హడలెత్తిస్తున్న మైనర్లు
సాక్షి, సిటీబ్యూరో: అది అద్దె కారు.. వారంతా మైనర్లు. పైగా రాత్రి పదకొండున్నర గంటల సమయం. తమకు ఇక ఎదురే లేదనుకున్నారు. రోడ్డుపై అతివేగంతో దూసకుపోయారు. ఓ బైక్‌ను ఢీకొట్టారు. ఇద్దరి మృతికి కారణమయ్యారు. ఇటీవల సుచిత్ర వద్ద చోటుచేసుకున్న ఉదంతం ఇది. బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల అయాన్, చిన్నారి మేనత్త ప్రియదర్శిని అక్కడిక్కడే మృతిచెందారు. బైక్ నడిపిన సునీల్‌రాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచి వేసిన సంఘటన ఇది.
మరో సంఘటనలో నగర శివార్లలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు డ్రైవేజ్ ఇండియా ట్రావెల్స్ నుంచి బైక్‌ను అద్దెకు తీసుకొని అతివేగంతో దూసుకుపోయారు. ఈ క్రమంలో బండి అదుపు తప్పింది. ముగ్గురు కింద పడిపోయారు. కానీ బైక్‌ను నడుపుతున్న రణధీర్‌రెడ్డి తలకు హెల్మెట్ లేకపోవడం, అదే సమయంలో బస్సు చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
ఇలా అడ్డూఅదుపు లేకుండా డ్రైవింగ్ చేస్తున్న మైనర్లు హడలెత్తిస్తున్నారు. డ్రైవింగ్‌పై సరైన అవగాహన, నైపుణ్యం లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలపై కనీస పరిజ్ఞానం లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు పాల్పడుతున్నారు. అపరిమితమైన వేగంతో దూసుకెళ్తూ చివరకు వాహనాన్ని అదుపు చేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారుల ప్రాణాలు తీయడమే కాకుండా వారూ మృత్యువాత పడుతున్నారు. ఎక్కడికక్కడ లభిస్తున్న అద్దె వాహనాలు ఒకవైపు, ఎలాంటి పటిష్టమైన తనిఖీ వ్యవస్థ లేకుండా దళారుల సహాయంతో మైనర్లకు లభిస్తున్న డ్రైవింగ్ లైసెన్సులు మరోవైపు నగరంలో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
లైసెన్సు ఉంటే చాలు...
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనను పరీక్షించే లెర్నింగ్ లైసెన్సు తీసుకున్న నెల రోజుల తరువాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు ఇస్తారు. గేర్‌తో కూడిన బైక్‌లు, కార్లు నడిపేందుకు మైనర్లు అనర్హులు. వారు కేవలంగేర్లు లేని వాహనాలు నడపాలి. లైసెన్సు తీసుకునే సమయంలో రవాణా అధికారులు అభ్యర్థుల నివాసాన్ని, వయసును ధ్రువీకరిస్తారు. ఇటీవల కాలంలో డిగ్రీ కూడా పూర్తి చేయని చాలామంది పిల్లలు తేలిగ్గా డ్రైవింగ్ లైసెన్సులు కొట్టేస్తున్నారు. దళారుల సహాయంతో వయసును ఎక్కువ చేసే నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికెట్లను సమర్పించి డ్రైవింగ్ లైసెన్సులకు అర్హత సంపాదిస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఈ తరహా దందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఎక్కడికక్కడ వ్యవస్థీకృతంగా వేళ్లూనుకొనిపోయిన ఏజెంట్లు, దళారులు రవాణాశాఖ పౌరసేవలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. దీంతో ఒక్క వయసు నిర్ధారణ పత్రాల్లోనే కాకుండా అడ్రస్ ధ్రువీకరణ, వాహనాల డాక్యుమెంట్లు వంటి అనేక అంశాల్లో నకిలీ రాజ్యమేలుతోంది. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కేంద్రాల పరిధిలో ప్రతిరోజు సుమారు 1200 నుంచి 1500 లెర్నింగ్ లైసెన్సులు. అంతే సంఖ్యలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తారు. లెర్నింగ్ లైసెన్సుల కోసం నిర్వహించే పరీక్షల్లో గానీ, శాశ్వత లైసెన్సు కోసం డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో జరిపే పరీక్షల్లోనూ ఎలాంటి పర్యవేక్షణ ఉండదు. చాలా వరకు ఏజెంట్ల ప్రమేయంతోనే లైసెన్సులు ఇచ్చేస్తారు. దీంతో మైనర్లను గుర్తించడంలో ఆర్టీఏ అధికారులు విఫలమవుతున్నారు. ఇలా రోజుకు 25శాతం వరకు డ్రైవింగ్ లైసెన్సులు మైనర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇలా డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్న వారు అద్దె వాహనాల్లో దూరిపోయి రోడ్లపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.
తేలిగ్గా బైక్‌లు, కార్లు...
గ్రేటర్లో అద్దె వాహనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. అనేక సంస్థలు లగ్జరీ వాహనాలు, స్పోర్ట్స్ బైక్స్ నుంచి సాధారణ వాహనాల వరకు, హోండా యాక్టివా వంటి స్కూటర్ల వరకు అద్దెకి ఇస్తున్నాయి. నగరంలో ఇలాంటి ట్రావెల్స్ సంస్థలు చాలాచోట్ల అందుబాటులోకి వచ్చాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 7,190 బైక్‌లు, 69,660 కార్లు అద్దె ప్రాతిపదికన లభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటి సంఖ్య 1.12 లక్షలకు పైగా ఉంది. ట్రావెల్స్ సంస్థలే ఈ తరహా సెల్ఫ్ డ్రైవింగ్‌కు వాహనాలు అద్దెకు ఇస్తున్నాయి. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సును మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. వాహనాలు అద్దెకు ఇచ్చే సమయంలో వారి నైపుణ్యాన్ని గుర్తించడం లేదు. హోండా యాక్టివా వంటి వాహనాలను కిలోమీటర్‌కు రూ.20 చొప్పున, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లను కిలోమీటర్‌కు రూ.48 నుంచి రూ.50 చొప్పున ట్రావెల్స్ సంస్థలు అద్దెకు ఇస్తున్నాయి. పైగా ఒక రోజుకు, వారం రోజులకు, 30 రోజుల గడువుకు వాహనాలు అద్దెకు లభిస్తున్నాయి. కొన్ని సంస్థలు హోండా యాక్టివాకు రోజుకు రూ.288 నుంచి రూ.300 చొప్పున, నెలకు రూ.4,538 చొప్పున అద్దె విధిస్తున్నాయి. కేటీఎం డ్యూక్ రోజుకు రూ.1,299 వరకు ఉంది. నెల రోజులకు అయితే రూ.14,000 వరకు అద్దె ఉంటుంది. ఇక జూమ్ క్యాబ్స్ వంటి సంస్థలు మారుతీ స్విఫ్ట్‌ను 150 కిలోమీటర్లకు రూ.3,600 వరకు, 300 కిలోమీటర్లయితే రూ.5,000 వరకు అద్దె విధిస్తున్నాయి. వీకెండ్స్‌లో సిటీకి దూరంగా వెళ్లి పార్టీలు చేసుకోవాలనుకొనే కుర్రకారుకు, లాంగ్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకొనే వాళ్లకు ఈ అద్దెలు పెద్దగా భారం కాకపోవడం గమనార్హం. పైగా తల్లిదండ్రులకు తెలియకుం డా ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేసేందుకు అవకా శం లభిస్తుంది. వారి పర్యవేక్షణ, నిఘాకు దూరంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేయవచ్చు. యువత అభిరుచికి అనుగుణం గానే పలు సంస్థలు అద్దెలపై రాయితీలు ప్రక టిస్తున్నాయి. ఆన్లైన్లో తమ వద్ద లభించే వాహనాల సమాచాన్ని అందుబాటులో ఉం చుతున్నాయి. మొబైల్ యాప్‌ల ద్వారా కూడా రెంటల్ సేవలు అందజేస్తున్నాయి. రెంటల్ వాహనాల్లో స్పీడ్‌తో దూసుకెళ్తున్న మైనర్లు చివరకు ప్రమాదాలకు కారణమవుతున్నారు.