దుర్గమ్మకు గజవాహన సేవ
తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రి మాణిక్యాలరావు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఈవో సూర్యకుమారి ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పుష్కరాలకు చేస్తున్న మార్పులు, చేర్పుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు గజవాహన సేవను నిర్వహిస్తామని తెలిపారు. మాడవీధులను త్వరగా నిర్మాణం చేసి అమ్మవారికి ప్రతి శుక్రవారం గజవాహన సేవ జరిపించాలని భావిస్తున్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏనుగును అమ్మవారి ఆలయానికి మంజూరు చేసినట్లు చెప్పారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆలయ అధికారులకు సూచించామన్నారు.ఆలయం చుట్టూ ప్రాకారం ఉండేలా నిర్మాణాలు చేస్తామని, అర్జున వీధికి రాజవీధిగా నామకరణం చేయాలని భావిస్తున్నామన్నారు. పుష్కరాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఏర్పాట్ల పరిశీలనకు కమిటీని నియమిస్తామన్నారు.