ఉగ్రవాదానికి ఊతమిస్తోంది ఎవరు? సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది ఎవరు? కశ్మీర్ లోయని కల్లోలం చేస్తోంది? అక్కడి ప్రజలను తీవ్రవాదానికి ఆకర్షించేది? నిరంతరం ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది? ఎవరన్న ప్రశ్నలకు మన దగ్గర పసిపిల్లాడుకూడా సమాధానం చెబుతాడు. ఐక్యరాజ్య సమితిముందు భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని నిందలేసిన పాకిస్తాన్‌కు.. కేంద్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలే సమాధానం చెబుతాయి.
న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం పారించిన నెత్తుటేరులకు సాక్ష్యం గడచిన 27 సంవత్సరాలు . 1990 నుంచి 2017 వరకూ పాకిస్తాన్ లోయలో తీవ్రవాదులను అడ్డుపెట్టుకుని అరాచకాలే చేసింది. తీవ్రవాదుల దాడిలో ఈ 27 ఏళ్లలో 41 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే సగటున రోజుకు నలుగురు చొప్పున మృతి చెందారు. ఇక ప్రతి ఏడాది 1519 మంది గాయాల పాలయ్యారు. లోయలో పరిస్థితిపై ప్రభుత్వం సోమవారం గణాంకాలను విడుదల చేసింది.
వేలలో క్షతగాత్రులు
1990 నుంచి ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో 14 వేల మంది పౌరులు, 5 వేల మంది భద్రతా సిబ్బంది, 22 వేల మంది టెర్రరిస్టులు గాయాల పాలయ్యారు. మొత్తంగా తీవ్రవాద కార్యకలాపాల వల్ల 69వేల 820 మంది గాయాల పాలయ్యారు. సగటున ప్రతిఏడాది 2 వేల 500 తీవ్రవాద ఘటనలు లోయలో జరుగుతున్నాయి. లోయలో జరిగే తీవ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఊతమిస్తోందని.. ప్రతి రోజూ మిలిటెంట్లు కంచెను దాటి భారత్‌లోకి చొరబడేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే.
2014 తరువాత.. మరింతగా!
1990 నుంచి 2000 వరకూ మిలిటెంట్ కార్యక్రమాలు ఒకలా ఉన్నా.. తరువాత పూర్తిగా రూపు మార్చుకున్నాయి. ఇక 2014 నుంచి లోయలో మిలిటెంట్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. 2014నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 795 దాడులు జరిగాయి. ఈ ఘటనలో 397 మంది తీవ్రవాదులు హతమయ్యారు. అలాగే 64 మంది సాధారణ పౌరులు, 178 మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక 2014లో 222 తీవ్రవాద దాడులు లోయలో జరగ్గా.. 2016లో ఈ సంఖ్య 322కు పెరిగింది. తీవ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
2001లో అత్యధికం
ఈ 27 ఏళ్లలో 2001 సంవత్సరంమాత్రం లోయలో రక్తం పారించింది. ఈ ఒక్క ఏడాదే.. భద్రతా బలగాలు 2020 మంది మిలిటెంట్లను హతమార్చాయి. 536 మంది సైనికులు, 996 మంది పౌరులు చనిపోయారు. కశ్మీర్‌లో ఈ ఒక్క ఏడాదే 4,522 తీవ్రవాద ఘటనలు జరిగాయి.
మిలిటెంట్ల ఏరివేత
- 1990 నుంచి 97 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇతర సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో 6,522 మంది తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
- 1999-2003 వరకూ అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 7,820 మంది తీవ్రవాదులను భద్రతాబలగాలు ఏరిపారేశాయి. సైన్యం, భద్రతా బలగాలు అత్యంత ధైర్యంతోనూ, సాహసంతోనూ పనిచేసిన కాలంగా చెప్పుకుంటాయి.
- 2004 నుంచి 2014 మధ్య కాలంలో తీవ్రవాద ఘటనలు పెద్దగా చోటు చేసుకోలేదు. కేవలం 2013లో 170 తీవ్రవాద ఘటనలు జరగ్గా.. 67 మంది మిలిటెంట్లు హతమయ్యారు.