అసమానతలకు కాంగ్రెస్సే కారణం
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజల మధ్య అసమానతలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, కాంగ్రెస్ ఎంపీల నిజస్వరూపాన్ని ప్రజలకు వివరిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్దీభాయ్ చౌదరి అన్నారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరించిన తీరు, అప్రజాస్వామిక పోకడలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు.
దేశంలో సమతుల్యమైన అభివృద్ధికోసం దూరదృష్టితో తీసుకుంటున్న నిర్ణయాలను ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. అభివృద్ధిలో అంతరాల వల్లే నక్సలిజం మొదలైందన్నారు. నక్సలిజాన్ని అరికట్టడానికి ద్విముఖ వ్యూహంతో పనిచేస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్‌తో చర్చల్లో ఉగ్రవాదమే ప్రధానమైన అజెండా అని పేర్కొన్నారు. పాక్‌ను కట్టడి చేసే వ్యూహంతోనే చర్చలు జరుగుతాయన్నారు.
కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో ఈ నెల 25 న, నాగర్‌కర్నూలులో 26 న పర్యటించనున్నట్లుగా చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా, టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని విమర్శించారు.
మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తామని చెబుతున్న సీఎం ఆచరణలో చూపించడం లేదన్నారు. మహిళలే పోలీసుస్టేషన్లలో హత్యకు గురౌతుంటే కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెడతామంటూ బెదిరిస్తూ ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను, నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు దినేశ్‌రెడ్డి, ఎస్.మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి, బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు.