6 రోజుల్లో మళ్లీ మంత్రి అయ్యారు..
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్‌ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. గత మంగళవారం మంత్రి పదవి నుంచి తొలగించిన బలరామ్ యాదవ్‌ను మళ్లీ కేబినెట్లోకి తీసుకున్నారు. సోమవారం ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. బలరామ్ యాదవ్‌తో పాటు నరడ్ రాయ్, జియాఉద్దీన్ రిజ్వీలకు కేబినెట్ హోదా లభించింది.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అఖిలేష్ మంత్రి వర్గాన్ని విస్తరించారు. చివరి నిమిషంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మనోజ్ పాండేను మంత్రివర్గం నుంచి తొలగించారు. రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీ పార్టీ (క్యూఈడీ)ని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేసుకునే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నందుకు అసంతృప్తిగా ఉన్న అఖిలేష్ బాబాయ్, సీనియర్ మంత్రి శివపాల్ యాదవ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.