Ministry of Economy
-
రుణ లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని రూ.10,000 కోట్లు కుదించుకుంది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడం దీనికి కారణం. భారీ పన్ను వసూళ్ల వల్ల ఉచిత రేషన్ పంపిణీపై అదనపు వ్యయం రూ.44,762 కోట్లు భర్తీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఇది కేంద్ర రుణ లక్ష్యాన్ని తగ్గించుకోడానికి సైతం దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విండ్‌ఫాల్ ట్యాక్స్ కూడా ఖజానాకు లాభం ఒనగూర్చనుందని వివరించింది. 2022–23 బడ్జెట్ రూ.14.31 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలను నిర్దేశించుకుంది. తాజా కేంద్ర నిర్ణయంతో ఇది రూ.14.21 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–మార్చి మధ్య రూ.5.92 లక్షల కోట్ల (రూ.14.21 లక్షల కోట్లలో రూ.41.7 శాతం) రుణ లక్ష్యాలను జరపాల్సి ఉంది. ఇందులో ఒక్క సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా రూ.16,000 కోట్ల సమీకరణలు జరపనుంది. కాగా, సెప్టెంబర్ 17 నాటికి 30 శాతం అధికంగా (2020–21తో పోల్చి) రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. -
ఎకానమీకి విస్తృత వ్యాక్సినేషన్ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని ఆర్థిక మంత్రిత్వశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలు పటిష్టంగా ఉండడంతోపాటు, వేగవంతంగా వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతుండడం, పండుగల సీజన్ వంటి అంశాలు దేశంలో డిమాండ్ రికవరీ పటిష్టతకు దారితీస్తున్నట్లు తెలిపారు. డిమాండ్–సరఫరాల్లో అంతరం తగ్గుతోందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరగుపడుతున్నాయని కూడా ఆర్థిక వ్యవస్థ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశ ఆర్థిక పునరుద్ధరణలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్, వ్యవస్థాగత సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆయా కార్యక్రమాలు, చర్యల వల్ల వ్యాపార అవకాశాలు, డిమాండ్, వ్యయాలు పెరుగుతున్నాయి. ► అధిక విస్తీర్ణంలో రబీ సాగు, మెరుగైన రిజర్వాయర్ స్థాయిలు, ఎరువులు, విత్తనాల విషయంలో రైతులకు తగినంత లభ్యత వంటి అంశాలు వ్యవసాయ రంగం పురోగతికి దోహద పడుతోంది. ఆర్థిక పునరుద్ధరణలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ► వ్యవసాయ–ఎగుమతుల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ విభాగంలో 22 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆయా అంశాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్‌లో ట్రాక్టర్లు, ద్విచక్ర, త్రి చక్ర వాహనాల విక్రయాలు పటిష్ట రికవరీని సూచిస్తున్నాయి. ► రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి, మార్కెట్లో తగినంత లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), బాండ్ల రేట్ల స్థిరత్వం వంటి అంశాలు ఎకానమీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ► బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రయోజనం వ్యవస్థలో ప్రతిబింబిస్తోంది. 2020 ఫిబ్రవరి– 2021 సెప్టెంబర్ మద్య తాజా రూపీ రుణాలపై సగటు రుణ రేటు 130 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిడం సానుకూలాంశం. ► భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని 2020–21 ఎకనమిక్ సర్వే పేర్కొంటోంది. పలు రేటింగ్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాలు 9–10 శాతం శ్రేణిలో ఉన్నాయి. -
ప్రభుత్వం నుంచి రెండో ఈటీఎఫ్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)ను ప్రారంభించాలని యోచిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా విక్రయానికి అదనపు మార్గంగా ఈ కొత్త ఈటీఎఫ్‌ను తేవాలనేది ఆర్థిక శాఖ ఆలోచన. 2014, మార్చిలో ప్రభుత్వం తొలి ఈటీఎఫ్‌ను ప్రారంభించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్(సీపీఎస్ఈ) ఈటీఎఫ్ పేరుతో అందించిన ఈ ఈటీఎఫ్‌లో 10 ప్రభుత్వ రంగ షేర్లున్నాయి. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతమున్న ఈ సీపీఎస్ఈ ఈటీఎఫ్‌కు అదనంగా మరో కొత్త ఈటీఎఫ్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపమ్) సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదిత ఈటీఎఫ్ ఏర్పాటు నిమిత్తం సలహాదారుల నుంచి బిడ్స్ కోరింది. వచ్చే నెల 11లోపు బిడ్స్ సమర్పించాలని పేర్కొంది.