోవచ్చని అన్ని ఎగ్జిట్ పోల్సూ చెప్పడం విశేషం! అధికార ఎన్‌పీపీకి 18 నుంచి 26 సీట్లకు మించకపోవచ్చని అవి పేర్కొన్నాయి. ఇక బీజేపీకి దక్కుతున్నది 4 నుంచి గరిష్టంగా 11 స్థానాలే. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి కాగా తృణమూల్‌కు మాత్రం ఎగ్జిట్ పోల్స్ 5 నుంచి 13 స్థానాల దాకా ఇచ్చాయి. యూడీపీకి ఇండియాటుడే, టైమ్స్ నౌ రెండూ 8 నుంచి 14 సీట్లిచ్చాయి.
నాగాలాండ్
రాష్ట్రంలో ఎన్‌డీపీపీ–బీజేపీ కూటమి అధికారాన్ని నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఎన్‌డీపీపీకి 28–34 సీట్లు, బీజేపీకి 10 నుంచి 14 వస్తాయని ఇండియాటుడే అంచనా వేసింది. ఎన్‌పీఎఫ్‌కు 3 నుంచి 8 సీట్లు వస్తుండగా కాంగ్రెస్ 2 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. టైమ్స్ నౌ కూడా ఎన్‌డీపీపీకి 27–33 సీట్లు, బీజేపీకి 12–16 ఇవ్వగా ఎన్‌పీఎఫ్‌కు 6 సీట్లతో సరిపెట్టింది.
త్రిపుర
పాతికేళ్ల సీపీఎం కూటమి జైత్రయాత్రకు అడ్డుకట్ట వేస్తూ 2018లో బీజేపీ ఏకంగా 36 సీట్లతో మెజారిటీ సాధించి ఆశ్చర్యపరిచింది. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా అడ్డుకునేందుకు సీపీఎం కూటమి తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. కానీ వాటి అవకాశాలకు కొత్తగా వచ్చిన టిప్రా మోతా భారీగా గండి కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మోతా 9 నుంచి 16 సీట్లు దాకా గెలుచుకుంటుందని అంచనా వేశాయి.
బీజేపీ మళ్లీ మెజారిటీ సాధిస్తుందని ఇండియాటుడే, జీ న్యూస్ అభిప్రాయపడగా 24 సీట్లకు పరిమితం కావచ్చని టైమ్స్ నౌ పేర్కొంది. కాంగ్రెస్–సీపీఎం కూటమికి ఏ ఎగ్జిట్ పోల్‌లోనూ గరిష్టంగా 21 సీట్లు దాటలేదు. బీజేపీకి 45 శాతం ఓట్లు రావచ్చని ఇండియాటుడే అంచనా వేసింది. లెఫ్ట్–కాంగ్రెస్ కూటమికి 32 శాతం, టిప్రా మోతాకు 20 శాతం వస్తాయని పేర్కొంది. హంగ్ నెలకొనే పక్షంలో ప్రత్యేక టిప్రా లాండ్ డిమాండ్‌కు జైకొట్టే పార్టీకే మద్దతిస్తామని టిప్రా మోతా అధ్యక్షుడు ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేవ్ బర్మ ఇప్పటికే ప్రకటించారు.
నాగాలాండ్‌లో 83%, మేఘాలయలో 75% ఓటింగ్
షిల్లాంగ్/కోహిమా: నాగాలాండ్‌లో ఓటర్లు పోటెత్తారు. దాంతో సోమవారం జరిగిన పోలింగ్‌లో మధ్యాహ్నం మూడింటికే 83.63% ఓటింగ్ నమోదైంది! ఇక మేఘాలయలో సాయంత్రం ఐదింటికల్లా 75% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలు ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. రెండు అసెంబ్లీల్లోనూ 60 స్థానాలకు గాను 59 సీట్లకు పోలింగ్ జరిగింది. కొన్ని బూత్‌ల్లో ఈవీఎంలతో సమస్య తలెత్తినా అధికారులు వెంటనే పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment