టెక్స్టైల్ జోన్‌గా సిరిసిల్ల
నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దు
- ప్రభుత్వం మనది.. సమస్యలుంటే చెప్పండి
- రాష్ట్ర మంత్రి కేటీఆర్
- కన్నుల పండువగా రథోత్సవం
సిరిసిల్ల : సిరిసిల్లను టెక్స్టైల్ జోన్‌గా ఏర్పాటు చేసి రాయితీలు ఇస్తూ వస్త్ర పరిశ్రమను అన్ని రకాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్లలో ఆదివారం మార్కండేయస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగాయి. నేతన్న కాంస్య విగ్రహానికి పూలమాల వేసిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రినయ్యాను.. ఇది మీరు పెట్టిన భిక్ష. సిరిసిల్లలో ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. నేత కార్మికుల ఆత్మహత్య అని పత్రికల్లో వస్తే గుండెలోతుల్లో ఎక్కడో ఒకచోట బాధనిపిస్తుంది.
అందుకే సమస్యలుంటే చెప్పండి. ప్రభుత్వం మనది. ఆదుకోవడానికి ప్రయత్నిస్తాం..’ అంటూ నేతన్నలకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అమలు చేస్తున్నామని, రూ.15 కోట్ల మేర వెయ్యి కుటుంబాలకు సిరిసిల్లలో లబ్ధి కలుగుతుందన్నారు. మీవాడిగా.. మీ మంత్రిగా నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వస్త్ర వ్యాపార సంక్షేమం కోసం టెక్స్టైల్ జోన్‌గా సిరిసిల్లను ప్రకటించి రాయితీలు పొందేలా ప్రయత్నిస్తానని కేటీఆర్ అన్నారు.
కన్నులపండువగా రథోత్సవం
అంతకుముందు పట్టణ వీధుల్లో మార్కండేయస్వామి శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. మార్కండేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా గాంధీచౌక్, అంబేద్కర్‌చౌరస్తా, పాతబస్టాండ్‌లోని నేతన్న విగ్రహం మీదుగా శోభాయాత్ర సాగింది. చిన్నారుల కోలా టం, డీజే సౌండ్స్‌తో సిరిసిల్ల వీధులు మార్మోగాయి. వేడుకల్లో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పులి విఠల్, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, ఆర్డీవో భిక్షానాయక్, డీఎస్పీ దామెర నర్సయ్య, సీఐలు విజయ్‌కుమార్, రంగయ్యగౌడ్, సంఘం పట్టణ నాయకులు కట్టెకోల లక్ష్మీనారాయణ, బూట్ల నవీన్‌కుమార్, గుండ్లపల్లి పూర్ణచందర్, దార్నం లక్ష్మీనారాయణ, రాపెల్లి లక్ష్మీనారాయణ, అన్నల్దాస్ యాదగిరి, బొద్దుల సుదర్శన్, మంచె శ్రీనివాస్, గౌడ సురేశ్, గోలి ధర్మయ్య, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
అర్హులను గుర్తించేందుకే సమగ్ర సర్వే
సంక్షేమ పథకాల్లో అర్హులకు న్యాయం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఈ నెల 19న ఒకేరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రణాళిక రూపకల్పనకు సర్వే దోహదపడుతుందన్నారు. గల్ఫ్‌లో ఉన్నవారు సైతం తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. సర్వే చేసిన ప్రతీఇంటికి స్టిక్కర్ అంటిస్తారన్నారు.