Minority College
-
గురుకుల కళాశాలలో డిప్యూటీ వార్డెన్ దారుణం.. విద్యార్థిని తంతూ, కొడుతూ..
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి చేశాడు. డార్మేటరీ రూమ్‌కు వెళ్లాడని.. తాను చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో.. విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ కొట్టాడు. రాజును కిందపడేసి కాళ్లతో తంతు పిడిగద్దులు కురిపించాడు. విద్యార్థి ప్రాదేయపడ్డా కూడా కనికరించకుండా మరింతగా రెచ్చిపోయాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. కాలేజీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లడంతో... డిప్యూటీ వార్డెన్ నయీమ్‌పై విచారణ చేపట్టారు. విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌ను సస్పెండ్ చేశామని రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ సయ్యద్ హమీద్ తెలిపారు. బాధిత విద్యార్థి రాజు స్వస్థలం జమ్మికుంట అని పేర్కొన్నారు. చదవండి👇 లంచం డిమాండ్ చేసిన డాక్టర్.. హరీష్‌రావు రియాక్షన్ ఇది సవతి తల్లి కర్కశం...మేడపై నుంచి తోసి..గొంతు నులిమి -
అడ్డగోలుగా బీఎడ్ సీట్ల అమ్మకం
మైనారిటీ కాలేజీల్లో మైనారిటీ విద్యార్థులకే రాని సీట్లు ఫిర్యాదులు రావడంతో ఆరా తీసిన ఉన్నత విద్యామండలి కాలేజీలకు అప్రకటిత సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు చర్యలకు సిద్ధమవుతున్న మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) ప్రవేశాల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. మైనారిటీ కాలేజీల్లో మైనారిటీ విద్యార్థులకే సీట్లు ఇవ్వలేదని వెల్లడైంది. మేనేజ్మెంట్ కోటానే కాదు.. కన్వీనర్ కోటాలోని సీట్లను కూడా మైనారిటీయేతర విద్యార్థులకు అడ్డగోలుగా అమ్ముకున్నట్లు తేలింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మైనారిటీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన సీట్ల వివరాలను సేకరించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలను తుంగలో తొక్కి ఒక్కో సీటును రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కన్వీనర్ కోటాలో తమకు సీటు వచ్చినా యాజమాన్యాలు ప్రవేశాలను నిరాకరిస్తున్నాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో స్పందించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశాల గడువును ఈనెల 29వ తేదీ వరకు పెంచింది. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. అయినా మండలి ఆదేశాలను యాజమాన్యాలు తుంగలో తొక్కాయి. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండా కాలేజీలకు అప్రకటిత సెలవులు ప్రకటించి తాళాలు వేసినట్లు తెలిసింది. సగం సీట్ల అమ్మకం... రాష్ట్రంలో 29 మైనారిటీ బీఎడ్ కాలేజీలు ఉండగా, ఒక్కో కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. అందులో కన్వీనర్ కోటాలో ఒక్కో కాలేజీలో 75 సీట్ల చొప్పున 2,175 సీట్లు ఉండగా, మేనేజ్మెంట్ కోటాలో ఒక్కో కాలేజీలో 25 సీట్ల చొప్పున 725 సీట్లు ఉంటాయి. కన్వీనర్ కోటాలోని 2,175 సీట్లను మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కేటాయించిన మైనారిటీ విద్యార్థులకే ఇవ్వాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మైనారిటీ విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లలో చేరకపోతే ఆ తరువాత నాన్ మైనారిటీ విద్యార్థులకు ఆ సీట్లను కేటాయించాలి. కాని కొన్ని యాజమాన్యాలు మినహా మిగతా కాలేజీలు కన్వీనర్ కోటాలో సీటు పొందిన మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు ధర్నా చేసి, మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీంతో ఉన్నత విద్యా మండలి కాలేజీల్లో ప్రవేశాల వివరాలను సేకరించింది. పలు యాజమాన్యాలు తప్పిదాలకు పాల్పడినట్లు అందులో బయట పడ్డాయి. కన్వీనర్ కోటాలోని 2,175 సీట్లలో సగం వరకు అమ్ముకున్నట్లు తెలిసింది. పైగా మండలి ప్రవేశాల గడువును పెంచి, సీటు వచ్చిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ఆదేశించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధం అవుతోంది. -
