సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ‘మక్కల లొల్లి’కి వేదికయింది.పౌల్ట్రీ పరిశ్రమలో మక్కల (మొక్కజొన్నల)కుంభకోణం జరిగిందని బుధవారం తన ప్రసంగంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలకు గురువారం సభలో ప్రభుత్వం దీటైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.ఈ సందర్భంగా అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో భాగంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ భట్టి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.వాటికి మంత్రి ఈటల వివరంగా జవాబిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఈటల మాట్లాడుతూ భట్టి చేసిన ఆరోపణల్లో నిజం లేదని, కరోనా ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో చేయాల్సిన ఆరోపణలు కావని అన్నారు.
‘కరోనా ప్రభావంతో కుప్పకూలింది....పౌల్ట్రీ రంగానికి చెందిన ఏ రైతు ఇంటికి వెళ్లినా చనిపోయిన వారి కుటుంబాలను తలపిస్తున్నాయి. అయినా భట్టి ఇంతటి అవాస్తవాలు ఎలా చెప్పారో అర్థం కావడం లేదు.పౌల్ట్రీకి ప్రభుత్వం సబ్సిడీపై మక్కలు ఇవ్వలేదు. మొదటి ఏడాది కొనుగోలుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పౌల్ట్రీకి ఇవ్వాలన్న తమ విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అంగీకరించారు. అయినా ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా టన్నుకు రూ.100–200 కన్నా ఎక్కువ తగ్గించలేదు. అంతా కలిపిన అందులో ప్రభుత్వం తగ్గించుకుంది రూ.6–7 కోట్లకు మించి ఉండదు.
వందల కోట్ల కుంభకోణం అని అంటున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమ అయిన పౌల్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల కాంగ్రెస్ నేతలే అభాసుపాలవుతారు. ఇచ్చిన మక్కల్లో కూడా 2లక్షల టన్నులు పౌల్ట్రీ రైతులకే ఇచ్చారు. ఆ తర్వాత మిగిలినవే పెద్ద పెద్ద బ్రీడర్ కంపెనీలకు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మక్కలు పెద్ద కంపెనీలకు మూడు నెలలకు కూడా సరిపోవు.మరి అలాంటప్పుడు అమ్ముకునేది ఎక్కడిది? ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు.’ అని అన్నారు. ఏ ఏడాదిలో పౌల్ట్రీ పరిశ్రమలకు ఎంత మక్కలు ఇచ్చారన్న వివరాలు తమకు పంపుతానని, సభ్యులకు ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.
బేజాప్తా కాదు బాజాప్తా చేస్తాం : సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ చర్చలో జోక్యం చేసుకుని ఇందులో కుంభకోణం లేదు లంబకోణం లేదని వ్యాఖ్యానించారు. పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు రెండు, మూడు వందల కోట్లు ఇవ్వాల్సి వచ్చినా తాము ఖాతరు చేయబోమని, ఖచ్చితంగా ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులో దాచుకోవాల్సింది ఏమీ లేదని, పౌల్ట్రీ రంగం కూలిపోకుండా బేజాప్తా కాదు బాజాప్తా ఇస్తామని అన్నారు. ‘పరిశ్రమలు నిలబడాలంటే కొన్ని రాయితీలు ఇవ్వక తప్పదు. రాష్ట్రం ఏర్పాటయిన రెండేళ్లకే మనకు ఓ బడా పరిశ్రమరావడం ఖాయమయిపోయింది.
కానీ, అప్పుడున్న మహారాష్ట్ర సీఎం చురుగ్గా వ్యవహరించి ఏకంగా రూ.3,500 కోట్ల విలువైన ప్రోత్సాహకాలిచ్చి ఆ పరిశ్రమను అక్కడకు తీసుకెళ్లారు. పారిశ్రామిక రాయితీలు ఆనవాయితీగా ఇస్తున్నారు. నాడు వైఎస్సార్, కోట్ల, జలగం వెంగళరావు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. పరిశ్రమను నిలబెట్టుకోవాలంటే ఇవ్వాల్సిందే.’అని వ్యాఖ్యానించారు. అనంతరం ఈటల మళ్లీ వివరణ ఇస్తున్న సందర్భంలో రాష్ట్రంలో కరోనా లేదని చెప్పాలని సీఎం సూచించారు. వాటికనుగుణంగా రాష్ట్రంలో కరోనా లేదని చెప్పిన వైద్య మంత్రి అపోహలకు పోకుండా పౌష్టికాహారమైన గుడ్లు, చికెన్ తినాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మేం కాదు... మీ నేతలవే చిల్లర పనులు : భట్టి
అనంతరం భట్టి మాట్లాడుతూ మక్కల విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని తాము చెప్పడం లేదని, పౌల్ట్రీ ఫెడరేషన్‌కు ఇచ్చినవి దుర్వినియోగం అయ్యాయన్నదే తమ ఆరోపణ అని, వాటిని అమ్ముకున్నారా లేదా అన్నదానిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తే అడిగిన దానికి చెప్పకుండా ఏవేవో చెపుతున్నారన్నారు. మంత్రి ఈటల చెప్పినట్టు తమవి చౌకబారు, చిల్లర ఆరోపణలు కావని, టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు చిల్లర పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది.
అడ్డగోలు ఆరోపణలు... రొడ్డ కొట్టుడేనా : సీఎం కేసీఆర్
పౌల్ట్రీ కుంభకోణం ఆరోపణలపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీనుద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్షాలు చేసే విమర్శ పట్ల విచక్షణ ఉండాలి. ప్రతిదాన్నీ అడ్డగోలుగా మాట్లాడి రొడ్డకొట్టుడు కొట్టుడేనా? మీకు ప్రజలెందుకు ఓట్లు వేస్తలేరో ఇప్పటికీ అర్థమయితలేదు. ఈవీఎంలన్నారు.. బ్యాలెట్ వచ్చినా ఏం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో ప్రజలు మాకు స్పష్టంగా చెబుతున్నారు. వాళ్లెన్ని అరిచినా పట్టించుకోవద్దని, మీ దారిలో మీరు వెళ్లాలని చెపుతున్నారు. మీరు సమీక్షించుకోవాలి. మీ పద్ధతి మారాలి. మేం చెపుతున్నా మీరు సవరించుకోవడం లేదు.’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment