milk rate
-
విజయ పాలు ప్రియం!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు డెయిరీలతో పోటీపడుతూ విజయ డెయిరీ కూడా పాల ధరలను పెంచనుంది! సోమవారం జరిగే బోర్డు సమావేశంలో పాల ధరతోపాటు పాల సేకరణ ధరను కూడా పెంచే అవకాశాలున్నాయి. ఈ మేరకు బోర్డు ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని, బోర్డు సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బోర్డు భేటీకి హాజరుకావాలని జిల్లాకో రైతు చొప్పున ఆహ్వానం కూడా పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాడి రైతుకు లీటర్‌కు రూ. 4 ప్రోత్సాహకం కింద ఇవ్వాల్సిన బకాయిల గురించి కూడా చర్చించనున్నారు. పాడి రైతుకు లీటర్ సేకరణ ధరను కనీసం రూ. 60 చేయాలని పాడి రైతుల సంఘం కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను శనివారం కలిసిన సంఘం నేతలు పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కానీ ప్రస్తుతం వెన్న శాతం ఆధారంగా ఇస్తున్న ధరకు రూ. 2–3 వరకు సేకరణ ధర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లీటర్ పాల ధర కూడా పెరగనుంది. (నోట్: 5 శాతం తర్వాత ప్రతి పాయింట్‌కు సేకరణ ధర మారుతుంది. ఈ ధరతోపాటు ప్రోత్సాహకం కింద ప్రతి లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అయితే రాష్ట్రంలో వెన్న శాతం గరిష్టంగా 8కన్నా మించదని పాడి రైతులు చెబుతున్నారు.) చదవండి: బీజేపీకి ఓటేస్తే.. మోటార్లకు మీటర్లే -
అంగన్వాడీ కేంద్రాల్లో పాల సరఫరా సమస్య పరిష్కారం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాల రేటుపై ఏర్పడ్డ సమస్య పరిష్కారమైంది. పాలను సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నెల 21 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లీటరు పాలకు చెల్లిస్తున్న రూ.42లను రూ.47.25లకు, గిరిజన ప్రాంతాల్లో రూ.53లకు ధరను పెంచింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 51 వేల అంగన్వాడీ కేంద్రాల్లో పసిపిల్లలు, బాలింతలు, గర్భిణులకు రోజుకు రెండు లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతాయి. పెరిగిన రవాణా ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలించి రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ, పశు సంవర్థక శాఖలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఫెడరేషన్తో సంప్రదింపులు జరిపి రేట్లు పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. బకాయిలను చెల్లించని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకమైన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కింద రాష్ట్రంలో అంగన్వాడీల నిర్వహణ జరుగుతోంది. ఇందుకయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం భరిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు రోజువారీ అవసరమైన పాలను సరఫరా చేసే సమర్థత విజయ డెయిరీకి లేకపోవడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాలను సరఫరా చేస్తోంది. దాదాపు రూ.77 కోట్ల విలువైన పాలను సరఫరా చేసినా గత టీడీపీ ప్రభుత్వం ఫెడరేషన్‌కు బిల్లులు చెల్లించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాల ధరలను పెంచాలని, పాత బకాయిలు చెల్లించాలని ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి బకాయిల్లో రూ.40 కోట్ల వరకు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని తెలిపింది. కాగా, ఒకటి రెండు రోజుల్లో పాల ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని ఐసీడీఎస్ కమిషనర్ కృతికా శుక్లా తెలిపారు. -
పాడి రైతుల పొట్టకొడితే ఊరుకోం
–హె రిటేజ్ నిర్వాహకులపై మండిపాటు – లీటర్‌కు రూ. 35 ఇవ్వాలని డిమాండ్ చిత్తూరు(రూరల్) : పాల ధరను హెరిటేజ్ డెయిరీ నిర్వాహకులు దారుణంగా తగ్గించారని, ఇలా చేస్తే తాము ఊరుకునేది లేదని ఆ డెయిరీకి సంబంధించిన పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము హెరిటేజ్ డెయిరీకి పాలు పోస్తున్నామని తెలిపారు. ఆ డెయిరీ నిర్వాహకులు కొన్ని నెలలుగా పాలు లీటర్‌పై రూపాయి..అర్ధరూపాయి తగ్గించి ఇస్తూ వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం లీటర్‌కు రూ. 21 మాత్రమే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డెయిరీనే ఈ విధంగా చేస్తే మిగతా డెయిరీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా డెయిరీ నిర్వాహకులు స్పందించాలని, పాలు లీటర్‌కు రూ. 35 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతులు నాగేశ్వర్‌రెడ్డి, హరిబాబు, బాబునాయుడు, భాస్కరనాయుడు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.