indrakeladri
-
Vijayawada: ఉత్సవాలపై ‘పచ్చ’విషం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు రోజుకో దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తున్న విపక్ష టీడీపీ చివరికి పవిత్ర ఉత్సవాలను సైతం విడిచి పెట్టలేదు. దసరా ప్రాశస్త్యం, భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అపచారానికి తెగించింది. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల కోసం అమ్మవారి ఆలయానికి చేసిన విద్యుద్దీపాలంకరణ ఫొటోలను మార్ఫింగ్ చేసి తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారానికి పాల్పడింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో కూడా విపక్షం ఇలా వ్యవహరించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్ చెక్ ఈ కుట్రను బట్టబయలు చేసింది. మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం.. ఇంద్రకీలాద్రిపై విద్యుద్దీపాలంకరణ దృశ్యాలంటూ టీడీపీతోపాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు గురువారం ఓ ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చాయి. కనకదుర్గమ్మ ఆలయం చుట్టూ కేవలం నీలం రంగు విద్యుద్దీపాలనే అలంకరించినట్లుగా ఆ ఫొటోలో ఉంది. ‘వైఎస్సార్ పార్టీ కార్యాలయం అనుకునేరు.. కాదు... విజయవాడ కనకదుర్గమ్మ గుడి’ అంటూ ఆ ఫొటోపై వ్యాఖ్యను జోడించింది. ఇంద్రకీలాద్రిని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చేశారంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటోను వైరల్ చేశారు. వాస్తవం ఏమిటంటే... ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ ఆలయంతోపాటు ఇంద్రకీలాద్రి మొత్తాన్ని రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించించింది. ఆలయ స్వర్ణ గోపురం శోభాయమానంగా భాసిల్లుతుండగా ప్రాకారం చుట్టూ అలంకరించిన విద్యుద్దీపాలు సప్తవర్ణ శోభితంగా కాంతులీనుతూ కన్నుల పండుగ చేస్తున్నాయి. అన్ని రంగుల విద్యుద్దీపాలూ వరుస క్రమంలో(సీరియల్ లైట్లు) వెలుగుతూ సముద్రతీరంలో కెరటాలను తలపించే రీతిలో కాంతి తరంగాలను ప్రసరింపజేస్తూ అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శోభను కలిగిస్తున్నాయి. ఇందులో ఏ ఒక్క రంగూకు ప్రత్యేక ప్రాధాన్యమంటూ లేదు. ఏ ఒక్క రంగూ స్థిరంగా ఉండదు. అన్ని రంగుల్లోనూ విద్యుద్దీపాలు కాంతులీనుతూ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలను మరింత శోభాయమానం చేస్తున్నాయి. ‘ఫ్యాక్ట్ చెక్’ ఏం తేల్చింది? టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చిన ఫొటోను గుర్తించిన కొందరు భక్తులు నిజానిజాలు తెలుసుకునేందుకు చొరవ చూపారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి ఈ విషయాన్ని నివేదించడంతో వెంటనే స్పందించింది. ఫ్యాక్ట్‌చెక్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిశితంగా పరిశీలించగా అవి మార్ఫింగ్ చేసిన ఫొటోలని నిగ్గు తేలింది. ఇంద్రకీలాద్రిపై సీరియల్ లైట్లతో విద్యుద్దీపాలంకరణలో ఏ ఒక్క రంగుకూ ప్రాధాన్యమివ్వలేదని, సప్త వర్ణాల విద్యుద్దీపాలతో అలంకరించారని వెల్లడైంది. అదే విషయాన్ని పోలీసు శాఖ సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించింది. దుష్ప్రచారంపై విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
సీఎం జగన్‌కు దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఇంద్రకీలాద్రిపై ఎంతో వైభవంగా నిర్వహించే దసరా నవరాత్రుల ఉత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇటీవల వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆహ్వాన పత్రిక ఆవిష్కరిచిన సంగతి విధితమే. -
మూడునాళ్ల ముచ్చటే..!
