మఠాల స్వయంప్రతిపత్తికి ప్రభుత్వం అడ్డురాదు
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర
బెంగళూరు : ‘కర్ణాటక హిందూ ధార్మిక సంస్థలు, ధర్మాదాయ సంస్థల (సవరణ) బిల్లు వెనక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర వెల్లడించారు. మఠాల స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం అడ్డురాబోదని, అంతేకాక మఠాల రోజువారీ చర్యల్లో కూడా జోక్యం చేసుకోబోమని అన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును మాత్రమే ప్రవేశపెట్టామని, తరువాతి అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరిపి అవసరమనుకుంటే సవరణలు చేస్తామని తెలిపారు.
సూసలె మఠంతో పాటు రాష్ట్రంలోని మరో రెండు మఠాలకు సంబంధించి ఆస్తి వివాదాలు తలెత్తాయని, ఈ సందర్భంలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు సైతం వ్యక్తమయ్యాయని అన్నారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఇలాంటి సందర్భాల్లో మఠం ఆస్తుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.