మళ్లీ టీఆర్‌ఎస్, మజ్లిస్‌ ప్రభుత్వమే | Akbaruddin Owaisi says TRS, AIMIM will win 2019 polls in Telangana | Sakshi
Sakshi News home page

మళ్లీ టీఆర్‌ఎస్, మజ్లిస్‌ ప్రభుత్వమే

Published Thu, Nov 9 2017 3:06 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

Akbaruddin Owaisi says TRS, AIMIM will win 2019 polls in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కేసీఆర్‌ను నేను, మా పార్టీ కేవలం సీఎంగా చూడం. ఆయనకు ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నది. తెలంగాణను సాధించడం మామూలు విషయం కాదు. మేం కూడా తెలంగాణ ఏర్పాటులో పాలుపంచుకున్నామని కొందరు అంటారు. కేసీఆర్‌ శక్తి సామర్థ్యాలు, ప్యూహం కారణంగా మేం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనక తప్పలేదు. మేం తెలంగాణ ఇచ్చామని ఎవరైనా అంటే, మీరు ఇవ్వలేదు.. ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఎవరి విజయం? మేము సాధించాం. మా లీడర్‌ ఇచ్చింది. మా ప్రభుత్వం ఇచ్చిందని ఎవరైనా అంటే.. మీకో ప్రశ్న మీరు మీ లీడర్‌కు ఏం ఇచ్చారు?’ అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో మైనారిటీ సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

అక్బరుద్దీన్‌ ప్రసంగానికి అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచారు. సీఎం కేసీఆర్‌ ఆసక్తిగా ఆలకించారు. ‘2019లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చే సవాలే లేదు. మజ్లిస్, టీఆర్‌ఎస్‌లు కలసి మళ్లీ అధికారంలోకి వస్తాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలా తుడిచిపెట్టుకుపోయారో వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. 2024లోనూ మాదే అధికారం. అరచేతిలో స్వర్గాన్ని చూపించి కాలం గడి పే రోజులు పోయాయి. ఇది సోషల్‌ మీడియా కాలం. ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని కాంగ్రెస్‌కు అక్బర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలు, ఇతర మైనారిటీల సంక్షేమానికి ఎంతో కృషిచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకొచ్చారు. రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఇదంతా ఆయన వ్యక్తిగతంగా చేసినదే. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన చేసిన కార్యా ల ఘనతను ఇవ్వలేం. ఎందుకంటే ఆ సమయంలో దేశంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా అమలు చేయలేదు’ అని అన్నారు.

ఫలిస్తున్న ముస్లింల ఆశలు..
‘ముస్లింలు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీల కంటే వెనకబడి ఉన్నారని సచార్, కుందు, గోపాల్‌ కమిటీలు నివేదించాయి. 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో అన్యాయానికి గురైంది ముస్లింలే. ముస్లింలనే రెండో తరగతి పౌరులుగా చూశా రు ఇనాం, జాగిర్‌ అబాలిషన్, అగ్రికల్చర్‌ ల్యాండ్‌ సీలింగ్, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాల కింద ముస్లింలు భూములు కోల్పోయి తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ముస్లింల చదువులు, అభివృద్ధి కోసం కేటాయించిన వేల ఎకరాల వక్ఫ్‌ భూములను గత ప్రభుత్వాల హయాంలో కబ్జా చేసి తెగనమ్మాయి’ అక్బరుద్దీన్‌ విమర్శించారు. ఈ పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు తమకు ఆశాకిరణంగా కనిపించిందన్నారు. ఆ ఆశలు ఆడియాశలు కాలేదని, కేసీఆర్‌ నేతృత్వంలో ముస్లింల ఆశలు, ఆశయాలు ఫలిస్తున్నాయని అన్నారు. ప్రవేశ పరీక్షల్లో 10 వేల ర్యాంక్‌లోపు సాధించిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పాల కులు పోతుపోతూ మెలిక పెట్టారన్నారు. ర్యాం కులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్‌లు ఇస్తామని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు ప్రకటించారన్నారు.  

70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదు..  
ముస్లింలకు ఎస్సీ, ఎస్టీలతో సమానంగా అన్ని అభివృద్ధి ఫలాలు అమలు చేయా లని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కేసీఆర్‌ అందరినీ ఒకే దృష్టి తో చూసే నాయకుడని ప్రశంసించా రు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల ను సాధించగలమనే ధీమాతో ఉన్నానన్నారు. కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుప డగా, 70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని మండిపడ్డారు. మీకు 70 ఏళ్లు పాలించేందుకు అవకాశం దొరికితే ఏం ఇచ్చారు? బాబ్రీ మసీదును కూల్చి ఇనాంగా ఇచ్చారని మండిపడ్డారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. ఏ రాష్ట్రంలోనైనా మైనారిటీల కోసం 200కు పైగా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉన్నాయా? ఇది విజయం కాదా? వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు జరిగింది. వక్ఫ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. తమ విజ్ఞప్తిపై 10 ఎకరాల్లో ఇస్లామిక్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. 600 మంది ముస్లిం విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో విదేశీ విద్య చదువుకుంటున్నారని పేర్కొన్నారు.

కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి..  
హైదరాబాద్‌ తరహాలో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ పట్టణాల్లో ముస్లింలకు కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని అక్బరుద్దీన్‌ కోరారు. ముస్లిం నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల కోసం 1.22 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీరికి రూ.150 కోట్లు విడుదల చేసిన తర్వాతే కొత్త దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ ఏర్పాటు చేయాలన్నారు.  

వక్ఫ్‌ బోర్డు సీజ్‌కు మద్దతు
తెలంగాణ వక్ఫ్‌ బోర్డును సీజ్‌ చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అక్బరుద్దీన్‌ స్వాగతించారు. బోర్డులో అవకతవకలపై దర్యాప్తు జరగాలని అన్నారు. వక్ఫ్‌ బోర్డును లూటీ చేసిన వారిపై విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపి శిక్షించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement