రెండో రోజు ఎంఐఎం గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాల రెండో రోజు మంగళవారం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన చర్చలో ‘భారతరత్న’ఇవ్వాలనే తీర్మానాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. తీర్మానాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 12 మంది సభ్యులు ప్రసంగించారు. ఏఐఎంఐఎం సభ్యులు తీర్మానంపై చర్చ సందర్భంగా సభకు గైర్హాజరయ్యారు.
రెండో రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ప్రస్తావన లేకుండా పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికే సభా వ్యవహారాలు పరిమితమయ్యాయి. సుమారు రెండు గంటలపాటు సాగిన అసెంబ్లీని బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి నలుగురు సభ్యులను ప్యానెల్ చైర్మన్లుగా నామినేట్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.
టీఆర్ఎస్ శాసనసభ్యులు హన్మంతు షిండే (జుక్కల్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్), ఏఐఎంఐఎం శాసనసభ్యుడు మహ్మద్ మౌజంఖాన్ (బహదూర్‌పురా) ఈ జాబితాలో ఉన్నారు. కాగా, బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ అనంతరం కరోనాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో కరోనాపై చర్చించేందుకు అధికార, విపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. కరోనాపై జరిగే చర్చలో ముఖ్యమంత్రి సమాధానం అనంతరం.. రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెడతారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండు రోజులు రెవెన్యూ చట్టంపై చర్చ జరగనుంది.