గజవాహనాధీశా నమోస్తుతే
- ఘనంగా మహానందీశ్వరుని గ్రామోత్సవం
- అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్న భక్తులు
మహానంది: క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీ గంగా, కామేశ్వరీదేవి సహీత శ్రీ మహానందీశ్వరస్వామి వారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం గజవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి, అమ్మ వారికి గజవాహన సేవ నిర్వహించారు. మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ ఆధ్వర్యంలో పండిత బృందం వేకువజాము నుంచి విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారు గజవాహనంపై కొలువై ఆలయ పురవీధుల గుండా ఊరేగారు. మహాశివరాత్రి కావడంతో వేలాదిగా భక్తజనం హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, కల్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాద్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.