స్టువర్టుపురం దొరలు
తపాలా అది 2004వ సంవత్సరం. బ్యాంకు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతూ, తెనాలిలో ఉంటున్న రోజులు. ఆ సమయంలో బంధువులమ్మాయికి బీఈడీ అప్లికేషన్ కోసం నన్ను సంప్రదిస్తే, నేను అవి తెచ్చివ్వటానికి సరేనన్నాను. ఆ అమ్మాయికొచ్చిన ర్యాంకు, ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్‌కు తృటిలో తప్పిపోయిన ర్యాంకు. మైనార్టీ కళాశాలలో తప్పక సీటు వచ్చే ర్యాంకు. అప్పుడు బీఈడీ యేడాది మాత్రమే. రాబోయే రోజుల్లో దీన్ని రెండేళ్లు చేస్తారనే వార్తలు రావడంతో, ఎట్లయినా ఆ యేడాదే జాయిన్ చేయాలనే దృఢ నిశ్చయంతోటి, నేను మైనార్టీ కళాశాలల వివరాలు తెలుసుకుని, అప్లికేషన్లు తీసుకురావడానికి బయల్దేరాను. గుంటూరు, ఒంగోలు, తర్లుబాడు మొదలైన ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు వెళ్లడానికి ప్యాసింజర్ రైల్లో ఒంగోలు వెళ్లాను. ప్యాసింజరే ఎందుకంటే, కొత్త ప్రాంతాన్ని ఇందులోనైతే చూస్తూ పోవచ్చని! ప్రతి స్టేషన్లో ఆగుతుంది కాబట్టి. వెళ్తుండగా దారిలో ‘స్టువర్ట్ పురం’ స్టేషన్ తగిలింది. అక్కడా ఇక్కడా చదవడం, వినడం వల్ల అచేతనంగా నా చేతులు జేబులు తడమడం, ‘హమ్మయ్య పర్స్ ఉన్నది’ అనుకోవడం జరిగిపోయింది. నా చర్యకు నాకే నవ్వొచ్చింది. ఆ తర్వాత, క్షేమంగా వెళ్లడం, తిరిగి రావడం జరిగింది. మరుసటిరోజు నా ప్రయాణం తర్లుబాడు గ్రామం. మామూలుగానే ప్యాసింజర్‌లో బయల్దేరాను. ఆ కొత్త ప్రాంతాలు పరిశీలిస్తూ సమయం తెలియకుండా సాగిపోయింది ప్రయాణం. తిరుగు ప్రయాణంలో కాలేజీ దగ్గరలోని కాఫీ హోటల్లో టీ, టిఫిన్ తీసుకుని బిల్లు పే చేయడానికి జేబులో చెయ్యి పెట్టి హతాశుడనయ్యాను. అన్ని జేబులూ ఒకటికి రెండుసార్లు తడుముకున్నాను. పర్సు లేదు, డబ్బులు లేవు అనుకొన్నంతనే ఒక విధమైన టెన్షన్! ఏం చేయాలో పాలుపోలేదు. ఆలోచించి మెల్లగా సర్వర్ చెవిలో వేశాను విషయం. ‘‘మీ బిల్లే కాదు, నేను తిరిగి ఇంటికి చేరడానికి కూడా డబ్బుల్లేవు. ఈ నా వాచీని పెట్టుకుని, ఓ వంద రూపాయలు మీ సేఠ్‌తో ఇప్పించు’’ అన్నాను. అతను చెప్పడం, నాకు సైగ చేయడం, నేవెళ్లి వాచీని ఇవ్వడం, ఓసారి వాచీని కిందా మీదా చూసి వంద రూపాయలు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇక వాచీ గురించి చింత మొదలైంది నాకు. మరలా దీనికోసం ఇంకో రోజు తిరిగి రావాలిక్కడకు. ఎంత లేదన్నా రాను పోను నాలుగైదు గంటలపైనే. ‘ఏం చేద్దాం’ అని ఆలోచించి, రైల్వేస్టేషన్లో నాతోపాటు ప్యాసింజర్‌కు ఎదురుచూస్తున్న నా ఇంటి దగ్గర ప్రాంతం వాళ్లని ఒకరిద్దరిని కదిపి విషయాన్ని చెప్పాను - ‘ఓ వంద సర్దితే, నా వాచీ తెచ్చేసుకుని వారికి వెళ్లిన వెంటనే ఇస్తా’నని! ఓ ఒక్కరూ సహాయానికి రాలేదు. ఇంకా మరికొందరితో పంచుకుని పలుచన అయ్యేకంటే రేపు మళ్లీ రావడమే మంచిదనుకొని నిశ్చింతగా ఇంటికి చేరాను. చేరానే గాని, నా మది నిండా నా వాచీ తలంపే. తీరా వెళ్లిన తర్వాత తీసుకున్నతనే ఉంటాడా, మరొకరు ఉంటారా? తెల్లారింది. ఎప్పుడెప్పుడా అనుకుంటూ ప్యాసింజర్ పట్టుకుని వెళ్లాను. వెళుతూనే హోటల్లో అదే వ్యక్తి కౌంటర్లో ఉండటం, నేను వంద నోటు కౌంటర్‌పై పెడుతూ ‘వాచీ’ అనడం, అతను వంద నోటు గల్లాపెట్టెలో వేసుకుని, అదే పెట్టె నుండి నా వాచీని తీసివ్వడం... నా మనసు కుదుటపడింది. అక్కడే టిఫిన్, టీ సేవించి, మరొక్కసారి అతడికి కృతజ్ఞతలు చెప్పి తిరుగుప్రయాణమయ్యాను. నన్ను సమయానికి ఆదుకొన్న నను వీడని నా వాచీ తిరిగి నా చేతిని చిద్విలాసంగా అలంకరించింది.1984లో కొన్న నా ఆల్విన్ వాచీ ఇప్పటికీ తిరుగుతూ, నాతోనే తిరుగుతూ ఉంటుంది. ఒకే ఒక్కసారి రిపేరుకు వచ్చింది. అప్పుడు రిపేరులో సరైన మెటీరియల్ వాడకపోవడం చేతనో, ఆ మెటీరియల్ దొరకకపోవడం చేతనోగానీ రోజుకు ఓ పది నిమిషాలు వేగంగా తిరుగుతూ ఇంకా తిరుగుతూనే ఉంటాను అన్నట్లుగా ఉంటుంది. అంతా బాగుండి అది ఇంకో 30 యేళ్లు నాతోనే ఉండాలని కోరుకుంటున్నా. ఇంతకీ, ‘స్టువర్ట్ పురం’లో మాయమవుతుందనుకున్న పర్సు, తర్లుబాడులో ఎలా మాయమైందన్న విషయం ఇప్పటికీ అర్థం కాలేదు. - ప్రభాకర్, ఓరుగల్లు ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com డిజైన్: కుసుమ