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అమ్మవారి సొమ్ము వృథా అవుతోంది. అధికారుల ఆదేశాలు మూడు నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో నిత్యం జరిగే అన్నదానానికి ఉపయోగించే ప్లేట్స్ స్థానంలో కొత్తవి కొనుగోలు చేశారు. అయితే కొత్త ప్లేట్స్ కొనుగోలు చేసి నెల రోజులు కాకుండా అవి మూలకు చేరాయి. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లేట్స్ నిరుపయోగంగా మారినా ఆలయ అధికారులకు పట్టడం లేదు. అమ్మవారి ఆలయానికి ఇచ్చిన విరాళాలను ఇలా దుర్వినియోగం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి అన్నప్రసాదాన్ని గుండ్రంగా ఉండే ప్లేట్స్‌లో భక్తులకు వడ్డించే వారు. ఇందు కోసం దేవస్థానం వెయ్యి వరకు ప్లేట్స్ ఉపయోగించే వారు. గత నెల వరకు ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ఆజాద్ ప్లేట్స్‌ను మార్చాలని నిర్ణయించారు. రోజుకు ఒక ప్లేట్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించాలని పేర్కొంటూ 5 వేల ప్లేట్లను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ప్లేట్లో కూరలు కలిసిపోకుండా ఉండే వాటిని కొనుగోలు చేయాలని అన్నదాన విభాగ అధికారులను ఆదేశించారు. దీంతో సుమారు రూ. 9 లక్షల వ్యయంతో రెండు వేల ప్లేట్లు, ట్రాలీలను కొనుగోలు చేశారు. గత నెల 26న కొత్తగా కొనుగోలు చేసిన ప్లేట్స్‌లో అన్నదానాన్ని ప్రారంభించారు. అయితే ఆలయ ఈవో మారినప్పుడల్లా వారు చేసిన నిర్ణయాలు మారుతాయనేది దుర్గగుడిపై ప్రచారంలో ఉంది. అదే తరహాలో ఈవోగా సూర్యకుమారి వచ్చిన వెంటనే కొత్తగా కొనుగోలు చేసిన ప్లేట్స్ స్థానంలో గతంలో ఉపయోగించిన రౌండ్ ప్లేట్స్ ప్రత్యక్షమయ్యాయి. దీంతో రూ. 9 లక్షలతో కొనుగోలు ప్లేట్స్ నిరుపయోగంగా మారాయి. నీటి కొరత కూడా మరో కారణం కొండపై ఉన్న అమ్మవారి అన్నదానాన్ని అర్జున వీధిలోని శృంగేరీ పీఠానికి ఇటీవల మార్చారు. అయితే అక్కడ నీటి కొరత కూడా ప్లేట్స్ మార్చేందుకు మరో కారణంగా ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్లేట్స్ శుభ్రం చేసేందుకు ఎక్కువగా నీటి వినియోగించాల్సి వస్తుందంటున్నారు. -
దుర్గమ్మకు గజవాహన సేవ
ఇంద్రకీలాద్రి : గజ వాహనంపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు దుర్గగుడి మాడ వీధులలో విహరిస్తున్న సుందర దృశ్యాన్ని తిలకించే భాగ్యం భక్తులకు మరి కొద్ది రోజుల్లో కలగనుంది. పుష్కరాలను పురష్కరించుకుని దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మంగళవారం పరిశీలించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రి మాణిక్యాలరావు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఈవో సూర్యకుమారి ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పుష్కరాలకు చేస్తున్న మార్పులు, చేర్పుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు గజవాహన సేవను నిర్వహిస్తామని తెలిపారు. మాడవీధులను త్వరగా నిర్మాణం చేసి అమ్మవారికి ప్రతి శుక్రవారం గజవాహన సేవ జరిపించాలని భావిస్తున్నామని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏనుగును అమ్మవారి ఆలయానికి మంజూరు చేసినట్లు చెప్పారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆలయ అధికారులకు సూచించామన్నారు.ఆలయం చుట్టూ ప్రాకారం ఉండేలా నిర్మాణాలు చేస్తామని, అర్జున వీధికి రాజవీధిగా నామకరణం చేయాలని భావిస్తున్నామన్నారు. పుష్కరాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఏర్పాట్ల పరిశీలనకు కమిటీని నియమిస్తామన్నారు.