హైదరాబాద్: ఫిల్మ్నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ భూములు అక్రమాలు జరిగాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. గృహ నిర్మాణ సొసైటీలకు వక్ఫ్ భూములను కూడా కేటాయించారని మండిపడ్డారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఫిల్మ్ నగర్ భూ కేటాయింపులపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ..ఫిల్మ్ నగర్ భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వ వివరణ కూడా సక్రమంగా లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు.
జూబ్లీహిల్స్ , ఫిల్మ్ నగర్ సొసైటీల్లో అవతవకలను బయటపెట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం వేల ఎకరాలను ఈ సొసైటీలకు అప్పగించిందన్నారు. నందగిరి హిల్స్ లో 50 కోట్లకు పైగా అక్రమిలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఎన్జీవో సొసైటీ, ఎమ్మెల్యే కాలనీలలోవంద కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. సొసైటీ భూముల్లో అవకతవకలపై విచారణ చేస్తున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం జరగడం లేదన్నారు. దొంగలకు ఇంతవరకూ శిక్ష పడట్లేదని, దొంగలు తింటూనే పోతున్నారన్నారు. కనీసం ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఈ సొసైటీల్లో ఉన్న భూమినంతటినీ ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. దానిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. అవతవకలు జరిగిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చట్టం చేయాలని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.