Kaliyaganj: మళ్లీ హింస.. ఆ వీడియోపై దుమారం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కలియాగంజ్ హింసతో అట్టుడికి పోయింది. ఓ మైనర్ గిరిజన బాలిక హత్యాచారానికి గురికావడంపై రగిలిపోయారు స్థానికులు. ఆందోళనకు దిగి పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించేందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బాడీని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడం, గ్రామస్తులు అడ్డుకునే యత్నాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి హింసకు దారి తీసింది.
గురువారం సాయంత్రం.. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని గంగువా గ్రామానికి చెందిన ఓ బాలిక ట్యూషన్‌కని చెప్పి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆ రాత్రంతా ఆమె కోసం గాలించింది ఆమె కుటుంబం. శుక్రవారం ఆమె శవాన్ని స్థానికులు ఊరి శివారులో ఉన్న ఓ కొలను పక్కన పొదల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆమె హత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి గ్రామస్తులు రగిలిపోయారు. రోడ్లను దిగ్భంధించి.. నిరసనలు చేపట్టారు. పరిస్థితి హింసాత్మకంగా మారే సూచనలు కనిపించడంతో.. పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శనివారం ఒక్కరోజే.. ఆందోళనకారులపై రెండుసార్లు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు పోలీసులు.
మరోవైపు పోలీస్ సిబ్బంది బాధితురాలి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన వీడియో ఒకటి రాజకీయ విమర్శలకు దారి తీసింది. అయితే.. గ్రామస్తుల నుంచి బాలిక మృతదేహాన్ని పోలీస్ సిబ్బంది సాయంతో స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపించామని, ఆలస్యమైతే కీలక ఆధారాలు చెరిగిపోయే అవకాశం ఉన్నందునే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఉత్తర దినాజ్‌పూర్ ఎస్పీ సనా అక్తర్ మీడియాకు వెల్లడించారు. బాలిక డెడ్‌బాడీ పక్కనే ఓ సీసా దొరికింది. బహుశా అది విషం బాటిల్ అయ్యి ఉండొచ్చు. ఆమె ఒంటిపైనా ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘోరంతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు అని ఎస్పీ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటన ఆధారంగా టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బెంగాల్లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని, పోలీసులు సైతం నేరాల కట్టడిలో ఘోరంగా విఫలం అవుతున్నారని మండిపడుతోంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ఓ వీడియో పోస్ట్ చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యం అది. అంతేకాదు.. ఆ మైనర్ రాజ్బోంగ్షి కమ్యూనిటీకి చెందిందని అమిత్ మాలవియా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ సుకాంత మజుందార్ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన ఆధారంగా మమతా బెనర్జీ సర్కార్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే.. పోలీసులు ఆ గ్రామంలోకి రాజకీయ నేతలు రాకుండా ఆంక్షలు విధించారు.
কালিয়াগঞ্জে নাবালিকা রাজবংশী মেয়েকে গণধর্ষণ করে নৃশংসভাবে হত্যা করা হয়। ধর্ষিতা পরিবারের সঙ্গে দেখা করলেন রাজ্য সভাপতি ডঃ @DrSukantaBJP, সাংসদ @DebasreeBJP ও @khagen_murmu বিধায়ক গোপাল চন্দ্র সাহা, সত্যেন্দ্রনাথ রায়, চিন্ময়দেব বর্মন ও শ্রীরূপা মিত্র চৌধুরী। pic.twitter.com/S19YFNucha
— BJP Bengal (@BJP4Bengal) April 22, 2023
బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఈడ్చుకెళ్తున్నట్లు ట్విటర్లో షేర్ చేసిన వీడియోను జాతీయ మహిళా కమిషన్ కూడా పరిగణనలోకి తీసుకుంది. వివరణ ఇవ్వాలంటూ బెంగాల్ డీజీపీని ఆదేశించింది.
In this video, the body West Bengal Police is insensitively dragging is that of a minor rape and murder victim from the Rajbongshi community in Uttar Dinajpur’s Kaliaganj. Such haste is often seen when the purpose is to eliminate or dilute evidence and cover up the crime… pic.twitter.com/zgz2Rxlik1
— Amit Malviya (@amitmalviya) April 22, 2023
ఇంకోవైపు ఎన్సీపీసీఆర్(జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం) సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. నిజనిర్ధారణకమిటీ ద్వారా కేసును పర్యవేక్షించబోతోంది. అంతేకాదు ఈ ఘటనపై తమకు సమాచారం అందింటలేదంటూ.. బెంగాల్ సీఎస్‌తో పాటు ఉత్తర దినాజ్‌పూర్ కలెక్టర్‌పైనా ఆరోపణలు గుప్పించింది. పోలీసులు మాత్రం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.