కొత్త ఏడాదిలో మరింత పెరగనున్న కార్ల ధరలు.. ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: అన్ని ప్యాసింజర్ వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా ఇన్ స్టలేషన్ చేసే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పుడు వేగవంతం చేస్తుంది. అదనంగా నాలుగు ఎయిర్ బ్యాగులను ఇన్ స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు రూ.9,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి ఎయిర్ బ్యాగ్ ధర రూ.1,800 నుంచి రూ.2,000 వరకు ఉండవచ్చు అని తెలిపారు. ఇప్పుడు ఆ మేరకు కార్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గతంలోనే దీనికి ఎయిర్ బ్యాగుల తప్పనిసరి అనే నిబందనకు సంబంధించి ఆదేశాలు జారీ అయ్యాయి.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు అన్ని కార్లు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా నాణ్యమైన ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా బిగించాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. దీంతో ఆయా వాహనాల ధరలపైనా ఈ ప్రభావం పడబోతోంది. కానీ దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న రోడ్లు ప్రమాదాల నివారణలో ఎయిర్ బ్యాగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా, వాహనం అన్ని వేరియెంట్, సెగ్మెంట్లలో కనీసం ఆరు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా అందించాలని నేను అన్ని ప్రైవేట్ వాహన తయారీదారులకు విజ్ఞప్తి చేశాను రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో తయారు చేసిన అన్ని వాహనాల్లో తప్పనిసరిగా ముందు వరస సహ ప్రయాణీకుల కోసం రెండు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాద బాధితుల్లో భారతదేశంలోనే దాదాపు 10 శాతం మంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టిఎస్ఎ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం..ఎయిర్ బ్యాగులు, సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముందు కూర్చొన్న వారిలో మరణించే వారి శాతం 61 శాతం వరకు తగ్గింది. ఎయిర్ బ్యాగు ఉండటం వల్ల మరణాల శాతం 34 శాతం తగ్గినట్లు ఆ నివేదికలో తేలింది.
(చదవండి: కొత్త ఏడాదిలో ఎలన్ మస్క్ జోరు.. గంటకు వేలకోట్ల సంపాదన!)