విస్మయపరుస్తున్న ఎంపీ ఎస్పీవై వ్యవహారం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మార్కెట్లో షాపుల నిర్వాహకులెవరూ పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, అంతా తామే చెల్లిస్తామని గంభీరపు ప్రకటనలిచ్చి.. నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడాది దాటినప్పటికీ వేలం సొమ్ము మాత్రం మునిసిపాలిటీ ఖజానాకు చేరలేదు. పైగా మార్కెట్ వేలం మొత్తం సొమ్ము చెల్లించాలంటూ నోటీసులు జారీచేస్తే.. చెల్లని చెక్కులు ఇచ్చిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వ్యవహారం ఆశ్చర్యం గొలుపుతోంది. వేలంపాట రూ.76.12 లక్షలతో పాటు అగ్రిమెంట్, వడ్డీ రూ.15 లక్షలు, సర్వీస్ చార్జీ రూ.13.70 లక్షలతో కలిపి.. మొత్తం రూ.కోటి నాలుగులక్షల 82వేలు చెల్లించాల్సి ఉండగా.. టెండరు వేసే సమయంలో డిపాజిట్ కింద రూ.16 లక్షలు చెల్లించారు.
డిపాజిట్ తీసివేస్తే రూ.88.82 లక్షలు చెల్లించాలి. అయితే, రూ.60 లక్షల విలువ చేసే చెక్కులు కాస్తా బౌన్స్ అయినప్పటికీ కేసులు పెట్టకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల ముందు వ్యాపారస్తులపై ప్రేమ కురిపించిన అధికారపార్టీ నేతలు తర్వాత మొహం చాటేశారు. ఇదే తరుణంలో మార్కెట్ వ్యాపారస్తుల నుంచి అద్దెల వసూలుకు మునిసిపల్ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఏమి జరిగిందంటే..
నంద్యాలలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్, నూనెపల్లె, మూలసాగరం మార్కెట్లో ఉన్న షాపులను అద్దెకు ఇవ్వడంతో పాటు వాహనాల రాకపోకలు, పార్కింగ్ ఫీజు వసూలు మొదలైన వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరానికి నంద్యాల మునిసిపాలిటీ టెండర్లను ఆహ్వానించింది. అయితే, ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలారెడ్డి పేరు మీద టెండర్లు దాఖలు చేశారు. వ్యాపారస్తుల నుంచి వసూలు చేయవద్దని, ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ టెండర్ దక్కించుకున్నారు. టెండర్లో పాల్గొనేందుకు చెల్లించిన రూ.16 లక్షల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) మినహా ఇంత వరకు పైసా కూడా మునిసిపాలిటీకి చెల్లించలేదు. వాస్తవానికి టెండర్ గడువు కూడా ఈ ఏడాది మార్చితో ముగిసింది.
అయినప్పటికీ పైసా ఇవ్వలేదు. ఇంతటితో కథ ఆగిపోలేదు. టెండర్ సొమ్ము చెల్లించాలంటూ మునిసిపల్ అధికారులు గత ఏడాదిలోనే నోటీసులు జారీచేశారు. ఆ నోటీసుల నేపథ్యంలో రూ.60 లక్షల విలువ చేసే ఐదు చెక్కులను మునిసిపాలిటీకి ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె అందజేశారు. అయితే.. సదరు చెక్కులు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో సొమ్ములే లేవని, దీంతో చెక్కులు చెల్లవని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు.ఏకంగా రూ.60 లక్షల మొత్తానికి చెల్లని చెక్కులు ఇచ్చిన వారిపై కనీసం కేసు పెట్టేందుకు కూడా అప్పట్లో మునిసిపాలిటీ అధికారులు ప్రయత్నించలేదు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలోనే అధికారులు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు సాహసించలేదని తెలుస్తోంది.
వ్యాపారస్తుల మెడపై కత్తి!
టెండర్లో పాల్గొని సొమ్ము చెల్లించకపోవడంతో అధికారులు కాస్తా వ్యాపారస్తుల నుంచి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే తమను చెల్లించమంటే చెల్లించేవారమని, ఈ విధంగా చేతులెత్తేయడం ఏమిటని కొందరు మండిపడుతున్నారు. పైగా అధికారులు ఎప్పుడు తమపై పడతారోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీ నేతల వ్యవహారం ‘ఏరుదాటే వరకు ఏటి మల్లన్న.. దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న చందంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.