స్టువర్టుపురం దొరలు | Stuvartupuram Richers | Sakshi
Sakshi News home page

స్టువర్టుపురం దొరలు

Published Sun, Oct 26 2014 1:12 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

స్టువర్టుపురం దొరలు - Sakshi

స్టువర్టుపురం దొరలు

తపాలా
అది 2004వ సంవత్సరం. బ్యాంకు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతూ, తెనాలిలో ఉంటున్న రోజులు.
 ఆ సమయంలో బంధువులమ్మాయికి బీఈడీ అప్లికేషన్ కోసం నన్ను సంప్రదిస్తే, నేను అవి తెచ్చివ్వటానికి సరేనన్నాను. ఆ అమ్మాయికొచ్చిన ర్యాంకు, ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్‌కు తృటిలో తప్పిపోయిన ర్యాంకు. మైనార్టీ కళాశాలలో తప్పక సీటు వచ్చే ర్యాంకు. అప్పుడు బీఈడీ యేడాది మాత్రమే. రాబోయే రోజుల్లో దీన్ని రెండేళ్లు చేస్తారనే వార్తలు రావడంతో, ఎట్లయినా ఆ యేడాదే జాయిన్ చేయాలనే దృఢ నిశ్చయంతోటి, నేను మైనార్టీ కళాశాలల వివరాలు తెలుసుకుని, అప్లికేషన్లు తీసుకురావడానికి బయల్దేరాను.
 
గుంటూరు, ఒంగోలు, తర్లుబాడు మొదలైన ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు వెళ్లడానికి ప్యాసింజర్ రైల్లో ఒంగోలు వెళ్లాను. ప్యాసింజరే ఎందుకంటే, కొత్త ప్రాంతాన్ని ఇందులోనైతే చూస్తూ పోవచ్చని! ప్రతి స్టేషన్‌లో ఆగుతుంది కాబట్టి. వెళ్తుండగా దారిలో ‘స్టువర్ట్ పురం’ స్టేషన్ తగిలింది. అక్కడా ఇక్కడా చదవడం, వినడం వల్ల అచేతనంగా నా చేతులు జేబులు తడమడం, ‘హమ్మయ్య పర్స్ ఉన్నది’ అనుకోవడం జరిగిపోయింది. నా చర్యకు నాకే నవ్వొచ్చింది. ఆ తర్వాత, క్షేమంగా వెళ్లడం, తిరిగి రావడం జరిగింది.
 మరుసటిరోజు నా ప్రయాణం తర్లుబాడు గ్రామం. మామూలుగానే ప్యాసింజర్‌లో బయల్దేరాను. ఆ కొత్త ప్రాంతాలు పరిశీలిస్తూ సమయం తెలియకుండా సాగిపోయింది ప్రయాణం.

తిరుగు ప్రయాణంలో కాలేజీ దగ్గరలోని కాఫీ హోటల్‌లో టీ, టిఫిన్ తీసుకుని బిల్లు పే చేయడానికి జేబులో చెయ్యి పెట్టి హతాశుడనయ్యాను.  అన్ని జేబులూ ఒకటికి రెండుసార్లు తడుముకున్నాను. పర్సు లేదు, డబ్బులు లేవు అనుకొన్నంతనే ఒక విధమైన టెన్షన్! ఏం చేయాలో పాలుపోలేదు. ఆలోచించి మెల్లగా సర్వర్ చెవిలో వేశాను విషయం. ‘‘మీ బిల్లే కాదు, నేను తిరిగి ఇంటికి చేరడానికి కూడా డబ్బుల్లేవు. ఈ నా వాచీని పెట్టుకుని, ఓ వంద రూపాయలు మీ సేఠ్‌తో ఇప్పించు’’ అన్నాను. అతను చెప్పడం, నాకు సైగ చేయడం, నేవెళ్లి వాచీని ఇవ్వడం, ఓసారి వాచీని కిందా మీదా చూసి వంద రూపాయలు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.
 
ఇక వాచీ గురించి చింత మొదలైంది నాకు. మరలా దీనికోసం ఇంకో రోజు తిరిగి రావాలిక్కడకు. ఎంత లేదన్నా రాను పోను నాలుగైదు గంటలపైనే. ‘ఏం చేద్దాం’ అని ఆలోచించి, రైల్వేస్టేషన్‌లో నాతోపాటు ప్యాసింజర్‌కు ఎదురుచూస్తున్న నా ఇంటి దగ్గర ప్రాంతం వాళ్లని ఒకరిద్దరిని కదిపి విషయాన్ని చెప్పాను - ‘ఓ వంద సర్దితే, నా వాచీ తెచ్చేసుకుని వారికి వెళ్లిన వెంటనే ఇస్తా’నని!
 ఓ ఒక్కరూ సహాయానికి రాలేదు. ఇంకా మరికొందరితో పంచుకుని పలుచన అయ్యేకంటే రేపు మళ్లీ రావడమే మంచిదనుకొని నిశ్చింతగా ఇంటికి చేరాను. చేరానే గాని, నా మది నిండా నా వాచీ తలంపే. తీరా వెళ్లిన తర్వాత తీసుకున్నతనే ఉంటాడా, మరొకరు ఉంటారా? తెల్లారింది. ఎప్పుడెప్పుడా అనుకుంటూ ప్యాసింజర్ పట్టుకుని వెళ్లాను. వెళుతూనే హోటల్‌లో అదే వ్యక్తి కౌంటర్‌లో ఉండటం, నేను వంద నోటు కౌంటర్‌పై పెడుతూ ‘వాచీ’ అనడం, అతను వంద నోటు గల్లాపెట్టెలో వేసుకుని, అదే పెట్టె నుండి నా వాచీని తీసివ్వడం... నా మనసు కుదుటపడింది.
 
అక్కడే టిఫిన్, టీ సేవించి, మరొక్కసారి అతడికి కృతజ్ఞతలు చెప్పి తిరుగుప్రయాణమయ్యాను. నన్ను సమయానికి ఆదుకొన్న నను వీడని నా వాచీ తిరిగి నా చేతిని చిద్విలాసంగా అలంకరించింది.1984లో కొన్న నా ఆల్విన్ వాచీ ఇప్పటికీ తిరుగుతూ, నాతోనే తిరుగుతూ ఉంటుంది. ఒకే ఒక్కసారి రిపేరుకు వచ్చింది. అప్పుడు రిపేరులో సరైన మెటీరియల్ వాడకపోవడం చేతనో, ఆ మెటీరియల్ దొరకకపోవడం చేతనోగానీ రోజుకు ఓ పది నిమిషాలు వేగంగా తిరుగుతూ ఇంకా తిరుగుతూనే ఉంటాను అన్నట్లుగా ఉంటుంది. అంతా బాగుండి అది ఇంకో 30 యేళ్లు నాతోనే ఉండాలని కోరుకుంటున్నా. ఇంతకీ, ‘స్టువర్ట్ పురం’లో మాయమవుతుందనుకున్న పర్సు, తర్లుబాడులో ఎలా మాయమైందన్న విషయం ఇప్పటికీ అర్థం కాలేదు.
 - ప్రభాకర్, ఓరుగల్లు

ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు,
 మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
 మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
 రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.  funday.sakshi@gmail.com
 డిజైన్: కుసుమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement