సాక్షి, హైదరాబాద్: గత ఏడాదికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నెలా నెలన్నర రోజుల్లో చెల్లిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. ఫీజులకు నిధులు విడుదల చేయడంలో జాప్యమేమీ చేయడం లేదని.. కావాలని విద్యార్థులను, కాలేజీలను రెచ్చగొట్టవద్దని విపక్షాలకు సూచించారు. బుధవారం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. పేద విద్యార్థుల ఉసురు తగులుతుందని విపక్షాల సభ్యులు మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలు ఇస్తున్నారని.. పేద విద్యార్థుల ఫీజు కోసం ఇవ్వడానికి నిధులు లేవా అని నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు అధికారపక్ష సభ్యులు, కాంగ్రెస్ సభ్యుల మధ్య పరస్పర వాదోపవాదాలు జరిగాయి.
పేద విద్యార్థుల ఉసురు తగులుతుంది
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ చర్చను ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.4 వేల కోట్లు ఫీజు బకాయిలు పేరుకుపోయాయని, 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. గతేడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఏప్రిల్‌లోనే ఫీజు బకాయిలు చెల్లిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. సీఎంపై ప్రివిలేజ్ మోషన్ (హక్కుల తీర్మానం) ఇచ్చామని.. ఇంతకుమించి దౌర్భాగ్యం మరోటి ఉంటుందా అని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి ఈటల జోక్యం చేసుకొని.. దౌర్భాగ్యం వంటి మాటలు వాడడం సమంజసంగా లేదని, అది సంస్కార హీనమని పేర్కొన్నారు. ఇక తిరిగి సంపత్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి 27న సీఎం కేసీఆర్ తనను ప్రగతిభవన్‌కు భోజనానికి పిలిచారని, వీలైనంత త్వరగా ఫీజు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పార్లమెంటులో కేంద్ర మంత్రి ఒకరు ఫీజు బకాయిలపై చేసిన వ్యాఖ్యలను ఇంగ్లిష్‌లో చదివారు. దీంతో అధికారపక్ష సభ్యులు జోక్యం చేసుకోగా.. ‘ఇంగ్లిష్‌లో అన్నాను అర్థం కాలేదేమో..’అంటూ సంపత్ ఎద్దేవా చేశారు. దీంతో సంపత్‌పై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు.
‘ఇంగ్లిష్ అర్థం కాలేదంటే ఎలా? మీకే వస్తుందా? ఎవరికీ రాదా..?’అని నిలదీశారు. దీంతో సంపత్ తిరిగి కల్పించుకుంటూ.. ‘మమ్మల్ని చూస్తే మీకు (అధికార టీఆర్‌ఎస్‌కు) భయంగా ఉన్నట్లుంది..’అని వ్యాఖ్యానించారు. దీంతో అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని చూస్తే మాకు భయమా?.. అంత సీన్ లేదు సంపత్..’అంటూ కడియం తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కొత్త సభ్యులైతే సీనియర్ల దగ్గర నేర్చుకోవాలంటూ సంపత్‌కు మంత్రి ఈటల సూచించారు. అనంతరం సంపత్ తిరిగి ఫీజు అంశంపై మాట్లాడారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఈ సభ వారందరి ఉసురు పోసుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇక తగిన ప్రమాణాలు లేకుండా అనేక కాలేజీలు ఏర్పాటయ్యాయని.. నాణ్యత లేని కాలేజీలను మూసేశారని టీఆర్‌ఎస్ సభ్యుడు శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు. విపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయన్నారు. ఇక ఏపీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించలేదని టీడీపీ సభ్యుడు వెంకటవీరయ్య నిలదీశారు. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య, ఎంఐఎం సభ్యుడు పాషాఖాద్రీ కూడా ఈ అంశంపై మాట్లాడారు.
దీన్ని ఆలస్యం అనలేం
‘ఫీజు’పై చర్చ అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. గత ప్రభుత్వాల వారసత్వంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. ‘‘ఒక్కో కోర్సుకు ఒక్కో సమయంలో అడ్మిషన్లు జరుగుతాయి. విద్యా సంవత్సరం కూడా ఒక్కో విధంగా ఉంటుంది. ఫీజుల్లోనూ తేడాలుంటాయి. ఆ ప్రకారం కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటాయి. అందువల్ల అదే విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము ఇవ్వడం కుదరదు. ఏటా అంతకుముందు ఏడాదికి సంబంధించిన ఫీజు సొమ్మే చెల్లిస్తుంటాం. దీన్ని ఆలస్యమని అనలేం..’’అని ఈటల స్పష్టం చేశారు. 2016–17 సంవత్సరానికి రూ.3,200 కోట్లు బకాయిలుంటే అం దులో రూ.2,896 కోట్లు చెల్లించామని చెప్పారు. మిగతా బకాయిలను నెలా నెలన్నరలో చెల్లిస్తామన్నారు. మొత్తం విద్యార్థుల సమాచారం ఇంకా అప్‌లోడ్ కాలేదని, ఈ ఏడాది చివరి నాటికి స్పష్టత వస్తుందని తెలిపారు. ఏపీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల ఫీజు బకాయిలను కూడా పరిశీలించి చెల్లిస్తా మని చెప్పారు. ఇక వాసవి వంటి కొన్ని కాలేజీలు ముందు ఒక ఫీజు చెప్పి తర్వాత పెంచేశాయని.. అటువంటి వాటి విషయంలో విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఫీజు బకాయిలపై విద్యార్థులను, కాలేజీలను రెచ్చగొట్టవద్దన్నారు. తాము ప్రైవేటు విద్యకు, కాలేజీలకు వ్యతిరేకం కాదన్నారు.
దళిత విద్యార్థులకు ఇవ్వడానికి డబ్బుల్లేవా?: ఉత్తమ్
గతేడాది ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించలేదని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి రూ.20 వేల కోట్లుంటాయిగానీ.. దళిత, బీసీ విద్యార్థులకు ఇవ్వడానికి నిధులు లేవా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని కాలేజీలు మూతపడ్డాయని, అందుకు బాధ్యత ఎవరిదన్నారు. ప్రైవేటు కాలేజీలను తగ్గించి విద్యార్థుల సంఖ్యను తక్కువ చేస్తూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళుతున్నారన్నారు. అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ముఖ్యమంత్రి రాకపోవడం ఏమిటంటూ నిరసన వ్యక్తంచేశారు.
ఫీజు పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర: కిషన్‌రెడ్డి
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీసీ ‘ఇ’లోని ముస్లింలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారని, ఇతర బీసీలకు మాత్రం 10 వేల ర్యాంకులోపు వారికి మాత్రమే పూర్తిగా ఇస్తూ.. మిగతా వారికి తక్కువగా ఇస్తున్నారని ఎత్తిచూపారు. బీజేపీ మరో సభ్యుడు కె.లక్ష్మణ్ కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.12 వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment