mim akbaruddin owaisi
-
ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు
సాక్షి, కర్నూలు: దేశ స్వాతంత్య్రం కోసం మొదటి రక్తబిందువు చిందించింది ముస్లింలేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ ప్రభుత్వం పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ చేయడం మరో డిసెంబరు 6ను తలపింపజేసిందన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి కర్నూలులోని ఉస్మానియా కళాశాల మైదానంలో ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘షరియత్’ (మహమ్మద్ ప్రవక్త సూచించిన అంశాల)ను తుడిచి వేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. షరియత్‌ను కాపాడుకునేందుకు ముస్లింలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఏర్పడిందని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు న్యాయం చేస్తామనే సాకుతో ఇస్లాంలోని ధార్మిక అంశాలను తుడిచిపెట్టాలనుకున్నారని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్‌పై బిల్లు తీసుకురావడం వల్ల నష్టపోయేది మహిళలేననేది మోదీ గుర్తించలేకపోయారని, మహిళలపై అంతగా సానుభూతి ఉంటే ట్రిపుల్ తలాక్‌కు గురైన వారికి రూ.15 వేల చొప్పున సాయం అందించాలని హితవు పలికారు. షరియత్ గురించి నోరు విప్పే వారిని సైతం ఈ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. అసలు ఇస్లాం ధార్మిక విషయాలపై ఈ ప్రభుత్వానికి గురి ఎందుకని ప్రశ్నించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే మోదీకి.. ఆస్తిలో కూతురికి హక్కు కల్పించేది ఇస్లాం ధర్మమేననేది తెలియదన్నారు. వచ్చే నెల 9,10,11 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ఏఐఎంపీఎల్బీ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ జామియా దరుల్ ఉలూంకు చెందిన మౌలానా రహీముద్దీన్, మజ్లిస్ ఉలమె దక్కన్ మౌలానా కుబూల్ పాషా షితరి సాహెబ్, జమాతె ఇస్లామి మౌలానా హామిద్ మహమ్మద్ ఖాన్, జమియత్ అహ్లె హదీస్ మౌలానా షఫి అహ్మద్ మదాని, జమియత్ ఉలమె హింద్ ముఫ్తి గియాజుద్దిన్ రహ్మాని, అమారతె షరియా మౌలానా జఫర్ పాషా, వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బి.ఎ.కె. పర్వేజ్, ఎస్డీపీఐ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ ప్రసంగించారు. ఆల్ఇండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు జిల్లా అధ్యక్షుడు జాకిర్‌అహ్మద్ రషాది, సభ్యులు అబ్దుల్‌మాజిద్, అబ్దుస్సలాం, అబ్దుల్ఖదీర్, ఉమర్నాజిమ్, సులేమాన్నద్వి, ముఫ్తి అబ్దుర్రహ్మాన్, మౌలానా షావలీవుల్లా, ప్రభుత్వ ఖాజీ సలీంబాష ఖాద్రి, అహ్లెహదీస్ తరపున హాఫిజ్ మంజూర్ అహ్మద్, అహ్లె సున్నత్‌జమాత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఇస్మాయిల్‌పీర్ ఖాద్రి, సయ్యద్‌షా షఫిపాషా ఖాద్రితో పాటు జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు ఎస్.ఎ.అమీర్, గోదాముల అధినేత తాటిపాడు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ టీఆర్ఎస్, మజ్లిస్ ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్‌ను నేను, మా పార్టీ కేవలం సీఎంగా చూడం. ఆయనకు ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది. తెలంగాణను సాధించడం మామూలు విషయం కాదు. మేం కూడా తెలంగాణ ఏర్పాటులో పాలుపంచుకున్నామని కొందరు అంటారు. కేసీఆర్ శక్తి సామర్థ్యాలు, ప్యూహం కారణంగా మేం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనక తప్పలేదు. మేం తెలంగాణ ఇచ్చామని ఎవరైనా అంటే, మీరు ఇవ్వలేదు.. ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఎవరి విజయం? మేము సాధించాం. మా లీడర్ ఇచ్చింది. మా ప్రభుత్వం ఇచ్చిందని ఎవరైనా అంటే.. మీకో ప్రశ్న మీరు మీ లీడర్‌కు ఏం ఇచ్చారు?’ అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో మైనారిటీ సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్ సుదీర్ఘంగా మాట్లాడారు. కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అక్బరుద్దీన్ ప్రసంగానికి అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు. సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఆలకించారు. ‘2019లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సవాలే లేదు. మజ్లిస్, టీఆర్ఎస్లు కలసి మళ్లీ అధికారంలోకి వస్తాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా తుడిచిపెట్టుకుపోయారో వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. 2024లోనూ మాదే అధికారం. అరచేతిలో స్వర్గాన్ని చూపించి కాలం గడి పే రోజులు పోయాయి. ఇది సోషల్ మీడియా కాలం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని కాంగ్రెస్‌కు అక్బర్ కౌంటర్ ఇచ్చారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలు, ఇతర మైనారిటీల సంక్షేమానికి ఎంతో కృషిచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు. రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఇదంతా ఆయన వ్యక్తిగతంగా చేసినదే. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన కార్యా ల ఘనతను ఇవ్వలేం. ఎందుకంటే ఆ సమయంలో దేశంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా అమలు చేయలేదు’ అని అన్నారు. ఫలిస్తున్న ముస్లింల ఆశలు.. ‘ముస్లింలు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీల కంటే వెనకబడి ఉన్నారని సచార్, కుందు, గోపాల్ కమిటీలు నివేదించాయి. 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో అన్యాయానికి గురైంది ముస్లింలే. ముస్లింలనే రెండో తరగతి పౌరులుగా చూశా రు ఇనాం, జాగిర్ అబాలిషన్, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాల కింద ముస్లింలు భూములు కోల్పోయి తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ముస్లింల చదువులు, అభివృద్ధి కోసం కేటాయించిన వేల ఎకరాల వక్ఫ్ భూములను గత ప్రభుత్వాల హయాంలో కబ్జా చేసి తెగనమ్మాయి’ అక్బరుద్దీన్ విమర్శించారు. ఈ పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు తమకు ఆశాకిరణంగా కనిపించిందన్నారు. ఆ ఆశలు ఆడియాశలు కాలేదని, కేసీఆర్ నేతృత్వంలో ముస్లింల ఆశలు, ఆశయాలు ఫలిస్తున్నాయని అన్నారు. ప్రవేశ పరీక్షల్లో 10 వేల ర్యాంక్‌లోపు సాధించిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని కాంగ్రెస్ పాల కులు పోతుపోతూ మెలిక పెట్టారన్నారు. ర్యాం కులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు ఇస్తామని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య స్కాలర్షిప్లు ప్రకటించారన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదు.. ముస్లింలకు ఎస్సీ, ఎస్టీలతో సమానంగా అన్ని అభివృద్ధి ఫలాలు అమలు చేయా లని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కేసీఆర్ అందరినీ ఒకే దృష్టి తో చూసే నాయకుడని ప్రశంసించా రు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ను సాధించగలమనే ధీమాతో ఉన్నానన్నారు. కాంగ్రెస్ సభ్యులు అడ్డుప డగా, 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని మండిపడ్డారు. మీకు 70 ఏళ్లు పాలించేందుకు అవకాశం దొరికితే ఏం ఇచ్చారు? బాబ్రీ మసీదును కూల్చి ఇనాంగా ఇచ్చారని మండిపడ్డారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. ఏ రాష్ట్రంలోనైనా మైనారిటీల కోసం 200కు పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయా? ఇది విజయం కాదా? వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగింది. వక్ఫ్ కమిటీ ఏర్పాటు చేశారు. తమ విజ్ఞప్తిపై 10 ఎకరాల్లో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. 600 మంది ముస్లిం విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో విదేశీ విద్య చదువుకుంటున్నారని పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో ముస్లింలకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్ కోరారు. ముస్లిం నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల కోసం 1.22 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీరికి రూ.150 కోట్లు విడుదల చేసిన తర్వాతే కొత్త దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ ఏర్పాటు చేయాలన్నారు. వక్ఫ్ బోర్డు సీజ్‌కు మద్దతు తెలంగాణ వక్ఫ్ బోర్డును సీజ్ చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అక్బరుద్దీన్ స్వాగతించారు. బోర్డులో అవకతవకలపై దర్యాప్తు జరగాలని అన్నారు. వక్ఫ్ బోర్డును లూటీ చేసిన వారిపై విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపి శిక్షించాలన్నారు. -
ఫిల్మ్ నగర్ భూ కేటాయింపుల్లో అక్రమాలున్నాయి'
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ భూములు అక్రమాలు జరిగాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. గృహ నిర్మాణ సొసైటీలకు వక్ఫ్ భూములను కూడా కేటాయించారని మండిపడ్డారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఫిల్మ్ నగర్ భూ కేటాయింపులపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ..ఫిల్మ్ నగర్ భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వ వివరణ కూడా సక్రమంగా లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు. జూబ్లీహిల్స్ , ఫిల్మ్ నగర్ సొసైటీల్లో అవతవకలను బయటపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం వేల ఎకరాలను ఈ సొసైటీలకు అప్పగించిందన్నారు. నందగిరి హిల్స్ లో 50 కోట్లకు పైగా అక్రమిలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎన్జీవో సొసైటీ, ఎమ్మెల్యే కాలనీలలోవంద కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. సొసైటీ భూముల్లో అవకతవకలపై విచారణ చేస్తున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం జరగడం లేదన్నారు. దొంగలకు ఇంతవరకూ శిక్ష పడట్లేదని, దొంగలు తింటూనే పోతున్నారన్నారు. కనీసం ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సొసైటీల్లో ఉన్న భూమినంతటినీ ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. దానిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. అవతవకలు జరిగిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చట్టం చేయాలని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.