మహారాష్ట్రతో బలమైన భాగస్వామ్య బంధం
ముంబై: మహారాష్ట్రతో బలమైన భాగస్వామ్య బంధం ఏర్పాటు చేసుకునేందుకు తమ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని రిపబ్లిక్ ఆఫ్ టటర్‌స్థాన్ అధ్యక్షుడు మిన్నిఖోవ్ స్పష్టం చేశారు. భారత పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన సందర్భంగా రాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లతో భేటీ అయ్యారు.
తమ దేశ అధిపతి వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత పర్యటనకు రానున్నారని, ఆ సమయంలో వివిధ అవగాహనా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకుంటామని అన్నారు. ముడి చమురు ఉత్పత్తిలో టటర్‌స్థాన్ ముందుందన్నారు. ప్రతి ఏడాది దాదాపు 33 మిలియన్ టన్నులమేర ముడిచమురును తాము ఉత్పత్తి చేస్తామన్నారు. రసాయనాలు, పెట్రో కెమికల్స్, యంత్రాలు, ట్రక్కులు, విమనానాలు, హెలికాపర్ ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు తమ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. టటర్‌స్థాన్, మహారాష్ర్ట మధ్య బంధం ఇరు రాష్ట్రాలకు ఉపయుక్తమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సిబ్బందితో గవర్నర్ జాతీయ సమగ్రతా ప్రతిజ్ఞ
కాగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 97వ జయంతి సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్‌రావు బుధవారం రాజ్‌భవన్ లో తన సిబ్బందితో జాతీయ సమగ్రతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు పాటుపడతామంటూ సిబ్బంది ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.