
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాల రేటుపై ఏర్పడ్డ సమస్య పరిష్కారమైంది. పాలను సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నెల 21 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లీటరు పాలకు చెల్లిస్తున్న రూ.42లను రూ.47.25లకు, గిరిజన ప్రాంతాల్లో రూ.53లకు ధరను పెంచింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 51 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో పసిపిల్లలు, బాలింతలు, గర్భిణులకు రోజుకు రెండు లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతాయి. పెరిగిన రవాణా ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని పరిశీలించి రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ, పశు సంవర్థక శాఖలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఫెడరేషన్‌తో సంప్రదింపులు జరిపి రేట్లు పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది.
బకాయిలను చెల్లించని గత ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ పథకమైన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కింద రాష్ట్రంలో అంగన్‌వాడీల నిర్వహణ జరుగుతోంది. ఇందుకయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం భరిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు రోజువారీ అవసరమైన పాలను సరఫరా చేసే సమర్థత విజయ డెయిరీకి లేకపోవడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాలను సరఫరా చేస్తోంది. దాదాపు రూ.77 కోట్ల విలువైన పాలను సరఫరా చేసినా గత టీడీపీ ప్రభుత్వం ఫెడరేషన్‌కు బిల్లులు చెల్లించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాల ధరలను పెంచాలని, పాత బకాయిలు చెల్లించాలని ఫెడరేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి బకాయిల్లో రూ.40 కోట్ల వరకు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని తెలిపింది. కాగా, ఒకటి రెండు రోజుల్లో పాల ధరల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని ఐసీడీఎస్ కమిషనర్ కృతికా శుక్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment