minister manikayalarao
-
స్వచ్ఛతతో ఆరోగ్య సమాజం
తాడేపల్లిగూడెం : మన ఇల్లు.. మన ఊరు.. మన దేశం కోసం అందరూ కలిసి పనిచేసి స్వచ్ఛభారత్ సాధించి ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి భాగస్వాములు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సవితృపేట 15వ వార్డులో ఆదివారం నిర్వహించిన సామూహిక పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొని వీధులను శుభ్రం చేశారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ అపారిశుధ్య వాతావరణం వల్ల ఏటా లక్షల కోట్ల రూపాయలను ఆసుపత్రులకు వెచ్చించాల్సి వస్తుందన్నారు. వారానికి రెండు గంటల వంతున సమయాన్ని వెచ్చించి స్వచ్ఛభారత్ నిర్వహిస్తే ప్రతి కుటుంబానికి ఏటా వేలాది రూపాయలు ఆసుపత్రి ఖర్చులు ఆదా అవుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బృహత్తరమైన జాతీయ కార్యక్రమంగా స్వచ్ఛభారత్‌ను నిర్వహించేందుకు కంకణబద్ధులయ్యారన్నారు. ఈ కమిటీకి జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కాపు యువత, సవితృపేట యూత్, మదర్ థెరిస్సా సంఘాలను మంత్రి అభినందించారు. ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, మునిసిపల్ కౌన్సిలర్ యెగ్గిన నాగబాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు నరిశే సోమేశ్వరరావు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. తొలుత నంద్యాల కృష్ణమూర్తి మునిసిపల్ పాఠశాలను మంత్రి మాణిక్యాలరావు పరిశీలించి పరిశుభ్రత నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
దుర్గమ్మకు గజవాహన సేవ
ఇంద్రకీలాద్రి : గజ వాహనంపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు దుర్గగుడి మాడ వీధులలో విహరిస్తున్న సుందర దృశ్యాన్ని తిలకించే భాగ్యం భక్తులకు మరి కొద్ది రోజుల్లో కలగనుంది. పుష్కరాలను పురష్కరించుకుని దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మంగళవారం పరిశీలించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రి మాణిక్యాలరావు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఈవో సూర్యకుమారి ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పుష్కరాలకు చేస్తున్న మార్పులు, చేర్పుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు గజవాహన సేవను నిర్వహిస్తామని తెలిపారు. మాడవీధులను త్వరగా నిర్మాణం చేసి అమ్మవారికి ప్రతి శుక్రవారం గజవాహన సేవ జరిపించాలని భావిస్తున్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏనుగును అమ్మవారి ఆలయానికి మంజూరు చేసినట్లు చెప్పారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆలయ అధికారులకు సూచించామన్నారు.ఆలయం చుట్టూ ప్రాకారం ఉండేలా నిర్మాణాలు చేస్తామని, అర్జున వీధికి రాజవీధిగా నామకరణం చేయాలని భావిస్తున్నామన్నారు. పుష్కరాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఏర్పాట్ల పరిశీలనకు కమిటీని నియమిస్తామన్నారు.