ఉత్తర కొరియా క్షిపణి పేలింది!
ఆయుధ బలప్రదర్శన మరునాడే పరీక్ష విఫలం
సియోల్: ఉత్తర కొరియా క్షిపణి ఒకటి పరీక్షిస్తుండగా పేలిపోయిందని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. తూర్పు తీరంలో సిన్పోలో ఆదివారం హై ప్రొఫైల్ క్షిపణి పరీక్ష విఫలమైనట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నదని చెప్పారు. అమెరికాను పరోక్షంగా సవాలు చేస్తూ సైనిక వార్షిక దినోత్సవం సందర్భంగా భారీ ఆయుధ బలసంపత్తి ప్రదర్శనతో ఉత్తర కొరియా శనివారం హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరునాడు చేపట్టిన క్షిపణి పరీక్ష ఇలా విఫలం కావడం ఉత్తరకొరియాకు ఎదురుదెబ్బగా మారింది.
ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని కట్టడి చేసేందుకు అమెరికా కొరియా ద్వీపకల్పంలో తన భారీ వైమానిక యుద్ధనౌకను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాను సవాల్ చేసేందుకు, తన ఆయుధ బలాన్ని చాటుకునేందుకు కొరియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ క్షిపణి పరీక్షను చేపట్టారని, అయితే, ఏ రకమైన క్షిపణి, దీని సామర్థ్యం ఎంత అనే వివరాలు తెలియదని అధికార వర్గాలు తెలిపాయి.