కోహ్లీ సహా ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తి!
టీమిండియా ప్రధాన కోచ్గా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు తనను ఎందుకు ఎంపిక చేయలేదంటూ మాజీ ఆటగాడు, టీమిండియాకు డైరెక్టర్ గా సేవలందించిన రవిశాస్త్రి పరోక్షంగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉద్దేశపూర్వకంగానే తనను ఇంటర్వ్యూ చేసే సమయంలో అక్కడ లేవపోవడంపై వ్యాఖ్యలు చేయగా, ఆ సమయంలో అధికారిక మీటింగ్ లో పాల్గొన్నందున హాజరు కాలేదని గంగూలీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియ ఆటగాళ్లు బీసీసీఐ నిర్ణయాలతో ఆందోళన చెందుతున్నారు.
బోర్డు నిర్ణయంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మినీ ఐపీఎల్, దులీప్ ట్రోఫీని ఏకకాలంలో నిర్ణయించాలని బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేయడంతో అసలు సమస్య మొదలైంది. సరైన ప్రణాళికలు లేకుండా బోర్డు వ్యవహరిస్తోందని, ఏ టోర్నమెంట్లలో పాల్గొనాలో అర్థంకావడం లేదని ఆటగాళ్లు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఆటగాళ్లు తమకు ఉన్న ఒప్పందాల కారణంగా ఆయా జట్లకు కొనసాగాల్సి ఉంటుంది. కానీ, బీసీసీఐ నిర్వహించే మ్యాచ్లు ఏకకాలంలో ఉంటే కాంట్రాక్టుల పరిస్థితి ఏంటని ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కనీసం నెల రోజుల ముందు తమకు ఈ విషయాన్ని తెలపాలని టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీతో సహా ఇతర ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.